రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని “న్యాక్” (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా ఉందని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదివిన చదువుకు ఉద్యోగం ఇచ్చే విధంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని, అందులో భాగంగా అన్ని జిల్లాలలో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ద్వారా 5000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని ఆయన కంపెనీలతో కోరారు. యువత పెద్ద ఎత్తున జాబ్ మేళాకు వస్తున్నందున ఆదివారం కూడా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సిమెంటు కంపెనీలు, రైస్ ఇండస్ట్రీస్, ఫార్మా తదితర అనేక కంపెనీలు ఉన్నాయని, అందువల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం తో పాటు, కంపెనీలపై కూడా ఉందని అన్నారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఉద్యోగం వచ్చినా ముందుగా చేరాలని, అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దని ,ఉద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగాల కోసం చదువుకోవాలని, ప్రత్యేకించి గ్రూపు ఇతర ఉద్యోగాలకు చదువుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంఎస్ ఎం ఈ కింద పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉందని, దీని ద్వారా కూడా స్వయం ఉపాధి పొందవచ్చని అన్నారు.
గతంలో తన హయాంలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 18,400 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. నల్గొండ జిల్లా లోని న్యాక్ సంస్థ అతిపెద్దదని, దీని ద్వారా అనేక వృత్తులలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు .పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యం అన్ని కల్పించామని అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలలో అనేక మంది చనిపోతున్నారని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు భద్రతను చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల జిల్లాలో ఫార్మా కంపెనీలో సంభవించిన ప్రమాదాల పై మాట్లాడుతూ అన్ని కంపెనీలు భద్రత చర్యలను తప్పకుండా పాటించాలని చెప్పారు. నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ద్వారా నిర్వహిస్తున్న జాబ్ మేళాలో నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 124 కంపెనీలు జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇచ్చేందుకు రావడం జరిగిందని, ఇందులో ఐటి, బ్యాంకింగ్ ,కంప్యూటర్ ,బిజినెస్ సర్వీస్ వంటి రంగాలలో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు. కంపెనీలు వారి వద్ద ఉన్న అన్ని ఖాళీలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుందని, ఇది మంచి అవకాశం అని అన్నారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ రాజేందర్రెడ్డి తదితరులు మాట్లాడారు.
స్థానిక సంస్థల ఇంచార్జ్ కలెక్టర్ వై. అశోక్ రెడ్డి డిప్యూటీ మేయర్ అష్రాఫ్ అలీ ,మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ ,జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు అభివృద్ధిలో శాఖ అధికారి అక్బర్ ఆలీ, పరిశ్రమల శాఖ జిఎం సతీష్, న్యాక్ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



