గాంధీ ఆస్ప్రతికి తరలించిన ఏపీహెచ్ఓ
అనుమానమే కానీ లక్షణాలు లేవు : డాక్టర్ వాణి
నవతెలంగాణ – శంషాబాద్
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో సుడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి జ్వరంగా ఉండటం గుర్తించిన అధికారులు థర్మల్ స్క్రీనింగ్ చేసి ‘గాంధీ’కి తరలించారు. ఏపీహెచ్ఓ తెలిపిన వివరాల ప్రకారం.. సుడాన్ దేశం నుంచి మహమ్మద్ యహ్యా యాకుబ్ అహ్మద్ అనే వ్యక్తి తెల్లవారుజామున 3:10గంటలకు ఈటీ-682 విమానంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాగా, ప్రోటోకాల్ ప్రకారం విమానాశ్రయ ఆరోగ్య అధికారి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై సాధారణ నిఘా చర్యల్లో భాగంగా నిర్వహించిన థర్మల్ స్క్రీనింగ్‌లో అతనికి జ్వరం ఉన్నట్టు గుర్తించారు. అతని ప్రయాణం, లక్షణాల కారణంగా ముందు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎబోలా నిర్ధారణ కోసం నమూనాలను సేకరించి సీసీఎంబీకి పంపించారు. కాగా, పరీక్షా ఫలితాలు 48 గంటల్లోగా రానున్నాయి. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఎబోలా అనుమానితుడిని గుర్తించారన్న సోషల్ మీడియా ప్రచారాలను గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎన్. వాణి తోసిపుచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ఇది ఎబోలా అనుమానిత కేసు కాదని, అతను వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన సూడాన్ ప్రయాణికుడని తెలిపారు.
విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ సమయంలో జ్వరం గుర్తించడంతో అతడిని ఐసోలేషన్‌కు పంపించారని అన్నారు. ఒకవేళ రిపోర్టులు నెగటివ్‌గా వచ్చి, రోగి పరిస్థితి నిలకడగా ఉంటే, అతడిని డిశ్చార్జ్ చేస్తామని, హోమ్ క్వారంటైన్‌లో ఉండొచ్చని తెలిపారు. ఇదే విషయమై ఏపీహెచ్ఓ అధికారులు మాట్లాడుతూ.. ఆ ప్రయాణికుడిని ఎబోలా అనుమానిత రోగిగా వర్గీకరించలేదని, అతని ప్రయాణం, లక్షణాల కారణంగా ముందుజాగ్రత్త పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. 30 ఏండ్ల వయసున్న ఆ వ్యక్తి.. ఇథియోపియా నుంచి హైదరాబాద్‌కి వచ్చారు. ఇటీవల ఉగాండా, దక్షిణ సూడాన్‌లోనూ పర్యటించాడన్నారు. అతను రెండు, మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, వైరల్ హెమరేజిక్‌కి సంబంధించిన ఇతర లక్షణాలేవీ అతనిలో కనిపించలేదని, ఈ దశలో ఈ కేసును ఎబోలా అనుమానిత కేసుగా పరిగణించొద్దని తెలిపారు.
భారత్లో ముగ్గురు ఎబోలా వైరస్ అనుమానితుల గుర్తింపు
ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఆందోళనల నేపథ్యంలో భారత్లోనూ వైరస్ కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఎబోలా వైరస్ అనుమానితులను గుర్తించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కాంగో, ఇథియోపియా, ఉగాండా దేశాల నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ అభిజిత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురు వ్యక్తుల ఆచూకీని గుర్తింపు, వారి పర్యవేక్షించే ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర సంస్థల నుంచి అందిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే, ఇప్పటివరకు వారిలో ఎవరికీ ఎబోలా సోకినట్లు నిర్ధారణ కాలేదని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ ముగ్గురు వ్యక్తులను గృహ నిర్బంధంలోనే వైద్య పర్యవేక్షణలో ఉంచినట్టు పేర్కొంది.



