శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ వనపర్తి
శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వనపర్తి ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతా రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ ద్వారా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమై, రాచరికం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
మహాలక్ష్మి పథకం మహిళలకు వరం
ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిగా తీర్చిదిద్దే సంకల్పంతో ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించగా, జిల్లాలో ఇప్పటివరకు 3.84 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. దీనికిగాను ప్రభుత్వం ₹161.16 కోట్లను భరించింది. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి 35,951 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున యూనిఫారాలు అందజేస్తుండగా, ఇప్పటివరకు కుట్టించిన 53,902 యూనిఫారాలలో 41,150 మంది విద్యార్థులకు పంపిణీ పూర్తి చేశారు.
రూ. 500లకే వంటగ్యాస్ సరఫరాపెరుగుతున్న నిత్యావసర ధరల నుండి పేదలను ఆదుకునేందుకు మహాలక్ష్మి పథకం కింద ₹500 లకే వంటగ్యాస్ సరఫరా చేస్తున్నారు. దీని ద్వారా జిల్లాలో 85,383 మందికి 5,12,439 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయగా, ప్రభుత్వం ₹15.71 కోట్ల సబ్సిడీని భరించింది. అలాగే ₹5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
వడ్డీ లేని రుణాలు
జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను 9,023 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద ప్రభుత్వం ₹7.72 కోట్లు మంజూరు చేసింది. అలాగే జిల్లాలోని 5 మునిసిపాలిటీల్లో 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి 956 సంఘాలకు ₹3.16 కోట్ల వడ్డీ లేని రుణాలను మంజూరు చేశారు.
రాజీవ్ ఆరోగ్యశశ్రీ
పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షలకు పెంచగా, 2026 జనవరి 1 నుండి ఇప్పటివరకు జిల్లాలో 6,816 మందికి ₹22.14 కోట్ల వ్యయంతో ఉచిత వైద్య చికిత్సలు అందించారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
రైతు భీమా పథకం ద్వారా 2025-26లో జిల్లాలోని 702 మంది రైతు కుటుంబాలకు ₹35.10 కోట్లు అందించారు. అలాగే 2026 వానాకాలం రైతు భరోసా కింద 1,82,768 మంది రైతులకు ఎకరానికి ₹6,000 చొప్పున ₹212.32 కోట్లను ఖాతాల్లో జమ చేశారు. గిరిజన ప్రాంతాల్లో చెరువులు నింపి 4,235 ఎకరాలకు సాగునీరు అందించేలా ₹76.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కర్నేతండా ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి ప్రారంభించారు.
ఎల్‌నినో ప్రభావంతో 38% వర్షపాతం తగ్గడంతో రైతులను మినుములు, కంది, జొన్న, ఆముదం వంటి ఆరుతడి పంటల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 90% రాయితీపై 1,127 క్వింటాళ్ల మినుములను పంపిణీ చేయగా, 100% సబ్సిడీతో 3,750 ఎకరాలకు సరిపడా వేరుశనగ విత్తనాలను పంపిణీకి సిద్ధం చేశారు. అలాగే జిల్లాలోని 1,83,568 రేషన్ కార్డుదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి అందిస్తున్నారు. మరోవైపు జిల్లాలో 26,465 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు పాత కార్డులలో 1,04,000 మంది కొత్త సభ్యులను చేర్చారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వనపర్తి జిల్లాలో మొదటి విడతలో మంజూరైన 5,874 గృహాల్లో 92% నిర్మాణం పూర్తయింది. దీనికిగాను ₹170.84 కోట్లు ఖర్చు చేయగా, జిల్లా రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచింది. రెండవ విడతలో గుడిసెలు లేని రాష్ట్ర సాధనలో భాగంగా గుర్తించిన 689 మందిలో అర్హులైన 560 మందికి ఇళ్లు మంజూరు చేయగా, అందులో 120 ఇళ్లు బేస్మెంట్ స్థాయి వరకు పూర్తయి 17% పురోగతి సాధించాయి.
గృహజ్యోతి పథకంగృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా, వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 85,423 కుటుంబాలకు 21.60 లక్షల జీరో బిల్లులు జారీ చేసి ₹62.60 కోట్ల సబ్సిడీ అందించారు. అలాగే “చేయూత” పథకం ద్వారా జిల్లాలోని 70,342 మంది వికలాంగులు, వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర అర్హులకు ప్రతి నెలా ₹16.33 కోట్లు పింఛన్ల రూపంలో అందజేస్తున్నారు.
వన మహోత్సవం, పర్యావరణ పరిరక్షణ
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 17.09 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 8.65 లక్షల మొక్కలు నాటారు. అలాగే పారదర్శకత, జవాబుదారితనంతో సేవలు అందించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా స్థాయి నుండి డివిజన్, మండల స్థాయిలకూ విస్తరించారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ప్రజావాణి పోర్టల్ ద్వారా వేగంగా పరిష్కరిస్తున్నారు.
విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం
వనపర్తి జిల్లాలో ₹200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ₹13.50 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్స్, ₹47.50 కోట్లతో బాలుర ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల భవనాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలలు, KGBVలలో సీఎం కిట్స్ అందుబాటులో ఉంచడంతో పాటు, వెల్టూర్ ZPHS పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపిక చేశారు. మరోవైపు వైద్యరంగంలో ₹203.95 కోట్లతో జిల్లా ఆసుపత్రి, పెబ్బేరు, ఆత్మకూరులలో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు కొనసాగుతుండగా, 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే “మిషన్ మధుమేహ” ద్వారా జిల్లాలో గుర్తించిన 19,643 మంది బాధితులకు ఉచితంగా డయాబెటిక్ రెటినోపతి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం అమలు చేస్తూ జిల్లాలో వచ్చిన 12,851 దరఖాస్తుల్లో 11,403 పరిష్కరించారు. భద్రత కోసం 2,221 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు షీ టీమ్స్, AHTUల ద్వారా మహిళల రక్షణ, బాల్యవివాహాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర సేవలకు డయల్-100 స్థానంలో పోలిస్, ఫైర్, అంబులెన్స్ సేవలు కలిపి డయల్-112 తెచ్చినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన అందరికీ డా. పట్నం మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ వేడుకల్లో ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, వినోద్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.



