Saturday, September 19, 2026
E-PAPER
Homeమానవినా వృత్తి నాకు ఎంతో నేర్పింది

నా వృత్తి నాకు ఎంతో నేర్పింది

- Advertisement -

సినీ ప్రపంచంలో కొందరు నటీమణులు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి అరుదైన నటీమణులలో మాధవి ఒకరు. 1980-90ల కాలంలో తెలుగుతో పాటు దక్షిణాది చిత్రసీమను ఒక ఊపు ఊపారు. తెలుగు చిత్రసీమలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ‘ఖైదీ’, ‘మాతృదేవోభవ’ వంటి చిత్రాలతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగారు. కెరీర్ అత్యున్నత శిఖరాల్లో ఉన్నప్పుడే హఠాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ నటి ఇటీవలె తన జన్మదినం సందర్భంగా ఓ వెబ్‌‌సైట్‌‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు నేటి మానవిలో…

మాధవి 1962, సెప్టెంబర్‌ 14‌న ఆంధ్రపదేశ్‌లోని ఏలూరు జిల్లా, వేలుపుచెర్ల గ్రామంలో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు పుట్టారు. మాధవి అసలు పేరు కనక విజయలక్ష్మి. ఆమెకు అక్క కీర్తి కుమారి, తమ్ముడు ధనంజయ్ ఉన్నారు. ఈమె బాల్యమంతా హైదరాబాద్‌‌లోనే గడిచింది. చిన్నతనం నుంచే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉమా మహేశ్వరి వద్ద భరతనాట్యం, భట్ వద్ద జానపద నృత్యం నేర్చుకుని వెయ్యికి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. నాట్యంతో పాటు హార్స్ రైడింగ్, కరాటేలో బ్లాక్ బెల్ట్ వంటి రంగాల్లోనూ ఆమె ప్రావీణ్యం సంపాదించారు. హైదరాబాద్‌లోని అబిడ్స్ బ్రాంచ్‌లో ఉన్న స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు.

ఒకే ఒక్క సినిమా కోసం…
మాధవి ఎనిమిదో తరగతి చదువుతుండగా ఒకసారి రవీంద్రభారతిలో ఆమె నృత్య ప్రదర్శన జరుగుతుంది. అక్కడే ఉన్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దృష్టిలో ఆమె పడ్డారు. ఆయన బలవంతం చేయడంతో కేవలం ఒకే ఒక్క సినిమా అనే షరతుతో ‘తూర్పు పడమర’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికే సినిమారంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండటంతో దాసరి ఆమె పేరును మాధవిగా మార్చారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె సినీ ప్రయాణం మలుపు తిరిగింది.

ఎవర్‌‌గ్రీన్‌ ‌చిత్రాలు
తర్వాత కె. బాలచందర్ తన తెలుగు చిత్రం ‘మరో చరిత్ర’ (1978)లో ఆమెకు సహాయ పాత్ర ఇచ్చారు. ఆమె దాని హిందీ రీమేక్ ‘ఏక్ దూజే కే లియే’(1981)లో అదేపాత్రను పోషించారు. ఇది 1981లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ రెండు చిత్రాలలోనూ ఆమె కమల్ హాసన్‌తో ప్రేమలో పడే ఒంటరి ధనవంతురాలి పాత్రను పోషించారు. ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేషన్ పొందారు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఆమె చేసిన ‘ఖైదీ’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా అందులోని ‘రగులుతోంది మొగలిపొద’ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ‘మాతృదేవోభవ’ వంటి ఎమోషనల్ చిత్రంలో గుండెలు పిండేసే నటనను కనబరిచి నంది, జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు కన్నడలో రాజ్‌కుమార్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి టాప్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా వెలిగారు. అన్ని భాషల్లో కలిపి ఆమె సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు.

పెండ్లి తర్వాత…
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘కోతల రాయుడు’, ‘ప్రాణం ఖరీదు’, ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ మొదలగు హిట్ సినిమాల్లో నటించిన ఆమె చివరి తెలుగు చిత్రం బిగ్ బాస్. ఇక ఆమె నటించిన ఇతర తెలుగు చిత్రాల్లో మరో చరిత్ర, మంచి మనసు, ఊరికిచ్చిన మాట, చట్టానికి కళ్లులేవు, చట్టంతో పోరాటం వంటివి ముఖ్యమైనవి. సినిమాల్లో బిజీగా ఉన్నపుడే ఆమె రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్నారు. పెండ్లయిన తర్వాత గ్లామర్ లోకానికి పూర్తిగా దూరమైన మాధవి ప్రస్తుతం భర్త, ముగ్గురు కుమార్తెలతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈమె భర్త భారత, జర్మన్ సంతతికి చెందినవాడు. ఈయనకు మెడికల్ కంపెనీతో పాటు రెస్టారెంట్స్ బిజినెస్‌లు ఉన్నాయి.

ఏ అవకాశాన్నీ వదులుకోను
‘ప్రస్తుతం నేను ముగ్గురు పిల్లలతో ప్రశాంతమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేను కొత్త విషయాలు నేర్చుకునే ఏ అవకాశాన్నీ వదులుకోను. చిన్నప్పటి నుంచే నా జీవితం బడి, నాట్యం, క్రీడలతో తీరిక లేకుండా ఉండేది. అయితే నా చిన్ననాటి అత్యంత అందమైన జ్ఞాపకాలు మా అమ్మమ్మ తరఫు తాతయ్య వెంకట్ రామయ్య, నంచారమ్మ, మా నాన్నమ్మ వీరమ్మతో గడిపిన సమయాలే. నేను సమయం విలువ తెలుసుకుంటూ పెరిగాను. మా తల్లిదండ్రులు చాలా నిరాడంబరమైన వ్యక్తులు. వారు నాలో విలువలను, నైతికతను నాటారు. అవే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. నాకు, నా తోబుట్టువులకు అలాంటి ఉత్తమమైన విలువలను అందించినందుకు నేను మా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మాది చాలా అన్యోన్యమైన కుటుంబం. నా అక్కా, తమ్ముడు ఇద్దరూ నా ప్రతిరూపాలే, మేము ఎంత సన్నిహితంగా ఉంటామంటే, మమ్మల్ని మేమే ‘ముగ్గురు వీరులు’ అని పిలుచుకుంటాం. మేము తోబుట్టువుల కంటే ఎక్కువగా స్నేహితులం’ అని ఆమె ఎంతో అనందంగా చెబుతున్నారు.

ప్రతి పాత్రా ఓ సవాలే…
‘నటనలోని మెళకువలను శివాజీ గణేషన్ నుండి, పేరు ప్రఖ్యాతి ఉన్నప్పటికీ వినయాన్నిరాజ్‌కుమార్ నుండి, నిరాడంబరతను ప్రేమ్ నజీర్ నుండి, సమయ పాలనను ఎన్టీఆర్ నుండి, కష్టపడటాన్ని ఏఎన్ఆర్ నుండి, ప్రతి చిన్న విషయాన్ని గమనించే నైపుణ్యాన్ని అమితాబ్ బచ్చన్ నుండి నేర్చుకున్నాను. అలాగే రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, విష్ణు వర్ధన్, అంబరీష్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేయడాన్ని నేను ఎంతో ఆస్వాదించాను. నటన నా అభిరుచిగా మారింది. నేను చేసిన ప్రతి పాత్ర ఒక నటిగా నాకు సవాలు విసిరింది. ఒక వ్యక్తిగా సంతృప్తినిచ్చింది. నా వృత్తి నాకు ఎంతో నేర్పింది. ఏడు విభిన్న భాషలలో నటించడం వల్ల, వాటిలోని సూక్ష్మ విషయాలు, సంస్కృతి, సంప్రదాయాలు, అందం అన్నింటికన్నా ముఖ్యంగా వాటి రుచికరమైన ఆహారం గురించి తెలుసుకునే అరుదైన అవకాశం నాకు లభించింది. మూడు దశాబ్దాల తర్వాత కూడా నేటి తరం వారు గుర్తుంచుకుని, ప్రశంసించే కొన్ని సినిమాలలో, పాత్రలలో నటించే అవకాశం లభించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అంటూ మాధవి చెప్పారు.

అంతకంటే గొప్పవాడు
‘నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నాకు ఎప్పుడూ అదే కోరిక. నేను ఎంతో గౌరవించే నా గురువు అమెరికాలో నివసించే రాల్ఫ్ శర్మతో నా వివాహాన్ని కుదిర్చారు. అప్పట్లో నేను ఒక పర్యటన నిమిత్తం అమెరికా వచ్చాను. అక్కడ నాకు నా భర్త పరిచయమయ్యారు. పరిచయం అయిన రెండు వారాలలోపే అంటే 1996 ఫిబ్రవరి 14న మా వివాహం జరిగింది. నా గురువు నా భర్త గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన మృదుభాషి అని, ఉదార స్వభావి అని, విశ్వాసపా త్రుడని, నన్ను చాలా బాగా చూసుకుంటాడని అన్నారు. రాల్ఫ్ ఒక్కడే నాకు సరైనవాడని కూడా చెప్పారు. నేను నా గురువును నమ్మాను. ఆయన చెప్పిన దానికంటే కూడా రాల్ఫ్ ఇంకా గొప్పవాడని తేలింది’ అని తన భర్త గురించి మాధవి ఎంతో గొప్పగా చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -