Friday, May 23, 2025
Homeఅంతర్జాతీయంసంక్షోభంలో వినోద రంగం

సంక్షోభంలో వినోద రంగం

- Advertisement -

– ట్రంప్‌ టారిఫ్‌లపై హాలివుడ్‌లో ఆగ్రహం
లాస్‌ ఏంజెల్స్‌:
విదేశాల్లో తయారయ్యే చలన చిత్రాలపై వంద శాతమూ టారిఫ్‌లు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం చేసిన ప్రకటన హాలివుడ్‌ వ్యాప్తంగా, అంతర్జాతీయ వినోద పరిశ్రమలోనూ పలు ప్రకంపనలు సృష్టించింది. దీంతో నెట్‌ప్లిక్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌, డిస్కవరీ కార్పొరేషన్‌ సహా వినోద సంస్థలు, కంపెనీల షేర్లు పడిపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన, అభివృద్ధి చెందుతున్న వినోద రంగం ఈ విధానంతో సంక్షోభానికి గురవుతుందని ప్రధాన స్టూడియోలు, స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫారమ్‌ల ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. హాలివుడ్‌ ప్రొడక్షన్‌ వ్యయంపై మొత్తంగా లేదా కొన్నింటిపై వంద శాతం సుంకాలు విధించినట్లైతే భవిష్యత్తులో సినీ నిర్మాణ వ్యయం పెచ్చరిల్లిపోతుందని, చిత్రాల సంఖ్య తగ్గిపోవడానికి దారి తీస్తుందని మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఆలోచనే సరైంది కాదని వారు వ్యాఖ్యానించారు. అయితే ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని సోమవారం వైట్‌హౌస్‌ ప్రతినిధి కుష్‌ దేశారు తెలిపారు. అయితే హాలివుడ్‌ను మహత్తరంగా తీర్చి దిద్దుతూనే, దేశ జాతీయ, ఆర్థిక భద్రతను పరిరక్షించేందుకై ట్రంప్‌ ఆదేశాల అమలుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఈ దశలో ట్రంప్‌ ఉద్దేశాలపై సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువుగా వున్నాయని హాలివుడ్‌ పరిశ్రమకి చెందిన ప్రధాన వార్తాసంస్థ వెరైటీ ఒక నివేదికలో పేర్కొంది. అనేక చిత్రాలు బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, హంగేరి, కెనడాలతో సహా పలు దేశాల్లో షూటింగ్‌లు పూర్తి చేసుకుంటాయని,అటువంటపుడు ఏ ప్రాతిపదికన విదేశీ చిత్రంగా పరిగణిస్తారో తెలియడం లేదని నివేదిక వ్యాఖ్యానించింది. ట్రంప్‌ టారిఫ్‌ల వల్ల ఇతర దేశాలు ప్రతీకార చర్యలకు దారి తీసే ముప్పు పొంచి వుందని మరికొన్ని వార్తా సంస్థలు హెచ్చరించాయి. అంతర్జాతీయ వాణిజ్య చట్టం కింద చలన చిత్రాలనేవి సేవలన్ని, ఉత్పత్తులు కావని మరికొందరు పరిశ్రమ ప్రముఖులు వ్యాఖ్యానించారు. అందువల్ల వాటిని టారిఫ్‌ల నుంచి మినహాయించాల్సిందేనని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -