Monday, July 6, 2026
E-PAPER
Homeమానవిడీ గ్లామర్‌ పాత్రలే చేశాను

డీ గ్లామర్‌ పాత్రలే చేశాను

- Advertisement -

యమున.. మౌన పోరాటం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్రమందారం, బంగారు కుటుంబం, బ్రహ్మచారి మొగుడు తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను అలరించారు. మౌన పోరాటం మూవీ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయారు. అందం, అభినయంతో తన మార్క్ చూపించారు. ఫ్యామిలీ హీరోయిన్‌ అనే ట్యాగ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఊహించని సంఘటన వల్ల సినిమాలకు కొంత దూరమయ్యారు. తిరిగి కొన్ని సినిమాల్లో నటించారు. అలాగే ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం…

కర్ణాటకలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన యమున 1990ల్లోనే సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. వెండితెరపై ఎన్నో హిట్ సినిమాలు చేస్తూనే సడెన్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు. విధి, అన్వేషిత, రక్త సంబంధం ఇలా ఎన్నో హిట్ సీరియల్స్ చేశారు. ఇప్పటికీ ధారావాహికల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ​

చేసినవి తక్కువైన…
నిజానికి యమున అసలు పేరు ‘ప్రేమ’. కానీ ఆమెకు డైరెక్టర్ బాలచందర్ ‘యమున’ అని పేరు మార్చారు. ‘నేను ఫస్ట్ సినిమానే బాలచందర్ గారితో చేశాను. ఇండస్ట్రీకి వచ్చి 34 ఏండ్లు అయింది. 1989లో అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను. చేసినవి తక్కువే అయినా మంచి సినిమాలు చేశాననే ఫీలింగ్ మాత్రం ఉంది. మామగారు, మౌన పోరాటం, ఎర్ర మందారం, పుట్టింటి పట్టుచీర ఇలా ఎన్నో హిట్ సినిమాలు చేశాను. నిజానికి ‘పుట్టింటి పట్టుచీర’ సినిమా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి పోటీ ఇచ్చింది’ అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు.

సీరియల్స్‌కు అలా
​సినిమాల్లో మంచి పీక్ స్టేజిలో ఉన్నప్పుడే యమున బుల్లితెరపైకి వచ్చేశారు. ఇదెలా జరిగింది.. అన్న ప్రశ్నకు ఆమె… ‘మా అమ్మ సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైంది. నేను ఉషాకిరణ్ మూవీస్‌లో వచ్చిన ‘మౌన పోరాటం’ సినిమాతోనే యాక్టింగ్ నేర్చుకున్నాను. ఈటీవీతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాండింగ్‌ అలానే ఉంది. అందుకే విధి, అన్వేషిత.. సీరియల్స్ చేశాను. మేము చెన్నైలో ఉండేవాళ్లం. మా అమ్మ నాకు మ్యారేజ్ చేయాలనుకోవడంతో అప్పట్లో బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాం. మేము షిఫ్ట్ అయ్యాం అని ఈటీవీ సుమన్ గారికి అప్పట్లో తెలీదు. కానీ నన్ను వెతుక్కొని మరీ ‘అన్వేషిత’ సీరియల్ చేయాలని నా దగ్గరికి వచ్చారు. అసలు ‘విధి’ సీరియల్ కూడా నేను చేయకూడదు అనుకున్నాను. అది నెగెటివ్ రోల్ అని ముందు వద్దన్నాను. కానీ అందులో నేనే మెయిన్ అని విలన్ కాదని చెప్పారు. అది చేసినందుకు చాలా సంతోషంగా ఫీలయ్యా. ఆ సీరియల్‌లో రోజీ అనే క్యారెక్టర్ ఇప్పటికీ ఆడియన్స్‌కు గుర్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

అందుకే ఆ అవకాశాలు రాలేదు
​అతి తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యమున పెద్ద హీరోలతో నటించలేకపోయారు. ఈ విషయం గురించి అడిగితే ఆమె ఏమంటారంటే.. ‘నేను ఎక్కువ ఎమోషనల్, డీ గ్లామర్ రోల్స్ మాత్రమే చేశాను. అందుకే గ్లామరస్ హీరోయిన్ అనే ఇమేజ్ తెచ్చుకోలేకపోయాను. నేను అలాంటి రోల్స్ చేస్తే ఎవరైనా నాలో గ్లామర్ ఎలా చూస్తారు. అందుకనే ఆ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. కానీ పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్ అంటే కాస్త గ్లామర్‌గా ఉండాలి. కానీ నేను డీ- గ్లామర్ రోల్స్ చేయడంతో నాకు ఆ అవకాశాలు రాలేదు’ అన్నారు.

అమ్మ క్యారెక్టరైనా ఒకే..
​ఇక తనకు కోపం ఎక్కువని, ఎవరినైనా సెట్‌లో తక్కువగా చూస్తే వెంటనే కోపం వస్తుందని యమున అన్నారు. ‘నాకు కొంచెం కోపం ఎక్కువ. నిజానికి కోపం ఎక్కువైతే నేను ఆరోజు షూటింగ్‌లో సూపర్‌గా పెర్ఫామెన్స్ చేస్తాను.. అది ఒక బలంగా వాడుకుంటాను. సినిమా, సీరియల్ షూటింగ్‌లో ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులను తక్కువగా చూసినా అసలు ఊరుకోను. ముఖ్యంగా ఆడవాళ్లను ఎవరైనా ఏడిపిస్తే వెంటనే కోపం వస్తుంది. అయితే సినిమా కోసం సీరియల్స్ వదులుకోలేను.. నాకు సీరియల్ కంఫర్ట్‌గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు సినిమాల్లో ఏమైనా క్యారెక్టర్ వస్తే చేస్తాను. అమ్మ క్యారెక్టరైనా ఒకే.. ఏదైనా చేస్తాను. మహేశ్ బాబుకు అమ్మగా చేయాలనుంది.. కానీ ఇది వదులుకొని వెళ్లడం మాత్రం ఇష్టం లేదు’ అన్నారు.

నా శీవనశైలే కారణం
50 ఏండ్లు దాటిన తర్వాత కూడా ఆమె ఎంత ఫిట్‌గా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దీని గురించే ఆమెను ప్రశ్నిస్తే సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పటి నుండి తనలో ఎటువంటి మార్పూ లేదని, దీనికి కారణం తన ఆరోగ్యకరమైన జీవనశైలి అని ఆమె అన్నారు. క్రమం తప్పకుండా పాటించే దినచర్య అలాగే జీవనశైలి తాను ఇంత ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి సాయం చేస్తున్నాయని తెలిపారు. ‘ప్రతి రోజు అంతా బాగుండాలని, సంతోషంగా ఉండాలని పాజిటివ్ థింకింగ్‌తో లేస్తాను. ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీరు తాగి, ప్రెష్ అయిన తర్వాత 20 నుండి 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తాను’ అన్నారు.

​కింద కూర్చొనే తింటాను
ఆహారం విషయంలో కూడా ఆమె కొన్ని నియమాలను తప్పకుండా పాటిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆమె ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తానని చెప్పారు. ఉదయం 10 గంటలకు తన మొదటి భోజనాన్ని తీసుకుంటారు. ఇదివరకైతే బ్రౌన్ రైస్, ఇడ్లీ, దోసె వంటివి తీసుకునేవారట. మధ్యాహ్నం పూట ఫ్రూట్స్, నట్స్, మజ్జిగ, కాఫీ వంటివి తీసుకుంటారు. రాత్రి భోజనాన్ని సాయంత్రం 6:30 నుండి 7 గంటల మధ్య పూర్తి చేస్తారు. ‘ఒక ముద్ద మన ప్లేట్‌లోకి రావడానికి రైతులు పడే కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, అన్నం పట్ల కృతజ్ఞతతో తినడం వల్ల సాధారణ ఆహారం కూడా శరీరానికి పోషకంగా మారుతుంది’ అని ఆమె అంటున్నారు. కింద కూర్చుని భోజనం చేయడం, కాళ్లు మడిచి తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, ఆరోగ్యంగా ఉంటామని ఆమె గుర్తు చేశారు. అందుకే షూటింగ్‌లలో తప్ప, ఇంట్లో మాత్రం తాను కిందే కూర్చుని భోజనం చేస్తానని చెప్పారు. తన పిల్లలు కూడా ఈ అలవాట్లను పాటిస్తున్నారని, కోవిడ్ సమయంలో కుటుంబమంతా కింద కూర్చుని తినడం అలవాటు చేసుకున్నామని యమున అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -