ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోదు
బొద్దింకలు శాంతియుతంగా ఉద్యమించాయి
అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యానికి విజయమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. నిరసనను విరమించడం అంటే ఉద్యమం ముగిసిపోయినట్టు కాదని అన్నారు. “ఇది కేవలం ఆరంభం మాత్రమే. కాక్రోచ్ జనతా పార్టీకి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది” అని అన్నారు. ఈ ఆందోళనలో అండగా ఉన్న యువత, విద్యార్థులను ఉద్దేశిస్తూ ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ఇంతకాలం అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోదని కూడా ఆయన చెప్పారు. మంత్రి రాజీ నామా కేవలం ఆరంభం మాత్రమే అని అన్నారు. యువత, సీజేపీ మద్దతుదారుల వల్లే ఇదంతా సాధ్య మైందని అన్నారు. బొద్దింకలు శాంతియుతంగా ఉద్యమించాయని ప్రశంసించారు.
37 రోజులుగా…
ఇకపై ఏం జరుగుతుందోనన్న ఆందోళన లేకుండా తాను ఎట్టకేలకు “ప్రశాంతంగా నిద్రపోగలనని” చెబుతూ ఆయన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. “గత 37 రోజుల్లో నేను ఎదుర్కొన్న పరిస్థితులు చాలా కఠినమైనవి. ఇది నాకు మాత్రమే కాదు, మా బృందంలోని అందరికీ కూడా ఏమాత్రం సులభం కాదు” అని అన్నారు. విమర్శలు, సందేహాలు ఉన్నప్పటికీ ఉద్యమానికి అండగా నిలిచిన దేశవ్యాప్తంగా ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలి పారు. “అన్నింటికంటే ముఖ్యంగా, భారత దేశం అంతటా విస్తరించి ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులందరికీ నేను కృతజ్ఞ తలు చెప్పాల నుకుంటున్నాను. అందరూ మమ్మల్ని అనుమా నిస్తున్నప్పుడు మాపై నమ్మకం ఉంచి, మద్దతునిచ్చి, ఆదరించిన మీ అందరికీ నా హృద యపూర్వక ధన్యవాదాలు. మీ మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు” అని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తిగతంగా కలవలేకపోతున్నా..
ఆరోగ్య సమస్యల కారణంగా జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన మద్దతుదారులను వ్యక్తిగతంగా కలవలేకపోయినందుకు ఈ సందర్భంగా క్షమాపణలు కూడా కోరారు. “నేను నిజంగా క్షమాపణలు కోరుతున్నాను. జంతర్ మంతర్ వద్ద వేచి ఉన్న వారందరినీ కలవలేకపోయాను, వారికి కృతజ్ఞతలు చెప్పలేకపోయాను. ఎందుకంటే నాకు టైఫాయిడ్ వచ్చి తీవ్రమైన జ్వరం ఉంది. నా శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీలు ఉంది. అందుకే నేను ఇంటికి రావాల్సి వచ్చింది” అని వివరించారు.
దేశం కోసం సమిష్టి పోరాటానికి సెల్యూట్
“ఈ దేశం కోసం మీరు చేసిన కృషిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. మీ అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే మేము దీనిని సాధించలేకపోయేవాళ్ళం. మీ అందరికీ నా సెల్యూట్” అని అన్నారు. “మా పట్ల సందేహాలు వ్యక్తం చేసిన వారికి, మమ్మల్ని విమర్శించిన వారికి లేదా ‘మీరు సీరియస్‌గా లేరు, మీకు నిరసన తెలపడం తెలియదు’ అని ప్రశ్నించిన వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మమ్మల్ని విమర్శించి, ప్రశ్నించకపోయి ఉంటే, మేము మెరుగుపడేవారమే కాదు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉంది. కచ్చితంగా మేము చాలా దూరం వెళ్తాము. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అని ఆయన అన్నారు.
ప్రధాన్ రాజీనామా సరే..పరిహారం అందాలి
“ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందాలి. వారికి అది దక్కాలి. ఆ కుటుంబాలన్నింటికీ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి” అని దిప్కే అన్నారు. అయితే, మరణించిన వారి కుటుంబాలకు సాధ్యమైనంత గరిష్ట పరిహారాన్ని అందించడానికి కేంద్రం అంగీకరించింది. జూలై 20న జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీలో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఇది ఒక కొత్త ఆరంభం
యువత సమిష్టి పోరాట శక్తిని ఈ ఉద్యమం చాటిచెప్పిందని సీజేపీ ప్రతినిధి నేహా బోరా అన్నారు. “ఏకమైన యువత మార్పును తీసుకురాగలదు. ఇది ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం” అని ఆమె అన్నారు. విద్య, పాలనలో సంస్కరణల కోసం కృషి చేస్తూనే, యువతను ప్రభావితం చేసే అంశాలను తమ సంస్థ లేవనెత్తుతూనే ఉంటుందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. “యువతకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం. విద్య, పాలనలో సంస్కరణల కోసం కృషి చేయడం ఈ ఉద్యమం కొనసాగిస్తుంది” అని అన్నారు.
ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించడం
తమ సంస్థ తక్షణ ప్రాధాన్యత కాదు
ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించడం తమ సంస్థ తక్షణ ప్రాధాన్యత కాదని చెప్పారు. “సుమారు 750-800 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ వాటిలో ఏదీ యువత ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోంది. అధికారంలో ఏ పార్టీ లేదా నాయకుడు ఉన్నప్పటికీ, వారు యువత కోసం పనిచేసేలా, వారి డిమాండ్లను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి మా అజెండా ఇదే” అని ఆయన అన్నారు.
దేశ విద్యా వ్యవస్థను సంస్కరించాలన్నదే
మా లక్ష్యం
“ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, ఇతర విద్యార్థి సంఘాలకు వారి మద్దతు, మార్గదర్శకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఉద్యమంలో మీ పాత్ర నిజంగా కీలకమైనది” అని సిజెపి ప్రతినిధి అశుతోష్ రంకా అన్నారు. తమ సంస్థ తక్షణ దృష్టి ఉద్యమ విస్తరణపైనే ఉందని అన్నారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. “ప్రజా జీవితం, రాజకీయాల్లో నా స్వల్పకాలిక ప్రస్థానంలో నేను నేర్చుకున్న ఏకైక విషయం ఏమిటంటే – ఎప్పుడూ ‘కాదు’ అని చెప్పకూడదు. ఎప్పుడూ ‘కాదు’ అనకూడదు” అని అన్నారు. అయితే, దేశ విద్యా వ్యవస్థను సంస్కరించడమే తమ తక్షణ ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు. “ఇది ముగిసిపోలేదు. ఇది ఇప్పుడే మొదలవుతోంది. దేశ విద్యా వ్యవస్థ సరిచేయబడే వరకు మేము ఆగిపోము. ఇది మా మాట” అని అన్నారు.



