Thursday, September 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతుమ్మల చెరువుకు గోదావరి జలాలు

తుమ్మల చెరువుకు గోదావరి జలాలు

- Advertisement -

అశ్వాపురం రైతుల చిరకాల స్వప్నం సాకారం
‘మారేళ్లపాడు ఎత్తిపోతల’ను ప్రారంభించిన 
మంత్రులు తుమ్మల, పొంగులేటి
తొలి విడతలో 4,300 ఎకరాలకు.. 
దశలవారీగా 23 వేల ఎకరాలకు సాగునీరు
నవతెలంగాణ-అశ్వాపురం

తుమ్మల చెరువుకు గోదావరి జలాలు అందించాలన్న రైతుల చిరకాల కోరిక నెరవేరిందని మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి అన్నారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో సీతారామ కాలువపై నిర్మించిన మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని బుధ వారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను తుమ్మల చెరువుకు విడుదల చేశారు. సుమారు రూ.610 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు, దశలవారీగా అశ్వాపురం మండలంలో 22 నుంచి 23 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అనంతరం గొందిగూడెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి అశ్వాపురం, పినపాక నుంచి పాలేరు వరకు గోదావరి జలాలను తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనుమతులు, సవరించిన అంచనాలను అధిగమిస్తూ పనులు చేయిస్తున్న్టు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలకు అదనపు నిధులను సీఎం మంజూరు చేశారని, ఇల్లెందుకు జూలూరుపాడు టన్నెల్, లలితాపురం వద్ద ఎత్తిపోతలపై సర్వేలు చేసి అంచనాలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. అన్నదైవం ప్రాజెక్టుకు కూడా జలాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. భూసేకరణలో రైతులు సహకరించాలని కోరారు. న్యాయమైన పరిహారం రైతులకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా పది నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణకు కృషి చేస్తున్నామని, భద్రాచలంలో ప్రగళ్లపల్లి ఎత్తిపోతలతో పాలెంవాగు, తాలిపేరు, మోడికుంటవాగు అనుసంధానం చేస్తే మరిన్ని మండలాలకు నీరు అందుతుందన్నారు. ప్రస్తుత వర్షాభావం, ఎల్‌నినో నేపథ్యంలో నీరు, విద్యుత్‌‌ను పొదుపుగా వాడాలని, రబీలో తక్కువ నీటి పంటలు వేయాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ మొక్కలు అందిస్తామన్నారు. రూ.350 కోట్లతో భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించామని, పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పులుసుబొంత్ ప్రాజెక్టు భూసేకరణ, ప్రత్యామ్నాయ భూముల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలుస్తామన్నారు. బూర్గంపాడులో దొమ్మలవాగు రిజర్వాయర్‌పై ప్రజల అవసరాల మేరకు చర్యలు తీసుకుంటామని, గిరిజన గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పేదలు, రైతులు, గిరిజనులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ మారేళ్లపాడు ద్వారా అశ్వాపురంలో 24 గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దశాబ్దాల కల నెరవేరిందని, గోదావరి జలాలు తుమ్మల చెరువుకు చేరడం పండుగ వాతావరణం తెచ్చిందన్నారు. తుమ్మల ప్రధాన కాలువకు లైనింగ్, 22 కి.మీ డిస్ట్రిబ్యూటరీలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మణుగూరు రేగులగండి చెరువుకు నీరిస్తే 4 వేల ఎకరాల్లో మూడు పంటలు పండుతాయని, దొమ్మలవాగును మినీ రిజర్వాయర్‌గా చేయాలని కోరగా మంత్రులు సానుకూలంగా స్పందించారన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. మారేళ్లపాడుతో పాటు జిల్లాలో 16 వేల ఎకరాలకు సాగునీటి పనులకు శ్రీకారం చుట్టామని, పులుసుబొంత్‌కు కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ భూముల గుర్తింపు కొనసాగుతోందన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ సహా 8 మండలాల్లో డిస్ట్రిబ్యూటరీల సర్వే 60 శాతం పూర్తయిందని, సీతమ్మసాగర్‌కు 600 ఎకరాల భూసేకరణ అవార్డు దశలో ఉందని, రూ.46 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, ఎస్పీ రోహిత్ రాజ్, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -