అది 2023 నవంబర్… వి. శ్రీపతి చెన్నైలోని ఒక పరీక్షా హాలులోకి అడుగుపెట్టింది. ఆమె చేతిలో కేవలం పెన్ను, అడ్మిట్ కార్డు మాత్రమే లేవు. రెండు రోజుల కిందటే ఆమె జన్మనిచ్చిన నవజాత శిశివు కూడా ఉంది. పచ్చి బాలింతరాలు. అటువంటి పరిస్థితుల్లోనూ తన గ్రామం నుండి 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి పరీక్ష రాసేందుకు వచ్చింది. 23 ఏండ్ల ఆ యువతి సివిల్ జడ్జి పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నిశ్చయించుకుని ఈ సాహసం చేసింది. ఈరోజు ఆమె సంకల్పం ఓ చరిత్ర సృష్టించింది. ఓ తల్లి ఆనాడు తీసుకున్న అసాధారణ నిర్ణయం నేడు స్ఫూర్తిదాయక కథగా మార్చింది. ఈ రోజు, ఆమె కథ కేవలం విద్యావిజయానికి సంబంధించినది మాత్రమే కాదు. ఎంతో మంది యువతులకు ఆదర్శనీయంగా నిలిచిన ఆమె విజయగాథ గురించి నేటి మానవిలో…
వి. శ్రీపతి తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో ఉన్న తువింజికుప్పం అనే మారుమూల గ్రామంలో పుట్టింది. ఈ గ్రామం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలలో ఉంది. ఇక్కడ ప్రాథమిక మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉంటాయి. సరైన రోడ్లు లేవు, పాఠశాలలు చాలా దూరంలో ఉన్నాయి. వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే బస్ స్టాప్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆమె తండ్రి ఎస్. కలియప్పన్, సాధారణ రైతు. ఆమె తల్లి కె. మల్లిగ కుటుంబాన్ని పోషించడానికి ఇండ్లల్లో పనులు చేసేవారు. తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం, ఆ కుటుంబం కొంత కాలానికి యలగిరి కొండలలోని అథనవూర్ గ్రామానికి తరలివెళ్లింది. ఆ దంపతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ తమ ముగ్గురు పిల్లలైన శ్రీపతి, శరణ్య, సూర్యప్రకాష్‌లను చదివించారు.
పట్టుదలను గుర్తించి
ఆ తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడినా పిల్లల చదువుకే ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీపతి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు అథనవూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివింది. ఆ తర్వాత ఉన్నత మాధ్యమిక పాఠశాలలో ప్యూర్ సైన్స్ తీసుకుని 2016-17లో తన చదువును పూర్తి చేసింది. ఉపాధ్యాయులు ఆమెలోని పట్టుదలను గుర్తించారు. ‘ఆమె శ్రద్ధగా చదివే విద్యార్థి. పాఠశాల పరీక్షలలో ఆమె ఎప్పుడూ 75 శాతానికి పైగా మార్కులు సాధించేది. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత కూడా ఆమె తన ఆలోచనలను పంచుకోవడానికి పాఠశాలకు వస్తూ ఉండేది’ అని ఆమె పాఠశాల ప్రిన్సిపాల్ ఓ వెబ్‌సైట్‌తో గుర్తుచేసుకున్నారు.
తన సమాజం రూపుదిద్దుకున్న కల
శ్రీపతికి న్యాయమూర్తి కావాలని ఏదో సాధారణంగా అనుకోలేదు. చిన్నప్పటి నుండి తన సమాజంలోని వారు న్యాయపరమైన సమస్యలతో, తమ హక్కుల పట్ల అవగాహన లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో దగ్గరగా చూసింది. ఆ అనుభవమే ఆమెను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేసింది. ‘న్యాయశాస్త్రం అభ్యసించడానికి ముందు నా పాఠశాల విద్య మొత్తం యలగిరి కొండల్లోనే పూర్తి చేశాను. నా సమాజ ప్రజలకు వారి చట్టపరమైన హక్కుల గురించి తెలియదు కాబట్టి, వారికి న్యాయ సహాయం అందించాలనే ఉద్దేశ్యంతోనే న్యాయశాస్త్ర కోర్సు చేశాను’ అని శ్రీపతి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీని అభ్యసించింది. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే తన ఉన్నత లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయింది. ఆమె కేవలం ఒక న్యాయవాదిగా మాత్రమే కాకుండా, న్యాయవ్యవస్థలోనే వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించగల వ్యక్తిగా తన సమాజానికి తిరిగి రావాలని కోరుకుంది.
వివాహం ఆ కలను ఆపలేదు
గ్రామీణ భారతదేశంలోని చాలా మంది అమ్మాయిల మాదిరిగానే శ్రీపతికి కూడా త్వరగానే పెండ్లి జరిగింది. అంబులెన్స్ డ్రైవరైన ఎస్. వెంకటేశన్‌ను పెండ్లి చేసుకుంది. కానీ పెండ్లి ఆమె లక్ష్యాన్ని మార్చలేదు. చెంగం సమీపంలోని పులియూర్ గ్రామంలోని తన అత్తగారింటి నుండే చదువును కొనసాగించింది. పుస్తకాలు, నోట్స్, ప్రిపరేషన్ మెటీరియల్స్ ఆమె దినచర్యలో భాగమయ్యాయి. ఆమె భర్త, కుటుంబ మద్దతు చాలా కీలకమైనది. ఇంటి బాధ్యతలు పెరిగినప్పటికీ ఆమె తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ జడ్జి పరీక్షపైనే దృష్టి సారించింది. పెళ్లి తర్వాత తన కోరికలకు భర్త అడ్డుచెప్పకపోగా, పూర్తి మద్దతునిచ్చాడు. తన కలలను సాకారం చేసుకోవడానికి దోహదపడిన తన తల్లికి కూడా ఆమె ఈ ఘనతను ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఆమె సంకల్పానికి అతిపెద్ద పరీక్ష ఎదురైంది.
దేశం దృష్టిని ఆకర్షించిన ప్రయాణం
నవంబర్ 2023లో కుమార్తెకు జన్మనిచ్చిన కేవలం రెండు రోజుల తర్వాత శ్రీపతి సివిల్ జడ్జి పరీక్ష రాయడానికి సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించి చెన్నైకి వెళ్లింది. ఆమె భర్త కూడా ఆమెతో పాటు వెళ్లాడు. చాలా మంది మహిళలు అప్పటికి ఆసుపత్రిలోనే ఉంటారు. కానీ శ్రీపతి పరీక్షా హాలులో కూర్చుని ఉంది. ఆ తర్వాత తన పసికందును పట్టుకుని టీఎన్‌పీఎస్సీ కార్యాలయం బయట నిలబడిన ఆ తల్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఆ ఫొటో వెనుక ఆమె రోజుల తరబడి అనుభవించిన శారీరక నొప్పి, భావోద్వేగ త్యాగం, అచంచలమైన ఏకాగ్రత ఉన్నాయి.
23 ఏండ్లకే చరిత్ర సృష్టిస్తూ…
కేవలం 23 ఏండ్ల వయసులోనే శ్రీపతి తమిళనాడు సివిల్ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఈ ఘనతతో ఆమె తమిళనాడులో మలయాళీ గిరిజన సమాజం నుండి మొట్టమొదటి సివిల్ జడ్జి అయ్యింది. ఆమె తిరిగి గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన, గ్రామీణ ప్రాంత యువతులకు వృత్తిపరమైన అవకాశాలు అసాధ్యం. అటువంటి దాన్ని శ్రీపతి సుసాధ్యం చేసింది. సరైన రోడ్లు లేని అటవీ గ్రామం నుండి కోర్టు గది వరకు, ఒక రైతు కుమార్తె నుండి సివిల్ జడ్జి వరకు ఆమె జీవితం శక్తిని ప్రతిబింబిస్తుంది. పేదరికం, భౌగోళిక పరిస్థితులు, వివాహం, మాతృత్వం సైతం కలలు సాకారం చేసుకోగలవని ఆమె నిరూపించింది. ఒకప్పుడు యలగిరి కొండల్లో చదువుకున్న ఆ యువతి ఇప్పుడు సివిల్ జడ్జి.



