Thursday, September 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమా షరతులకు అంగీకరిస్తే నేహార్ముజ్‌ను తెరుస్తాం

మా షరతులకు అంగీకరిస్తే నేహార్ముజ్‌ను తెరుస్తాం

- Advertisement -

స్పష్టం చేసిన ఇరాన్‌…న్యూయార్క్‌లో
అమెరికా ప్రతినిధులతో అరాగ్చీ భేటీ
న్యూయార్క్‌ :
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరవుతున్న ఇరాన్‌ ప్రతినిధులతో అమెరికా అధికారులు న్యూయార్క్‌లో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీ సానుకూలంగా జరిగిందని, ఒప్పందానికి రావడం రాకపోవడం ఇరాన్‌పై ఆధారపడి ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ‘ఇది ఓ మంచి సమావేశం. ఒప్పందానికి వస్తే వారికే ప్రయోజనం’ అని వ్యాఖ్యానించారు. ఘర్షణల నివారణ కోసం ఇరాన్‌ ఎందుకు ఒప్పందం చేసుకోవడం లేదో తాను ఊహించలేకపోతున్నానని చెప్పారు. ఐరాస సర్వసభ్య సమావేశాలకు హాజరవుతున్న ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్‌ విట్‌కాఫ్‌, జేర్డ్‌ కుష్నర్‌లతో చర్చలు జరిపారు. ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయాలని, అన్ని రకాల పోరును నిలిపివేయాలని అరాగ్చీ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారని తెలిసింది. ఈ డిమాండ్లను నెరవేరిస్తే హార్ముజ్‌ జలసంధిని తెరుస్తామని ఆయన చెప్పారు.
‘వారు నాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. వారు మాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడారు. ఈ సంబంధం అభివృద్ధి చెందుతోంది’ అని ఆయన తెలిపారు. చర్చలు కొనసాగుతాయని అంటూ అంతిమంగా ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే అణ్వాయుధాన్ని పొందకుండా ఇరాన్‌ను నిరోధిస్తామని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. ఇరాన్‌ ప్రతినిధులతో చర్చలపై తాను చాలా సంతోషంగా ఉన్నానని విట్‌కాఫ్‌ వ్యాఖ్యానించారు. మధ్యవర్తులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తారని ఆయన చెప్పారు. కాగా గల్ఫ్‌, ప్రాంతీయ దేశాల దౌత్య యత్నాల కారణంగానే అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు చర్చలు జరిపారని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -