నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారుగా 19 వేల ఎకరాల్లో పండించిన జొన్న పంట చేతికి వచ్చినప్పటికీ ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న అధికార పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు జొన్న పంట చేతికి వచ్చిన ఏ ఒక్కరూ స్పందించడం లేదని, రైతు పండిచిన పంటలు దళారులకు అమ్ముకోవడం జరుగుతుందని, ప్రభుత్వం నామ్ కె వాస్తుగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.3699 ప్రకటించి చేతులు దులుపుకుందని వాపోతున్నారు. జొన్న పంటకు సరైన మార్కెట్ సదుపాయాలు లేకపోవడంతో దళారులు క్వింటాలుకు రూ.2200 కే పంటను కొనుగోలు చేస్తూ రైతు లను నష్టాల్లోకి నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొందరు వ్యాపారులైతే జొన్నలను కొనమని రైతు ముఖం మీద చెప్పేస్తున్నారు. మండలంలో సుమారుగా 19 వేల ఎకరాలలో జొన్న పంట చేతికొచ్చింది వేలాది టన్నుల జొన్నలను ఇటు ప్రభుత్వం కొనుగోలు చేయక అటు ప్రైవేటు వారు కొనక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని తెలిపారు. పంటకు కనీస మద్ధతు ధర ల భించకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఒకవైపు ఆరుతడి పంట ల సాగుకు ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వ హిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సరైన మద్దతు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇటీవల మండలానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. అలాగే కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు ఇప్పటికైనా జిల్లా ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పించి జొన్న పంట ప్రభుత్వం కొనుగోలు చేసి దళారుల దోపిడీ నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.



