నవతెంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గాను రాష్ట్రానికి రూ.9,968 కోట్లను నిర్దేశించింది. ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిధులను కేవలం గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్ లైట్‌ల ఏర్పాటు వంటి ప్రజా సేవల కోసమే వినియోగించాలని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే ఈ గ్రాంట్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం ఉపయోగించరాదని ఖచ్చితమైన నిబంధన విధించింది. నిధుల దుర్వినియోగానికి తావులేకుండా ఉండేందుకు కేంద్రం కఠినమైన పర్యవేక్షణ నిబంధనలను తెచ్చింది. ప్రతి స్థానిక సంస్థ ఎప్పటికప్పుడు తమ వ్యయ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని, వాటి ఆధారంగా సమగ్ర నివేదికలను రాష్ట్రం కేంద్రానికి సమర్పించాలని ఆదేశించింది.



