నాలుగో స్థంభమంటారు.. గుర్తింపు ఇవ్వాల్సినప్పుడు మాత్రం ఎందుకీ మౌనం?
నవతెలంగాణ-రాయికల్
జెండా ఎగురుతుంది.. జాతీయ గీతం మార్మోగుతుంది.. సేవ చేసిన వారికి సన్మానాలు, ప్రశంసాపత్రాలు, పురస్కారాలు అందుతాయి. వేదికపై ఒకరి తర్వాత ఒకరు గౌరవాన్ని అందుకుంటారు. కానీ ఆ వేడుకలను ప్రజలకు చేరవేసేందుకు పరుగులు తీస్తున్న ఒక కలం మాత్రం నిశ్శబ్దంగా ప్రశ్నిస్తుంది—“ప్రజల కోసం మేము చేసిన సేవకు గుర్తింపు ఎక్కడ?”
స్వాతంత్ర్య దినోత్సవం కావచ్చు..గణతంత్ర దినోత్సవం కావచ్చు.. ఉపాధ్యాయ దినోత్సవం కావచ్చు.. వివిధ రంగాల్లో సేవలందించిన వారిని గుర్తించి సత్కరించడం మంచి సంప్రదాయం. సేవను గుర్తించడం సమాజం చేయాల్సిన బాధ్యత. అయితే ప్రజల సమస్యలను భుజాన వేసుకుని, అధికార వ్యవస్థను ప్రశ్నిస్తూ, అణగారిన వర్గాల గొంతుకగా నిలుస్తున్న పాత్రికేయుడి సేవ మాత్రం ఎందుకు తరచూ గుర్తింపుకు దూరమవుతోంది.?
“మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం” అని వేదికలపై గొప్పగా చెబుతాం. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించేది మీడియానే అంటాం. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాత్రికేయులదేనంటాం. కానీ ఆ నాలుగో స్థంభానికి గౌరవం ఇవ్వాల్సిన సందర్భంలో మాత్రం అదే మాట ఎందుకు గుర్తుకు రాదు?
వార్త వెనుక కనిపించని శ్రమ
ఒక వార్త పత్రికలో కనిపించేది కొన్ని పంక్తులే. కానీ ఆ పంక్తుల వెనుక ఒక పాత్రికేయుడి శ్రమ ఉంటుంది. ఎండలో తిరిగిన అడుగులు ఉంటాయి. వానలో తడిసిన నోట్‌బుక్ ఉంటుంది. బాధితుడి కన్నీటిని విన్న మనసుంటుంది. అధికారుల తలుపులు తట్టిన అనుభవం ఉంటుంది. వాస్తవాలను నిర్ధారించేందుకు చేసిన ప్రయత్నం ఉంటుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పాత్రికేయుల పరిస్థితి మరింత కఠినం. ఉదయం ఏ గ్రామంలో సమస్య ఉందో తెలుసుకోవాలి. మధ్యాహ్నం అధికారులను సంప్రదించాలి. కార్యక్రమాలకు హాజరుకావాలి. రాత్రికి వార్త రాసి పంపాలి. మరుసటి రోజు మరో సమస్య కోసం బయలుదేరాలి. ప్రజా సమస్యను వార్తగా మలిచి పరిష్కారం దిశగా నడిపించాలనే తపనతో పనిచేసే జర్నలిస్టులు ఎందరో ఉన్నారు.
ఒక వార్త…ఒక మార్పు
రోడ్డు అధ్వానంగా ఉంటే వార్త రాస్తాడు. తాగునీరు అందకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్తాడు. పాఠశాలలో మౌలిక వసతులు లేకపోతే ప్రశ్నిస్తాడు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందకపోతే వెలుగులోకి తెస్తాడు. రైతు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు. సంక్షేమ పథకాల అమలులో లోపాలుంటే ఎత్తిచూపుతాడు. ఒక్కోసారి ఒక చిన్న వార్తతోనే అధికార యంత్రాంగం కదులుతుంది. ఒక కథనంతో గ్రామానికి రోడ్డు వస్తుంది. మరో కథనంతో తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. ఒక పరిశోధనాత్మక కథనం అక్రమాన్ని బయటపెడుతుంది. ఒక బాధితుడి సమస్యకు న్యాయం జరుగుతుంది. అంటే..పాత్రికేయుడి కలం కేవలం వార్త రాయదు. అది ప్రజల తరఫున ప్రశ్నిస్తుంది. పాలనను అప్రమత్తం చేస్తుంది. సమాజాన్ని చైతన్యపరుస్తుంది.
మరి గుర్తింపు ఎందుకు లేదు?
ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు ఉండాలి. ఉత్తమ క్రీడాకారుడికి పురస్కారం ఉండాలి. సామాజిక సేవకుడిని సత్కరించాలి. ఉద్యోగుల సేవలను గుర్తించాలి. ఇవన్నీ అవసరమే. అయితే ప్రజల కోసం పనిచేసే పాత్రికేయుడికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండకూడదా?
జాతీయ పర్వదినాల్లో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఉత్తమ పాత్రికేయులను గుర్తించి సత్కరించేందుకు ఒక క్రమబద్ధమైన విధానం ఎందుకు ఉండకూడదు? ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడిన కథనాలు, పరిశోధనాత్మక జర్నలిజం, గ్రామీణ సమస్యలపై నిరంతర కృషి, సామాజిక ప్రభావం చూపిన వార్తలను పరిగణనలోకి తీసుకుని అవార్డులు ఎందుకు ఇవ్వకూడదు?
అవార్డు రాజకీయ అనుగ్రహం కాకూడదు
పాత్రికేయులకు అవార్డులు ఇవ్వాలంటే అవి రాజకీయ అనుగ్రహాలుగా మారకూడదు. అధికారానికి దగ్గరగా ఉన్నవారికి, వ్యక్తులను పొగిడినవారికి, ప్రభావశీలులతో పరిచయాలు ఉన్నవారికి మాత్రమే దక్కే విధానం ఉండకూడదు.
పురస్కారానికి ప్రమాణం వ్యక్తి కాదు..అతని కలం కావాలి
ఎన్ని ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చారు? ఎన్ని సమస్యల పరిష్కారానికి వార్తలు దోహదపడ్డాయి? పరిశోధనాత్మక కథనాల ద్వారా సమాజానికి ఎంత మేలు జరిగింది? ప్రజా ప్రయోజనాన్ని ఎంతవరకు కాపాడారు? వంటి అంశాల ఆధారంగా పారదర్శకమైన ఎంపిక జరగాలి.
గుర్తింపు అంటే కేవలం నగదు కాదు
పాత్రికేయుడు కోరుకునేది ఎప్పుడూ నగదు పురస్కారం కాదు. తన వృత్తికి గౌరవం లభించాలి. తాను చేస్తున్న సేవను ప్రభుత్వం, ప్రజలు గుర్తించాలి. ఒక ప్రశంసాపత్రం కావచ్చు..ఒక జ్ఞాపిక కావచ్చు..ఒక వేదికపై నాలుగు గౌరవపూర్వక మాటలు కావచ్చు.. ఇవి కూడా ఒక జర్నలిస్టుకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ప్రజల సమస్యలపై రాసిన వార్తకు అధికారుల స్పందన వచ్చినప్పుడు పాత్రికేయుడికి కలిగే సంతృప్తి ఏ పురస్కారానికీ తీసిపోదు. కానీ ఆ సేవను అధికారికంగా గుర్తించడం ద్వారా సమాజం బాధ్యతాయుతమైన జర్నలిజానికి మరింత బలం ఇవ్వగలదు.
ప్రశ్నించేది పాత్రికేయుడే..ఇప్పుడు ప్రశ్న అతడి కోసం
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు బలంగా ఉండాలి. ఆ గొంతును బలహీనపరిస్తే ప్రజాస్వామ్యమే బలహీనపడుతుంది. అందుకే పాత్రికేయుల సేవలకు గుర్తింపు ఇవ్వడం అనేది కేవలం జర్నలిస్టుల గౌరవం కోసం చేసే పని కాదు. అది ప్రజాస్వామ్య విలువలకు ఇచ్చే గౌరవం. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే మీడియా..ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తోంది. ఈ రెండు బాధ్యతల మధ్య నిలబడి పనిచేసే పాత్రికేయుడిని గుర్తించడం ప్రభుత్వానికి కూడా గర్వకారణమే కావాలి. జాతీయ పర్వదినాల్లో అవార్డుల జాబితా తయారు చేసే సమయంలో ఇకనైనా ఈ రంగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.“ఉత్తమ పాత్రికేయ సేవా పురస్కారం” వంటి అవార్డులను పారదర్శకంగా ఏర్పాటు చేసి, నిజంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను గుర్తించాలి.
ఎందుకంటే..
కలాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజల కోసం పోరాడే వ్యక్తికి గుర్తింపు ఇవ్వడం అంటే ఒక వ్యక్తిని గౌరవించడం కాదు.. ప్రజల గొంతుకను గౌరవించడం. జెండా ఎగురుతున్నప్పుడు స్వేచ్ఛను గుర్తు చేసుకుంటాం. గణతంత్ర వేడుకల్లో ప్రజాస్వామ్యాన్ని స్మరించుకుంటాం. అయితే ఆ స్వేచ్ఛను, ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రతిరోజూ తన కలంతో కాపాడే పాత్రికేయుడిని మాత్రం మరిచిపోతే ఎలా?“మీడియా నాలుగో స్థంభం” అని చెప్పే సమాజం.. ఆ స్థంభాన్ని గౌరవించే ఆచరణను కూడా చూపాలి. ప్రజల గొంతుకగా నిలిచే కలానికి.. కిరీటం ఎప్పుడు?ఇది కేవలం పాత్రికేయుడి ప్రశ్న కాదు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రశ్న.



