Monday, September 21, 2026
E-PAPER
Homeమానవిపెళ్లయితే ఆగిపోవాలా..?

పెళ్లయితే ఆగిపోవాలా..?

- Advertisement -

మహిళ ఉద్యోగం వదిలిన ప్రతిసారీ అది ఆమె తీసుకున్న స్వచ్ఛంద నిర్ణయమేనా? తల్లి అయిన ప్రతిసారీ ఆమె కెరీర్‌ను పక్కన పెట్టడం సహజమేనా? పెళ్లి తర్వాత ఆమె కలలకు సెలవు ఎందుకు? మాతృత్వం వచ్చిన తర్వాత ఆమె ఆర్థిక స్వాతంత్ర్యానికి విరామం ఎందుకు? ఇవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నల్లా కనిపించినా, వాస్తవానికి ఇవి మన సమాజ నిర్మాణాన్ని ప్రశ్నించే రాజకీయ ప్రశ్నలు. The Great Indian Return Report 2026 చెబుతున్న గణాంకాలు ఆలోచింపజేస్తున్నాయి. పనిచేస్తున్న తల్లుల్లో 50 శాతం మంది 30 ఏళ్లలోపే ఉద్యోగాలను వదిలేస్తున్నారు. కెరీర్ విరామం తీసుకున్న మహిళల్లో కేవలం 27 శాతం మందే తిరిగి ఉద్యోగాల్లోకి వస్తున్నారు. సుమారు 70 లక్షల మంది మహిళలు తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని నివేదిక అంచనా వేస్తోంది. ఈ సంఖ్యల వెనుక 70 లక్షల కథలు ఉన్నాయి. ఆగిపోయిన కలలు ఉన్నాయి. వాయిదా పడిన లక్ష్యాలు ఉన్నాయి. తమ ప్రతిభను తామే ప్రశ్నించుకునేలా చేసిన పరిస్థితులు ఉన్నాయి.

సరిత.. ఉన్నత విద్యను పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. పిల్లలకు విద్యను అందించాలనే ఆసక్తి, తన రంగంలో మరింత ఎదగాలనే లక్ష్యం ఆమెకు ఉన్నాయి. కానీ పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, ఇంటి అవసరాలు ఒక్కొక్కటిగా ఆమె సమయాన్ని ఆక్రమించాయి. చివరకు తనకు ఎంతో ఇష్టమైన వృత్తిని మధ్యలోనే ఆపుకోవాల్సి వచ్చింది.
దీప్తి.. పీజీ పూర్తి చేసి ప్రొఫెషనల్ ఉద్యోగంలో కొనసాగుతోంది. తన ప్రతిభతో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఆమె ముందున్నాయి. పెళ్లి తర్వాత కొంతకాలం ఉద్యోగం కొనసాగించినా, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలు, ఇంటి నిర్వహణ అన్నీ కలిసొచ్చినప్పుడు “కొంతకాలం ఉద్యోగం ఆపితే మంచిదేమో” అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ “కొంతకాలం” ఎప్పుడు సంవత్సరాలుగా మారిందో ఆమెకే తెలియలేదు.
కావ్య.. ఉన్నత విద్యతో బాధ్యతాయుతమైన వృత్తిలో కొనసాగుతూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. కుటుంబంలో పెద్దల సంరక్షణ, పిల్లల బాధ్యతలు పెరిగిన సమయంలో ఉద్యోగాన్ని కొనసాగించడం కష్టమైంది. చివరకు మంచి వృత్తిని, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పక్కన పెట్టి కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది.
ఈ ముగ్గురి కథల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వారికి చదువు లేకా.. కాదు. ప్రతిభ లేకా.. కాదు. పని చేయాలనే ఆసక్తి లేకా.. కాదు. వృత్తిపరంగా ఎదగాలనే కలలు లేకా.. కాదు. వారికి అవకాశాన్ని నిరంతరంగా కొనసాగించేందుకు అవసరమైన పరిస్థితులు లేవు. వారు కుటుంబాన్ని ప్రేమించలేక అని కాదు.
కుటుంబం కోసం త్యాగం చేశారు. కానీ ప్రశ్న అక్కడితో ముగియదు.

మహిళలే ఎందుకు?
ఒక పురుషుడు పెళ్లి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతని ఉద్యోగం కొనసాగడం సహజంగా పరిగణించబడుతుంది. అదే ఒక మహిళ ఉద్యోగం కొనసాగించాలంటే మాత్రం.. “పిల్లలను ఎవరు చూసుకుంటారు?”, “ఇంటిని ఎవరు చూసుకుంటారు?”, “కుటుంబానికి సమయం ఎలా కేటాయిస్తారు?” అనే ప్రశ్నలు ముందుకు వస్తాయి. అయితే.. “పిల్లలను మనిద్దరం ఎలా చూసుకోవాలి?”, “ఇంటి బాధ్యతలను మనిద్దరం ఎలా పంచుకోవాలి?”.. అనే ప్రశ్న ఎందుకు అంతగా వినిపించదు? మహిళ సంపాదిస్తే కుటుంబానికి డబ్బు వస్తుంది. మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటే కుటుంబ నిర్ణయాల్లో ఆమె స్వరం బలపడుతుంది. ఆమెకు తన జీవితంపై నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. అందుకే మహిళ ఆర్థిక స్వాతంత్ర్యం కేవలం ఉద్యోగానికి సంబంధించిన అంశం కాదు. అది గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, నిర్ణయాధికారానికి సంబంధించిన అంశం.
ఇంటి శ్రమకు విలువేదీ?
ఒక మహిళ ఉద్యోగం వదిలినప్పుడు కుటుంబం తక్షణంగా ఒక ఆదాయాన్ని కోల్పోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఆమె కోల్పోయేది అంతకంటే ఎక్కువ.. అనుభవం, ప్రమోషన్ అవకాశాలు, పెన్షన్ లేదా సామాజిక భద్రత, వృత్తిపరమైన గుర్తింపు, ఆర్థిక నిర్ణయాధికారం. తిరిగి రావాలనుకున్నప్పుడు మరో గోడ ఎదురవుతుంది.. అదే కెరీర్ గ్యాప్. “ఇన్నేండ్లు ఏం చేశారు?” అని ప్రశ్నిస్తారు. ఆమె ఇంటిని నడిపింది. పిల్లను పెంచింది. వృద్ధులను చూసుకుంది. కుటుంబాన్ని సంక్షోభాల్లో నిలబెట్టింది. కానీ మార్కెట్ మాత్రం దానికి విలువ ఇవ్వదు. ఇదే మన వ్యవస్థలోని వైరుధ్యం. మహిళ ఇంట్లో చేసే శ్రమకు విలువ లేదు. బయట ఉద్యోగం చేస్తే గ్యాప్‌కు శిక్ష ఉంది. ఇంటిని చూసుకుంటే “నీ పని అదే” అంటారు. మళ్లీ ఉద్యోగంలోకి రావాలంటే “మీ అనుభవం ఎక్కడ?” అంటారు.
మహిళ ఎక్కడ నిలబడాలి?
ఇదే ప్రశ్నను కుటుంబాలు, సంస్థలు, ప్రభుత్వాలు, సమాజంలో ఎదుర్కోవాలి. పనిచేసే తల్లులకు అందుబాటులో ఉండే పిల్లల సంరక్షణ కేంద్రాలు కావాలి. సురక్షితమైన రవాణా కావాలి. సౌకర్యవంతమైన పని విధానాలు కావాలి. కెరీర్ గ్యాప్‌ను ప్రతిభకు వ్యతిరేకంగా ఉపయోగించని నియామక విధానాలు కావాలి. తిరిగి ఉద్యోగంలోకి రావాలనుకునే మహిళలకు రీ-స్కిల్లింగ్, రీ-ఎంట్రీ అవకాశాలు కావాలి. అన్నింటికంటే ముందు కుటుంబంలోనే మార్పు రావాలి. “ఉద్యోగం కంటే పిల్లలు ముఖ్యం” అని తల్లిని మాత్రమే ప్రశ్నించే కుటుంబం, “పిల్లల కోసం మనిద్దరం ఏం చేయాలి?, ఎలా చేద్దాం?’’ అని తండ్రిని కూడా ప్రశ్నించాలి. మహిళకు ఉద్యోగం అవసరమా అని భర్త నిర్ణయించే కాలం ముగియాలి. ఆమె కెరీర్ “అనుమతి”తో నడిచే వ్యవస్థ కాకుండా ఆమె ప్రతిభకు పట్టం కట్టే లింగ సమానత్వ వ్యవస్థ కావాలి. ఆమె సంపాదన కుటుంబానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే ఆమె ఉద్యోగానికి విలువ ఇవ్వడం కూడా మారాలి.
ఎందుకంటే..?
స్త్రీ సంపాదన కుటుంబానికి అవసరమైనంత మాత్రాన ఆమె శ్రమ విలువైనది కాదు. ఆమెకు ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం. మహిళను ఇంటి గోడల మధ్య “త్యాగమూర్తి”గా నిలబెట్టి, బయట ప్రపంచంలో ఆమె అవకాశాలను కత్తిరించడం సమానత్వం కాదు. మహిళకు కుటుంబం కావాలి. కానీ కుటుంబం కోసం ఆమె వ్యక్తిత్వం చనిపోవాల్సిన అవసరం లేదు. మహిళకు మాతృత్వం కావాలి. కానీ మాతృత్వం కోసం ఆమె కలలు సమాధి కావాల్సిన అవసరం లేదు. మహిళకు కెరీర్ కావాలి. కానీ అందుకోసం ఆమె తల్లితనాన్ని త్యజించాల్సిన అవసరం కూడా లేదు. ఎంపికల మధ్య ఒకదాన్ని ఎంచుకోమని మహిళను బలవంతం చేయని సమాజమే నిజమైన లింగ సమానత్వ సమాజం. పెళ్లి ఆమె జీవితానికి కొత్త అధ్యాయం కావాలి.. చివరి పేజీ కాదు. మాతృత్వం ఆమె జీవితంలో కొత్త బాధ్యత కావాలి.. కెరీర్‌కు ముగింపు కాదు. కెరీర్ విరామం ఒక దశ కావాలి.. శాశ్వత ముద్ర కాదు.
కాబట్టి ఇక ప్రశ్న…
“మహిళలు ఉద్యోగాల్లోకి తిరిగి ఎలా రావాలి?” అని కాదు. “వాళ్లు ఉద్యోగాలు వదిలేలా చేసే వ్యవస్థను ఎప్పుడు మార్చుతాం?” అదే అసలు ప్రశ్న. మహిళకు దయ కాదు.. అవకాశం కావాలి. రాయితీ కాదు.. సమానత్వం కావాలి. అనుమతి కాదు.. నిర్ణయాధికారం కావాలి. ఆధారం కాదు.. ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. స్త్రీ కెరీర్‌కు విరామం ఉండొచ్చు. ఆమె హక్కులకు మాత్రం విరామం ఉండకూడదు.

పూర్ణిమా యర్రంశెట్టి, 9676439996

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -