Friday, September 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ విలీనానికి బీజేపీ మతం రంగు

తెలంగాణ విలీనానికి బీజేపీ మతం రంగు

- Advertisement -

హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కుట్ర
లౌకిక వాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కమ్యూనిస్టులు ముందుండాలి
నేటి తరానికి చారిత్రక వాస్తవాలు అందించాలి
కేసీఆర్‌, రేవంత్‌‌రెడ్డి భూములపై విచారణ జరపాలి : తెలంగాణ సాయుధ పోరాట సదస్సులో బీవీ.రాఘవులు

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘‘భూమి కోసం భుక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోంది. హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలి’’ అని సీపీఐ(ఎం) పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘువులు పిలుపునిచ్చారు. తెలంగాణ విలీనం-వాస్తవాలు-వక్రీకరణ’ అనే అంశంపై గురువారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీ ‌గ్రేటర్‌ హైదరాబాద్‌ ‌సిటీ సెంట్రల్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుం టున్నాయని విమర్శించారు. ముస్లిం ఓట్ల కోసం నిజాం దుర్మార్గాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

స్వాతంత్రోద్యమ కాలం నుంచి బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ రైతాంగ పోరాటాలకు అండగా నిలవలేదన్నారు. ఆ పార్టీ ఆద్యంతం జమీం దార్లు, జాగీర్‌దార్లు, భూస్వాములకు అండగా నిలిచిందని విమర్శించారు. స్వాతం త్రోద్యమంలో అయితే బ్రిటీషర్లకు ఏజెంట్లుగా పని చేస్తూ.. పోరాటా‌నికి వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు.తెలంగాణలో నిజాం, కర్నాటకలో టిప్పు సుల్తాన్‌ చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేస్తోందని విమర్శించారు. హిందూ మతం, సంస్కృతి, భాషతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లను కూడా నియంత్రిస్తున్నారని పేర్కొన్నారు. దాని వల్ల ప్రజల్లో వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. దేశభక్తి ముసుగులో బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు.

కులమతాలకతీతంగా తెలంగాణ సాయుధ పోరాటం
తెలంగాణ సాయుధ పోరాటం కులాలు, మతాలకతీతంగా జరిగిందని రాఘవులు స్పష్టం చేశారు. హిందూ ముస్లింల నుంచి మొదలుకుని అన్ని వర్గాల వారు పాల్గొన్నారని తేల్చి చెప్పారు.
1948 ఆగస్టు 28న భైరాన్‌‌పల్లిలో జరిగిన ఊచకోతలో 136 మంది, సెప్టెంబర్‌ 12‌న పరకాలలో 22 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన, గుండ్రాం పల్లి ప్రాంతంలో 350 మంది కాల్చివేతలో అన్ని మతాలు, కులాల యోధులున్నారని గుర్తు చేశారు. సంఘటనకు పాల్పడిన రజాకారు ఫౌజుకు ఖాసీం రజ్వీ నాయకత్వం వహిస్తే విసునూరు రాంచంద్రారెడ్డి రెండో నాయకుడిగా ఉన్నారని అన్నారు. అనాటి వెట్టి చాకిరీ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే ప్రజలు పోరుబాట పట్టారని గుర్తు చేశారు.

సంస్థానాల విలీనంలో కాంగ్రెస్‌ ‌పాత్రలేదు
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో 565 సంస్థానాలున్నా అందులో హైదరాబాద్‌, కాశ్మీర్‌ ‌సంస్థానాలే పెద్దవన్నారు. బ్రిటీషర్లు ఈ దేశం విడిచి వెళ్లేటప్పుడు సంస్థానాలు ఇండియా లేదా పాకిస్తాన్‌‌ ఏ దేశంలోనైనా కలవొచ్చనీ, ఇష్టం లేకుంటే స్వతంత్ర దేశంగా ఉండొచ్చని పెట్టిన మెలికను కాంగ్రెస్‌ ‌వాడుకుందని విమర్శించారు. 1947 నుంచి 48 వరకు ఏడాది పాటు హైదరాబాద్‌ ‌సంస్థానంపై పోలీస్‌ ‌యాక్షన్‌ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణలో కమ్యూనిస్టులు బలపడి స్వతంత్ర దేశంగా ఏర్పడే అవకాశం ఉందనే భయంతోనే కాంగ్రెస్‌ ‌గత్యంతరం లేక నిజాంతో రాజీ చేసుకుని విలీనాన్ని ప్రకటించిందని అన్నారు. ఆ తర్వాత జరిగిన పోరాటంలో వేల మందిని భారత సైన్యం పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఏనాడూ భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. విలీనం తర్వాత తెలంగాణలోని భూస్వాములు షెర్వానీ వదిలి ఖద్దరు టోపీ ధరించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

కొత్త తరం ఉద్యమాలకు నాయకత్వం వహించాలి
ఢిల్లీ రైతుల పోరాటం నుంచి కాక్రోచ్‌‌ జనతా పార్టీ ఉద్యమం వరకు వస్తున్న కొత్త తరహా పోరాటాలకు కమ్యూనిస్టులు నాయకత్వం వహించాలని రాఘవులు అన్నారు. లౌకిక వాదం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడటంలో ముందుండాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నిజాం నుంచి నేటి వరకు ఎన్ని పోరాటాలు జరిగినా భూ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణమని పేర్కొన్నారు. 22 ఏ సమస్య ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్‌ 450 ఎకరాలు, రేవంత్‌‌రెడ్డి 350 ఎకరాల భూ ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్‌ ‌చేశారు. సీపీఐ(ఎం) హైదరాబాద్‌ ‌సిటీ సెంట్రల్‌ ‌కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నేత ఎం.శ్రీనివాస్‌, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. శ్రీనివాసరావు, ఎం.దశరథ్‌, నాగలక్ష్మి, రాజన్న, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -