ప్యాకేజీ-1 పంపుహౌజ్ పనులు వేగవంతం
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
నారాయణపేటలో ప్రాజెక్టుల ఏరియల్ సర్వే..
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
సాంకేతిక సమస్యలు ఎన్ని ఎదురైనా మక్తల్- నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భీమా, కృష్ణా నదులపై మొదలు పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాను వ్యవసాయంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని తెలిపారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్- నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా మక్తల్ మండలం కాట్రేవుపల్లి సమీపంలో జరుగుతున్న ఫేజ్ -1 పంపుహౌజ్ పనులను సీఎం గురువారం పరిశీలించారు. మక్తల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కర్నాటక మంత్రి బోసు రాజుకు జిల్లా కలెక్టర్ సిహెచ్.ప్రియాంక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫొటో గ్యాలరీని ముఖ్యమంత్రి వీక్షించారు. మక్తల్ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాద బ్యారేజీ పనుల పురోగతికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ ద్వారా ఇరిగేషన్ అధికారులు వివరించారు.
ఆ తర్వాత సీఎం, మంత్రులు కాట్రేవుపల్లి గ్రామ సమీపంలో మక్తల్ -నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ప్యాకేజ్ -1 పనులను పరిశీలించారు. పంప్‌హౌజ్ పనులు ఎంత శాతం పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీటు పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అక్కడి నుంచి ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మక్తల్ -నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అనంతరం కోయిల్‌సాగర్, ప్రియదర్శిణీ జూరాల ప్రాజెక్టు, కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఏరియల్ ద్వారా పరిశీలించారు. తర్వాత గుడెందొడ్డి రిజర్వాయర్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ ద్వారా కొల్లాపూర్ మండలం సోమశిల చేరుకున్నారు. మంత్రులతో కలిసి అధికారులు, కలెక్టర్లతో సమీక్షించారు. ప్రాజెక్టు పనుల్లో వస్తున్న అడ్డంకులను ఎలా అధిగమించాలో సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, చీఫ్ ఇంజినీరు ఏ.సత్య నారాయణరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ హెచ్‌టి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



