‘సర్’ మూడో దశలో 17.1 శాతం ఓట్లు గల్లంతు తొలి రెండు దశలతో పోలిస్తే 4.8 శాతం పెరుగుదలతెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర,ఢిల్లీలో 20 శాతానికి పైగా తొలగింపులు
ఓటర్ల జాబితాలపై ఈసీ మౌనం..
ప్రజాస్వామ్య హక్కులపై ఆందోళన
ఓటర్ల జాబితాల ప్రక్షాళన పేరుతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో తొలగింపుల సంఖ్య మరింత పెరుగుతోంది. మూడో దశలో ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేసిన 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)ల్లో ఏకంగా 6.15 కోట్ల పేర్లు తొలగించారు. మొత్తం ఓటర్లలో 17.1 శాతం మందిని జాబితాల నుంచి తొలగించడం.. గత రెండు దశలతో పోలిస్తే పెరుగుతున్న తొలగింపుల తీవ్రతను సూచిస్తోంది. ముఖ్యంగా ‘శాశ్వతంగా తరలివెళ్లినవారు’, ‘ఆచూకీ లేనివారు,గైర్హాజరు’ అనే కారణాలతో తొలగింపులు పెరగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియలో మూడో దశ తొలగింపులు గణనీయంగా పెరిగాయి. ఇప్పటివరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో దశ ప్రక్రియ చేపట్టగా..వాటిలో 17 చోట్ల ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదలయ్యాయి. ఈ జాబితాల్లో 6.15 కోట్ల మంది పేర్లు తొలగించారు. ఇది మొత్తం ఓటర్లలో 17.1 శాతానికి సమానం. తొలి రెండు దశల్లో తొలగింపులు 12.3 శాతంగా ఉండగా.. మూడో దశలో 4.8 శాతం పాయింట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఓటర్ల పేర్ల తొలగింపులకు సంబంధించి ఈసీ నుంచి స్పష్టమైన వివరణ లేకపోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది.నాలుగు రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా
కనీసం కోటి మంది ఓటర్లు ఉన్న రాష్ట్రాలను పరిశీలిస్తే మూడో దశలో తొలగింపుల తీవ్రత స్పష్టమవుతోంది. తొలి రెండు దశల్లో తమిళనాడు, యూపీలలో మాత్రమే తొలగింపులు 15 శాతానికి మించాయి. మూడో దశలో ఆరు రాష్ట్రాల్లో తొలగింపులు 15 శాతానికి పైగా నమోదయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలలో ఈ సంఖ్య 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అధిక తొలగింపులు నమోద వుతున్నాయనే అంశాన్ని కూడా విశ్లేషకులు ప్రస్తా విస్తున్నారు. హైదరాబాద్, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో నమోదైన తొలగిం పులు.. గత దశలోని చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
‘శాశ్వతంగా తరలిపోయారు’.. ‘గైర్హాజరు’
మూడో దశలో తొలగింపులకు కారణాల విషయంలోనూ మార్పు కనిపిస్తోంది. ‘శాశ్వతంగా తరలి పోయారు’, ‘ఆచూకీ లేనివారు, గైర్హా జరు’ అనే కారణాలతో తొలగిం చిన వారి వాటా పెరిగింది. అదే సమ యంలో ‘మరణించారు’, ‘డూప్లి కేట్ ఓటరు’ అనే కారణాలతో తొలగించిన వారి వాటా తగ్గింది. సవరణ ప్రక్రియలో కారణాల వర్గీకరణ రాష్ట్రాల మధ్య, దశల మధ్య ఇంతగా మారడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకే విధమైన, స్పష్టమైన ప్రక్రియను అన్ని ప్రాంతాల్లో సమానంగా అమలు చేస్తే తొలగింపుల కారణాల్లో ఇలాంటి వ్యత్యాసాలు ఎందుకు ఏర్పడ్డాయనే ప్రశ్న తలెత్తుతోంది.
ఆరు కోట్లకు పైగా పేర్లు తొలగింపు
మూడో దశలో ముసాయిదా జాబితాలు విడుదల చేసిన 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్కు ముందు 36.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సవరణ అనంతరం ఈ సంఖ్య 29.9 కోట్లకు తగ్గింది. మొత్తం 6.15 కోట్ల పేర్లు తొలగించారు. మొదటి రెండు దశల్లో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 58.9 కోట్ల మంది ఓటర్లలో 7.22 కోట్ల పేర్లు తొలగించారు. ఈ దశలో తొలగింపుల శాతం 12.3గా ఉంది. తుది జాబితాలు విడుదలైన తర్వాత ఈ సంఖ్య 10.5 శాతానికి తగ్గింది. అయితే ముసాయిదా, తుది జాబితాల మధ్య మార్పు పరిమితంగానే ఉన్నందున మూడో దశలోనూ తొలగింపులు గణనీయంగా ఉండొచ్చని తెలుస్తోంది.
ఈసీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది
తొలగింపులు పెరగడానికి కారణాలపై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన వివరణ అందలేదని ‘ది హిందూ’ కథనం పేర్కొంది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం ఒక వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేసే హక్కును ప్రభావితం చేయగలదు. అందువల్ల ఓటర్ల తొలగింపులకు స్పష్టమైన కారణాలు, ధృవీకరణ ప్రక్రియ, అభ్యంతరాల పరిష్కారం, అప్పీల్ అవకాశాలపై ప్రజలకు పారదర్శక సమాచారం అందించడం కీలకం. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వలస కార్మికులు, అద్దె ఇండ్లలో ఉండే కుటుంబాలు, తరచూ నివాసం మార్చే ప్రజలు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రజాస్వామ్యంపై రాజకీయ ప్రశ్నలు
సర్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు సంబంధించిన చర్యగా వివరిస్తున్నాయి. అయితే, భారీగా పేర్లు తొలగించడం, తొలగింపుల కారణాల్లో మార్పులు రావడం, పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పేర్లు గల్లంతవడం వంటి అంశాలపై ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఈ అంశంపై రాజకీయ విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
‘ఇతర కారణాలు’ ఎక్కడ?
మూడో దశలో కొన్ని రాష్ట్రాలు ‘ఇతర కారణాలు’ పేరుతోనూ తొలగిం పులను నమోదు చేస్తున్నాయి. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల ప్రకటనల ప్రకారం దీనిలో సుమారు 9.73 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. అయితే, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో తొలగింపుల పూర్తి జాబితాలను పరిశీలించినప్పుడు ఒక్కరి కారణం కూడా ‘ఇతరాలు’గా నమోదు కాలేదు. అంటే, అటువంటి కేసులు ‘గైర్హాజరు’ వర్గంలో చేర్చబడి ఉండవచ్చనే ప్రశ్న తలెత్తుతోంది.



