వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం సొంతం
సిల్వర్ నెగ్గిన రిషికాంత సింగ్
2026 గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడలు
భారత క్రీడా దిగ్గజం, స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. కామన్‌వెల్త్ క్రీడల్లో వరుసగా మూడోసారి పసిడి పతకం సాధించింది. 2018 గోల్డ్‌కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్‌లో బంగారు పతకాలు సాధించిన మీరాబాయి చాను.. 2026 గ్లాస్గోలోనూ పసిడి పతకంతో హ్యాట్రిక్ గోల్డ్ కొట్టింది. వెయిట్‌లిఫ్టర్ రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్‌తో భారత్‌కు డబుల్ డిలైట్ అందించాడు.
గ్లాస్గో (స్కాట్లాండ్)
గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల్లో మణిపూర్ క్రీడాకారుడు రిషికాంత సింగ్ చరిత్ర సృష్టించాడు. కుటుంబ పోషణ కోసం మణిపూర్, ఇంపాల్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా, హోటల్‌లో సర్వర్‌గా పనిచేసిన రిషికాంత సింగ్.. నేడు గ్లాస్గోలో భారతదేశం గర్వపడేలా చేశాడు. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పోటీల్లో పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత సింగ్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. స్నాచ్ విభాగంలో మూడో ప్రయత్నంలో 121 కేజీలు ఎత్తిన రిషికాంత సింగ్.. కామన్‌వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో రిషికాంత సింగ్ 143 కేజీల బరువు ఎత్తిపడేశాడు. ఓవరాల్‌గా 264 కేజీలు ఎత్తిన రిషికాంత సింగ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు. మలేషియా వెయిట్‌లిఫ్టర్‌కు స్వర్ణం, కెనడా వెయిట్‌లిఫ్టర్‌కు కాంస్యం లభించాయి. 2017లోనే కామన్‌వెల్త్ గేమ్స్ యూత్ చాంపియన్‌గా నిలిచిన రిషికాంత సింగ్.. ఆ తర్వాత సరైన మార్గనిర్దేశం లేకపోవటంతో ఇంపాల్‌లో రోజువారీ కూలీగా పని చేశాడు. ఏడాది పాటు భవననిర్మాణ కార్మికుడిగా పని చేసిన రిషికాంత సింగ్‌ను మణిపూర్ వెయిట్‌లిఫ్టంగ్ సంఘం రెండో అవకాశం ఇచ్చింది. జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి సాధించిన రిషికాంత సింగ్.. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించాడు. క్రీడాకారులకు పెట్టింది పేరైన మణిపూర్ నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో కామన్‌వెల్త్ క్రీడల పతకం సాధించిన తొలి పురుష క్రీడాకారుడిగా రిషికాంత సింగ్ నిలిచాడు.
మీరాబాయి చాను హ్యాట్రిక్
మీరాబాయి చాను పసిడి ఫేవరేట్‌గా బరిలోకి అంచనాలను అందుకుంది. స్నాచ్ విభాగంలో నేరుగా 82 కేజీలు ప్రయత్నించిన మీరాబాయి చాను తొలి రెండు ప్రయత్నాల్లో నిరాశపరిచింది. మూడో ప్రయత్నంలో ఏకంగా 85 కేజీలు ఎత్తిపడేసింది. క్లీన్ అండ్ జెర్క్‌లోనూ తొలి ప్రయత్నంలో మీరాబాయి చాను సౌకర్యవంతంగా కనిపించలేదు. కానీ 105 కేజీలు ఎత్తేసి కామన్‌వెల్త్ క్రీడల చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల 48 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి చాను.. సహచర వెయిట్ లిఫ్టర్ల కంటే ఎంతో (ఓవరాల్‌గా 190 కేజీలు) ఎక్కువ బరువులు ఎత్తింది. దీంతో కామన్‌వెల్త్ క్రీడల్లో పోటీ ఇతరులతో కాదు తనతోనే తనకు పోటీ అని చెప్పకనే చెప్పింది.



