3-0తో టీ20 సిరీస్ బారత్ వశం
మూడో టీ20లో ఘన విజయం
భారత్ 192/5, జింబాబ్వే 157/7
జింబాబ్వే పర్యటనను టీమ్ ఇండియా అద్భుత విజయంతో ముగించింది. వరుస ఓటములతో జింబాబ్వేకు వచ్చిన భారత్.. హ్యాట్రిక్ విజయాలతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. వైభవ్ సూర్యవంశీ (81) ధనాధన్ అర్థ సెంచరీతో భారత్ తొలుత 192/5 పరుగులు చేయగా.. బౌలర్లు సమిష్టిగా రాణించటంతో ఛేదనలో జింబాబ్వే 157/7 పరుగులే చేసింది. 35 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-హారారే
బ్రిటన్ పర్యటనలో భారత్‌కు రిక్తహస్తమే మిగలగా.. జింబాబ్వే పర్యటనలో పరిపూర్ణ విజయం సొంతమైంది. హ్యాట్రిక్ విజయాలతో హోరెత్తించిన శ్రేయస్‌సేన టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. బ్యాట్, బంతితో సమిష్టిగా రాణించిన భారత్ మూడో టీ20లో 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల ఛేదనలో ఆతిథ్య జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులే చేసింది. ర్యాన్ బర్ల్ (54 నాటౌట్, 43 బంతుల్లో 5 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో రాణించినా.. ఇతర బ్యాటర్లు తేలిపోయారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ (3/29), యశ్ ఠాకూర్ (2/45) రాణించారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వైభవ్ సూర్యవంశీ (81, 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగటంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (29, 26 బంతుల్లో 4 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (27, 18 బంతుల్లో 2 ఫోర్లు), రింకు సింగ్ (25, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సూర్యవంశీ దూకుడు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభం కలిసి రాలేదు. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ (2) ముచ్చటగా మూడోమ్యాచ్‌లో నిరాశపరిచాడు. అభిషేక్ అవుటైనా.. ఇషాన్ కిషన్ (29) తోడుగా వైభవ్ సూర్యవంశీ (81) దంచికొట్టాడు. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశీ సిరీస్‌లో రెండో అర్థ సెంచరీ సాధించాడు.
పవర్‌ప్లేలో భారత్ 64/1 పరుగులు చేయగా.. సూర్యవంశీ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభించటంతో అటు సూర్యవంశీతో పాటు ఇషాన్ కిషన్ ఆచితూచి ఆడారు. అర్థ సెంచరీ తర్వాత వైభవ్ సూర్యవంశీ మరో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. ఇషాన్ కిషన్ మరోసారి మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 26 బంతుల్లో 4 ఫోర్లు బాదిన కిషన్ 29 పరుగులే చేశాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 50 బంతుల్లోనే 75 పరుగులు జోడించింది. కిషన్ అవుటైనా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (27)తో కలిసి వైభవ్ సూర్యవంశీ మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. 29 బంతుల్లో 50 పరుగులు జోడించిన శ్రేయస్, సూర్యవంశీ భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. శ్రేయస్ అయ్యర్ రెండు ఫోర్లతో మెరిసినా.. వికెట్ నిలుపుకోలేదు. దూకుడుగా ఆడే క్రమంలో సూర్యవంశీ సైతం నిష్క్రమించాడు. తిలక్ వర్మ (11 నాటౌట్) ఆశించిన వేగంతో పరుగులు చేయలేదు. రింకు సింగ్ (25, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. 20 ఓవర్లలో 5 వికెట్లకు భారత్ 192 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ (2/41) రెండు వికెట్లు పడగొట్టాడు. సమిష్టిగా మెరిసిన బౌలర్లు ఆతిథ్య జింబాబ్వే బ్యాటర్లను భారత యువ బౌలర్లు మరోసారి చిత్తు చేశారు.
ఇన్నింగ్స్ తొలి బంతికే బ్రయాన్ బెనెట్ (0) వికెట్‌తో మయాంక్ యాదవ్ అదిరే ఆరంభం అందించాడు. యశ్ ఠాకూర్.. వరుస బంతుల్లో డియాన్ మేయర్స్ (19, 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), సికందర్ రజా (0)లను అవుట్ చేసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఓ ఎండ్‌లో సహనంతో ఆడిన బెన్ కరణ్ (20, 19 బంతుల్లో 2 ఫోర్లు)ను సైతం రవి బిష్ణోయ్ సాగనంపాడు. దీంతో 65/4తో జింబాబ్వే టాప్ ఆర్డర్ కుదేలైంది. ఈ సమయంలో ర్యాన్ బర్ల్ (54 నాటౌట్), వెస్లీ మాదవెరె (28, 25 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వెస్లీని మయాంక్ యాదవ్ అవుట్ చేయగా.. మారుమణిని (1)ని అశోక్ శర్మ సాగనంపాడు. దీంతో 134/6తో జింబాబ్వే ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఓ ఓండ్‌లో ర్యాన్ బర్ల్ ఒంటరి పోరాటం సాగించాడు. ఐదు ఫోర్లతో 42 బంతుల్లో అర్థ సెంచరీ సాధించినా.. అప్పటికే ఛేదనలో జింబాబ్వే ఓటమి ఖరారైంది. భారత ఫీల్డర్లు వరుసగా క్యాచ్‌లు నేలపాలు చేయటం, మిస్ ఫీల్డింగ్ జింబాబ్వేకు కలిసొచ్చింది. లేదంటే, ఆతిథ్య జట్టు మరింత స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేది. 20 ఓవర్లలో జింబాబ్వే 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. 35 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సంక్షిప్త స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్ : 192/5 (వైభవ్ సూర్యవంశీ 81, ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 27, రింకు సింగ్ 25, బ్రాడ్ ఎవాన్స్ 2/41)జింబాబ్వే ఇన్నింగ్స్ : 157/7 (ర్యాన్ బర్ల్ 54, వెస్లీ 28, బెన్ కరణ్ 20, మయాంక్ యాదవ్ 3/29, యశ్ ఠాకూర్ 2/45)



