పర్మిషన్ల పేరుతో ప్రాణాలతో ఆట.. చూసీ చూడనట్లు అధికారులు
నవతెలంగాణ – మక్తల్
మక్తల్ మండలంలో ఒండుమట్టి తరలింపు పేరుతో టిప్పర్ల బీభత్సం రోజురోజుకూ పెరుగుతోంది. అనుమతులకన్నా అధికంగా ఒండుమట్టి తవ్వకాలు, అతివేగంగా టిప్పర్ల రాకపోకలు స్థానిక ప్రజలకు ప్రాణహానిగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యాల అహంకార ధోరణి కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. శనివారం పట్టణ సమీపంలోని గొల్లపల్లి క్రాసింగ్ వద్ద ఒండుమట్టి తరలిస్తున్న టిప్పర్, టీవీఎస్ మోపెడ్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి టిప్పర్ టైర్ల కింద నలిగిపోయి, అక్కడికక్కడే మృతి చెందాడు.
టైర్లు శరీరంపై ఎక్కడంతో తొడల నుంచి రెండు కాళ్లు పూర్తిగా ఛిద్రమైనట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలం రక్తసిక్తంగా మారింది. మృతుడు మక్తల్ మండలంలోని మంథన్‌గోడ్ గ్రామానికి చెందిన సంగమండ హనుమంతుగా గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత వారం రోజులుగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా చెరువుల నుంచి ఒండుమట్టి తరలింపు పెద్దఎత్తున కొనసాగుతోంది. అయితే టిప్పర్ డ్రైవర్లు మితిమీరిన వేగంతో, ఎలాంటి జాగ్రత్తలు లేకుండా రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. “టిప్పర్ ఎదురొస్తే పక్కకు తప్పుకోవడమే తప్ప, సురక్షితంగా ప్రయాణించే పరిస్థితి లేదు” అని వాపోతున్నారు. పర్మిషన్లకు మించి ఒండుమట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల నిర్లక్ష్యమే ఈ మరణాలకు కారణమన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అక్రమ తవ్వకాలు, టిప్పర్ల అతివేగాన్ని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



