16 నుంచి ఆగస్టు 13 వరకు ఉత్సవాలు
3,427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుదల
జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆషాఢ మాసం బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. జులై 16న గోల్కొండ కోటలో ప్రారంభమై, ఆగస్టు 13 వరకు నగరం నలుమూలలా జరిగే ఈ ఉత్సవాల కోసం వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
నగరంలోని పురాతన బస్తీలు, ప్రధాన కూడళ్లలోని దేవాలయాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. పాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని 3,427 దేవాలయాలకుగాను రూ.15,05,41,150 నిధులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో విడుదల చేసినట్టు మంత్రి పొన్నం పేర్కొన్నారు. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని లైన్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి వసతులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఉత్సవాల ప్రధాన షెడ్యూల్..
ఈనెల 16న గోల్కొండ శ్రీజగదాంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు (20న ఎదుర్కోలు, 21న కల్యాణం, 22న రథోత్సవం), ఆగస్టు 2, 3వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, రంగం కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 9న లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారితోపాటు నగరవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో బోనాలు ఉంటాయి.
శాఖల మధ్య సమన్వయం
బోనాల జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీస్, జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్యారోగ్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. రహదారుల మరమ్మతులు, విద్యుద్దీపాలంకరణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా, అక్కన్న-మాదన్న, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంతో పాటు 30 ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని వివరించారు.
ఆషాఢం బోనాల జాతరకు సర్వం సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



