బీఆర్ ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు
మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌లపై
పరువు నష్టం దావా
కఠిన చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టుకు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజకీయ స్వలాభం కోసం, పవిత్రమైన దేవాలయ సందర్శనను వక్రీకరించి తనపై అత్యంత చవకబారు ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌లపై బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి హరీశ్ రావు పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై క్షుద్రపూజల ఆరోపణలు చేసిన ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలపై హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ క్రిమినల్ వద్ద పరువు నష్టం దావా దాఖలు చేశారు. బీఎన్‌ఎస్ 2023 చట్టంలోని సెక్షన్ 356 కింద వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలను, పత్రికల్లో వచ్చిన ప్రకటనలను పెన్‌డ్రైవ్‌ల ద్వారా న్యాయమూర్తికి అందజేశారు. గత నెలలో కుటుంబ సభ్యులతో కలిసి హరీశ్‌రావు కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా దేవి ఆలయాన్ని సందర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ ఆధ్యాత్మిక పర్యటనను కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని కోరుకుంటూ క్షుద్రపూజలు చేశారంటూ మహేశ్‌గౌడ్, అద్దంకి దయాకర్‌లు గాంధీ భవన్ వేదికగా, మీడియాతోపాటు సోషల్ మీడియాలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధమైన, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు, కేవలం రాజకీయ దురుద్దేశంతో వ్యక్తి వ్యక్తిత్వాన్ని, ఆయన విశ్వాసాలను కించపరిచేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించామని తెలిపారు.పూజలను కూడా రాజకీయ బురద చల్లడానికి వాడుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కల్పిత ఆరోపణలపై గత నెలలోనే తన న్యాయవాదుల ద్వారా ఆ ఇద్దరు నేతలకు లీగల్ నోటీసులు పంపామని తెలిపారు. తాము చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశామని పేర్కొన్నారు. మహేశ్‌కుమార్ గౌడ్‌కు వచ్చిన నోటీసును కనీసం తీసుకోకుండా ఉద్దేశపూర్వ కంగా తిరస్కరించారనీ, అద్దంకి దయాకర్ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ పొంతన లేని సమాధానం ఇచ్చారని వివరించారు. వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదనీ, న్యాయస్థానం ద్వారానే తగిన గుణపాఠం చెప్పించాలనే ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందనీ, ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించినందున వారికి శిక్ష పడటం ఖాయమని పేర్కొన్నారు.



