కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి
ప్రవేశం : ఐఎండీ
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం
న్యూఢిల్లీ : మండుటెండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. దేశంలో వర్షాకాలానికి నాంది పలికే నైరుతి రుతుపవనాలు గురువారం (జూన్ 4) అధికారికంగా కేరళలోకి ప్రవేశించాయి. దీంతో భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్టు ఐఎండీ ప్రకటించింది. కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో అక్కడ విస్తృతంగా వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో ఇవి దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయి.
నాలుగు రోజుల ఆలస్యంగా!
సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈసారి అవి నాలుగు రోజుల ఆలస్యంగా జూన్ 4న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అంతకుముందు మే 26నే కేరళలోకి రుతుపవనాలు వస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కానీ సముద్ర, వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా వాటి పురోగతి మందగించింది. అనంతరం జూన్ 4 ప్రాంతంలో కేరళకు చేరుకునే అవకాశముందని సవరించిన అంచనాను వెల్లడించగా.. అదే నిజమైంది.రుతుపవనాల రాకకు ముందు నుంచే కేరళలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వర్షపాతం, గాలుల వేగం, మేఘావరణ పరిస్థితులను ఐఎండీ నిశితంగా పరిశీలించింది. రుతుపవనాల అధికారిక ప్రకటనకు అవసరమైన అన్ని ప్రమాణాలు నెరవేరడంతో గురువారం వాటి ప్రవేశాన్ని ప్రకటించింది. కేరళలో ప్రస్తుతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితుల దృష్ట్యా అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.
కొన్ని ప్రాంతాల్లో గంటకు రుతుపవనాల సాధారణ ప్రయాణాన్ని పరిశీలిస్తే, జూన్ నెలలో ఇవి వేగంగా పశ్చిమ తీర ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు విస్తరిస్తాయి. అనంతరం మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు జూన్ మధ్య నాటికి చేరుకుంటాయి. అక్కడి నుంచి తూర్పు, ఉత్తర భారత రాష్ట్రాల వైపు కదులుతాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణంగా జూన్ 27 ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అలాగే పంజాబ్, హర్యానా, రాజస్తా న్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వంటి వాయవ్య భారత రాష్ట్రాలకు జూన్ చివరి నాటికి లేదా జులై మొదటి వారంలో విస్తరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా కొనసాగితే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు జూలై ఆరంభంలోనే వర్షాల ప్రభావంలోకి వచ్చే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.
ఎల్ నినో ప్రభావం
ఈ ఏడాది వర్షాకాలంపై ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్‌నినో పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెలలో ఈ ప్రభావం బలహీనంగా ఉన్నప్పటికీ, సెప్టెంబరు నాటికి మరింత బలపడే అవకాశం ఉందని వివరించింది. దీంతో జూన్ నుంచి సెప్టెంబరు వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీర్ఘకాల సగటు వర్షపాతంతో పోలిస్తే ఈసారి సుమారు 90 శాతం మేర మాత్రమే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. వ్యవసాయం, జలాశయాల నీటి నిల్వలు, తాగునీటి అవసరాలపై ఈ పరిస్థితుల ప్రభావం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, కేరళలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆశలు చిగురించాయి. ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లగా మారడంతో సాగు పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే తెలంగాణలో రైతులు తమ ధాన్యపు రాశులు రోడ్లపై పోసి నానా అవస్థలు పడుతున్నారు. ఈలోపు ధాన్యం సేకరించాలని ఆందోళనలు చేస్తున్నారు.40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
అటు తమిళనాడుపై కూడా రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్న గంటల్లో 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి.



