రూ. 52 వేల కోట్ల పరిహారం చెల్లింపునకు అంగీకారం
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ ఉత్పత్తుల దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ విక్రయించిన టాల్కం పౌడర్ బాధితులకు ఎట్టకేలకు న్యాయం దక్కింది. దీనికి సంబంధించి దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి తలొగ్గింది. ఈ వివాదానికి తెరదించేందుకు ఆ కంపెనీ తాజాగా అంగీకరించింది. తమ టాల్కం ఆధారిత బేబీ పౌడర్ వినియోగం వల్ల అండాశయ క్యాన్సర్ సోకిందంటూ దాఖలైన వేలాది కేసులను పరిష్కరించుకునేందుకు ఏకంగా 5.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 52 వేల కోట్లు) భారీ మొత్తాన్ని చెల్లించేందుకు ఆ సంస్థ అంగీకరించింది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కంపెనీ.. అమెరికాలోని ఫెడరల్, రాష్ట్ర కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న దాదాపు 69,000 కేసులను ఈ ఒప్పందం ద్వారా పరిష్కరించుకోనున్నట్లు వెల్లడించింది. టాల్క్ ఇది సౌందర్య సాధనాలు, బేబీ ఉత్పత్తులలో ప్రధాన పదార్థంగా ఉపయోగపడేది. అయితే ఇది క్యాన్సర్‌కు దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవడంతో దీని వాడకంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) టాల్క్‌ను మానవులకు క్యాన్సర్‌ను కలిగించే అవకాశం ఉన్న పదార్థంగా వర్గీకరించింది. టాల్క్ క్యాన్సర్‌కు కారణమవుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని జాన్సన్ అండ్ జాన్సన్ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యగా 2020లో అమెరికాలో, 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా టాల్కం ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను సంస్థ పూర్తిగా నిలిపివేసింది. 2016లో అమెరికాలో అండాశయ క్యాన్సర్‌తో మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి రూ.59 కోట్ల (72 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో ఈ వివాదం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తీర్పు తర్వాత కంపెనీపై దేశవ్యాప్తంగా క్లెయిమ్‌లు భారీగా పెరిగిపోయాయి. ఈ సుదీర్ఘ వివాదం నుంచి బయటపడేందుకే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు జూనియర్ లిటిగేషన్ హెడ్ ఎరిక్ హాస్ తెలిపారు.
జాన్సన్ పౌడర్ బాధితులకు ఎట్టకేలకు న్యాయం
- Advertisement -
- Advertisement -



