నవతెలంగాణ – హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ పదవి నుంచి తనను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలపై ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ స్పందించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను కాపాడటమే లక్ష్యంగా తాను పనిచేశానని ఆయన తెలిపారు. గత రెండేళ్లలో హైడ్రా ద్వారా సుమారు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల చెర నుంచి విడిపించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూమాఫియా, పలుకుబడి కలిగిన కబ్జాదారులే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. బడా బాబులు ఆక్రమణలో ఉన్న వందలాది చెరువులు, పార్కులు, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను గత రెండేళ్లలో హైడ్రా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించిందని పేర్కొన్నారు.
ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. లోతుకుంట భూముల విషయంలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ సుమారు రూ. 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని, రూ. 2,500 కోట్ల విలువైన వారసత్వ శిలలను (హెరిటేజ్ రాక్ ఫార్మేషన్స్) ధ్వంసం చేసిందని రంగనాథ్ వివరించారు. పర్యావరణవేత్తలు, స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకే తాము చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తనపై ఉన్న 63 కేసులు కూడా ఇటువంటి కబ్జాదారులు పెట్టినవేనని, వాటిని న్యాయపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.



