ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
నవతెలంగాణ-సంగారెడ్డి
గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు తదితరాలను తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రతీక్ జైన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం, 1968లోని సెక్షన్ 20 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని ప్రాంతాలను మినహాయించి, సంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోని అన్ని ఏ 4 మద్యం దుకాణాలు, 2-బి బార్లు, కల్లు దుకాణాలు/కల్లు డిపోలు, సి ఎస్-2 క్యాంటీన్లు మూసివేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మూసివేత 2026 సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచి సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో పాటు భారీ ఊరేగింపులు జరిగే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం, ప్రజల భద్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఉత్తర్వులను ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల నిర్వాహకులు ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.



