నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో లెండి ప్రాజెక్టు, ఆస్పత్రుల అభివృద్ధిపై, జుక్కల్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తన గళాన్ని బలంగా వినిపించారు. జుక్కల్ రైతాంగ ప్రయోజనార్థం లెండి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, త్వరితగతిన సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, డోంగ్లి, బిచ్కుంద, ఈ మూడు మండలాల్లో కలిసి 22 వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని తెలిపారు.
మహారాష్ట్ర ప్రాంతంలో మన రాష్ట్ర సరిహద్దు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులు పూర్తయితే వచ్చే సంవత్సరం నాటికి జుక్కల్ నియోజకవర్గం ప్రాంతానికి సాగునీరు అందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారదర్శకత కోసం బయోమెట్రిక్/ డిజిటల్ ఫింగర్‌ప్రింట్ హాజరు విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొని ఉన్న ప్రజా సమస్యలను ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.



