Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నా దీక్షను ఆపగలరు.. పోరాటాన్ని కాదు

నా దీక్షను ఆపగలరు.. పోరాటాన్ని కాదు

- Advertisement -

– రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.భీంగల్ పట్టణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఒకరోజు నిరాహార దీక్షకు పూనుకున్న రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని  పోలీసులు గృహ నిర్బంధం చేశారు.పోలీసుల ఆంక్షల నడుమ ఆయన తన స్వగృహంలోనే నిరాహార దీక్షను కొనసాగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు.

 గత బీఆర్ఎస్ (కేసీఆర్) ప్రభుత్వం భీంగల్ ప్రజల వైద్య అవసరాల కోసం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 20-25 శాతం పనులను పూర్తి చేయాలని గత రెండున్నరేళ్లుగా అసెంబ్లీలో, భీంగల్ వేదికగా అనేక పోరాటాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గతంలో తమ ప్రభుత్వం భీంగల్ కు తీసుకొచ్చిన బస్ డిపోను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందని, దానిని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.తమ ప్రభుత్వ హయాంలో భీంగల్ సీసీ రోడ్ల కోసం రూ.12 కోట్లు మంజూరు చేశామని, అయితే మొన్నటి మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల లబ్ధి కోసం తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి పనులు మొదలుపెట్టారని విమర్శించారు.

నేటికీ ఆ పనులు పూర్తి కాలేదని, రోడ్ల పై కంకర వేసి వదిలేశారని, కనీసం డాంబర్, సీసీ రోడ్లు వేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీంగల్ మార్కెట్ పనులు సైతం ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నాలుగు ప్రధాన డిమాండ్ల సాధనకై తాను భీంగల్ లో ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చానని, దీక్షకు అనుమతి కోరుతూ పోలీసులకు  సీపీ , ఏసీపీ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ లకు  ముందస్తు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతూ, వేకువజామునే పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని తెలిపారు. భీంగల్ లో దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, స్టేజిని తొలగించడమే కాకుండా, ప్రజలు, కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను సైతం పోలీసులు చించివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ, తన ఇంట్లోనే సాయంత్రం వరకు దీక్షను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భీంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడు నెలల్లో ఆసుపత్రిని తెరిపిస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు, ఐదు నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కనీసం ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రభుత్వం తరపున వచ్చి ఇన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తాం అని రాతపూర్వక హామీ ఇచ్చి ఉంటే తాను దీక్షను విరమించుకునే వాడినన్నారు. ప్రజల పక్షాన తనను తాను శిక్షించుకుంటూ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి ఎందుకు అంత ఉలుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు.భీంగల్ లో వంద పడకల ఆసుపత్రి ప్రారంభమయ్యే వరకు, మూతపడిన బస్ డిపోను తెరిపించే వరకు, మార్కెట్, అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల పనులు పూర్తయ్యే వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ న్యాయమైన పోరాటంలో బాల్కొండ నియోజకవర్గ, భీంగల్ పట్టణ ప్రజలు, కార్యకర్తలు తనకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -