డీజే యజమానులు, ఆపరేటర్లకు బైండోవర్..
నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్ట్
నవతెలంగాణ – మక్తల్
గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో మక్తల్ పట్టణంలో డీజేల వినియోగంపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. డీజే యజమానులు, ఆపరేటర్లకు ఇప్పటికే నిషేధ ఉత్తర్వులపై అవగాహన కల్పించి, తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ ప్రక్రియ చేపట్టినట్లు మక్తల్ ఎస్‌ఐ రాజు తెలిపారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రల్లో డీజేలు వినియోగించరాదని స్పష్టం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి డీజే ఏర్పాటు చేసినా, ఆపరేట్ చేసినా చట్ట ప్రకారం అరెస్ట్ చేయడంతో పాటు డీజే పరికరాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలకు, వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ రాజు కోరారు.



