Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..పలు ప్రాజెక్టులకు జలకళ

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..పలు ప్రాజెక్టులకు జలకళ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, పలు ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ఎండిపోతున్న పంటలకు జీవం పోసిన ఈ వర్షాలు రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. మరోవైపు, భారీ వర్షాల కారణంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

గడిచిన 24 గంటల్లో మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.

ఈ వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి (1,405 అడుగులు) చేరువ కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1,401 అడుగులకు చేరింది. శ్రీరామ్ సాగర్ జలాశయంలో నీటిమట్టం 44 టీఎంసీలు దాటింది. కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 17 గేట్లు ఎత్తి 74,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌కు వరద పోటెత్తడంతో 85 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.

మరోవైపు, భారీ వర్షాల కారణంగా ఇల్లందు, మణుగూరులోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు (ఆగస్టు 28 వరకు) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -