ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాద దేశాల కూటమి రష్యాతో వ్యాపారం సాగిస్తున్న దేశాల మీద ఏకపక్షంగా సుంకాల దాడిని ప్రారంభించింది. తాజాగా అమెరికాలో ఉన్న సెనేట్, కాంగ్రెస్ ఉభయ సభలూ అటువంటి దేశాల మీద 100 శాతం వరకూ సుంకాన్ని విధించడానికి పచ్చజెండా ఊపాయి. రష్యా నుండి ప్రస్తుతం అధిక పరిమాణంలో చమురు కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనా దేశాలు ట్రంప్ సుంకాల దాడికి ప్రధాన లక్ష్యాలుగా ఉండబోతున్నాయి.
ఈ రెండింటిలోనూ ఇండియా కన్నా ట్రంప్ సుంకాల దాడిని ఎదుర్కోవడానికి తగినట్టుగా మెరుగైన స్థితిలో చైనా ఉంది. ప్రపంచానికి అంతటికీ అవసరమైన అరుదైన మూలకాల (రేర్ ఎర్త్స్ ) సరఫరాను చైనా నియంత్రించగల స్థానంలో ఉంది. రక్షణ వ్యవస్థలో ఉపయోగించే కీలకమైన ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఈ అరుదైన మూలకాలు అవసరమౌతాయి. అందుచేత వాటి సరఫరా చైనా నుండి ఆగిపోయే పరిస్థితిని రానివ్వకుండా అమెరికా జాగ్రత్త పడవలసి వుంటుంది. ఆ కారణంగా చైనా మీద ఒత్తిడిని మితిమీరి పెంచడం అమెరికాకే నష్టం. అమెరికాతో నడిపే లావాదేవీలలో చైనాకు ఉన్నటువంటి ప్రత్యేక స్థితి ఏ విషయంలోనూ ఇండియాకు లేదు.
అంతర్జాతీయ స్వేచ్ఛా వ్యాపారం గురించి బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ప్రవచనాలను తెగ వల్లిస్తూ వుంటాయి. ట్రంప్ సుంకాలు ఆ ప్రవచనాల డొల్లతనాన్ని బయట పెడుతున్నాయి. తమ అడుగులకు మడుగులొత్తని ఏ దేశం మీదనైనా సామ్రాజ్యవాద దేశాలు ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తున్నాయి గనుక, అటువంటి ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశాలతో తక్కిన ఏ దేశమైనా వాణిజ్యాన్ని నిర్వహిస్తే ఆ దేశం కూడా అధిక సుంకాల రూపంలో శిక్షలను ఎదుర్కోవలసి వుంది కనుక ఆ యా దేశాలు తాము నిర్వహించబోయే అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ఈ అసాధారణ, అన్యాయపూరితమైన వేధింపులను ఏ విధంగా ఎదుర్కోవలసి వుందో తేల్చుకోవాలి. ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా వాణిజ్యం స్వేచ్ఛా వ్యాపార సూత్రాలకు లోబడే నడుస్తోందన్న నమ్మకంతో వ్యవహరిస్తే అది సైద్ధాంతికంగా మాత్రమేకాక వాస్తవ రాజకీయ పరిస్థితినిబట్టి చూసినా అర్ధరహితమే కాగలదు.
అమెరికన్ వైఖరి లోని దుర్మార్గం కేవలం ఏకపక్ష ఆంక్షల విధింపునకో, లేక అధిక సుంకాలకో మాత్రమే పరిమితం కాదు. ఆ ఆంక్షలను పాటించే విషయంలో సైతం అది పచ్చి మోసపూరితంగా నడుచుకుంటోంది. ఇరాన్ నుంచి, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇండియా వంటి దేశాలపై అపరాధ సుంకాలను విధిస్తున్న అమెరికా, తానే అదే రష్యా నుంచి యురేనియంను కొనుగోలు చేస్తోంది. తాజాగా అమెరికన్ చట్టసభలు ఆమోదించిన చట్టంలోనే ఇందుకు ఆమోదం ఉంది. రష్యాతో వ్యాపారం చేస్తున్న తక్కిన దేశాల మీద అపరాధ సుంకాలను విధించవచ్చు నని అంటూనే అమెరికా తన అవసరాలకోసం మాత్రం రష్యా నుంచి ఏదైనా కొనుగోలు చేయవచ్చునని ఆ చట్టం చెప్తోంది. అంటే తక్కిన ఏ ఇతర దేశ ప్రయోజనాలైనా దెబ్బ తినవచ్చు కాని అమెరికా ప్రయోజనాలు మాత్రం చెక్కుచెదరకూడదు !
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తవచ్చు. కొద్ది నెలల క్రితం, హర్మూజ్ జలసంధి మొదట మూత పడ్డప్పుడు, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసుకోమంటూ అమెరికా ఇండియాను ప్రోత్సహించింది. ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగిపోకుండా వుండేందుకు ఆవిధంగా చేసింది. మరి ఇప్పుడు ఎందుకు ఇంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది?
ఇప్పుడు గనుక ఇండియా రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం మానుకుంటే అప్పుడు అనివార్యంగా ఇండియాలో చమురు ధరలు పెరుగుతాయి. దానితోబాటు ప్రపంచం మొత్తం మీద కూడా ఆ ధరలు పెరుగుతాయి. మనకు భౌగోళికంగా దగ్గర్లో ఉన్న రష్యా నుంచి కొనడం మానేసి దానికి బదులు దూరంగా ఉన్న అమెరికా నుంచి కొంటే అప్పుడు రవాణా చార్జీలు పెరుగుతాయి. అంతేకాదు, రష్యన్ ముడిచమురు శుద్ధికి అయ్యే ఖర్చు కన్నా అమెరికన్ ముడి చమురును శుద్ధి చేయడానికి ఎక్కువ ఖర్చు చేయవలసి వుంటుంది. ఇప్పుడు రష్యా తన వద్ద నుండి చమురు కొనుగోలు చేసినవారికి ధరలో రాయితీ ఇస్తోంది. అటువంటి రాయితీ ఏదీ అమెరికా ఇవ్వబోయేది లేదు. అందుచేత రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుతం లభిస్తున్న ప్రయోజనాలేవీ అమెరికా నుండి కొనుగోలు చేస్తే లభించవు. అప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలు బాగా పెరుగుతాయి. దాని వలన ద్రవ్యోల్బణం పుంజు కుంటుంది. దాని అంతిమ భారాలు పేద ప్రజల మీద విపరీతంగా పడతాయి. ‘‘మీ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగేలా, మీ ప్రజల మీద ధరల భారాలు పెరిగేలా వాణిజ్యాన్ని నిర్వహించ’’మని మరొక దేశాన్ని ఒత్తిడి చేసే హక్కు చట్ట పరంగా కాని, నైతికంగా కాని ఏ దేశానికీ లేదు. ఇక్కడ మన దేశ పేదల మీద పడబోయే భారాల గురించి అమెరికా పట్టించుకోక పోవచ్చు. కాని మన ప్రభుత్వం పట్టించుకుని తీరాలి. అది దాని బాధ్యత.
అయితే ఈ ఆంక్షల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద మొత్తంగా ఎలా పడబోతోందన్న విషయాన్ని మాత్రం అమెరికా పట్టించుకోక తప్పదు. హర్మూజ్ జలసంధి మార్గం మళ్ళీ మూతబడింది. ప్రత్యామ్నాయంగా రవాణా మార్గంగా ఉపయోగపడగల దారిలో బాబ్-ఎల్-మందెబ్ హౌతీల అదుపులో ఉంది. అందుచేత పశ్చిమాసియా దేశాల నుండి ముడిచమురు సరఫరా దాదాపు జరగని పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు సౌదీ అరేబియా పశ్చిమ దేశాలకు చమురు సరఫరా చేసే పైప్ లైన్ మీద రియాద్, మదీనా ప్రాంతాల్లో డ్రోన్ల దాడులు జరిగి ఆ పైప్‌లైన్ దెబ్బతినిపోయింది. అందు వలన సౌదీ అరేబియా ఆ మార్గాన్ని మూసివేసింది. ఇదంతా కలిసి ప్రపంచం మొత్తం మీద ముడిచమురు సరఫరాలకు తీవ్ర స్థాయిలో కొరత ఏర్పడింది. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ ధర సెప్టెంబర్ 10 నాటికి బ్యారెల్ కు 105 డాలర్లు అయింది. ఆ స్థాయిలోనే ఇంకా కొనసాగుతోంది. ఇంక ఇండియా, చైనాలు కూడా రష్యన్ చమురు కొనుగోలు చేయడం మానుకుంటే ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా మరింత ఎక్కువ స్థాయికి ఎగబాకుతాయి.
ఈ పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో 1973లో జరిగిన మాదిరిగా మళ్లీ ద్రవ్యోల్బణం, దానితోబాటు ఆర్థిక మాంద్యం విజృంభించడానికి దారితీస్తుంది. ఒకవేళ అమెరికా తన వద్ద నుండి ముడి చమురు సరఫరాలు విపరీతంగా పెంచి ప్రపంచ మార్కెట్‌లో కొరత ప్రభావాన్ని తగ్గించడానికి పూనుకున్నా, అమెరికన్ ముడి చమురు ధర అధికం కావడం వలన ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం తప్పదు. ఈ విధంగా జరగకుండా నివారించడానికి ఒకే మార్గం ఉంది. ప్రభుత్వాలు తమ తమ ద్రవ్య లోటులను పెంచి తద్వారా పెరిగే చమురు ధరల భారాన్ని తామే మోయడానికి సిద్ధపడితే అప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగవు. ద్రవ్యోల్బణం తలెత్తదు. కాని ప్రభుత్వం తన ద్రవ్యలోటును పెంచుకోడానికి ఏ మాత్రమూ సిద్ధంగా లేదు. అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోడానికి ‘‘పొదుపు’’ చర్యలను చేపడుతోంది. అందుచేత 1973లో జరిగిన మాదిరిగా ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తడం అనివార్యం.
ప్రపంచం మొత్తంగా ద్రవ్యోల్బణం తలెత్తితే ఆ ప్రభావం అమెరికా మీద కూడా పడక తప్పదు. ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు సమీపంలో ఉన్నాయి. అటువంటి సమయంలో ట్రంప్ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఆహ్వానిస్తుందా? మరి ఇప్పుడు ఎందుకోసం అమెరికన్ చట్ట సభలు ఈ తాజా ఆంక్షల చట్టాన్ని ఆమోదించాయి? ఇప్పుడు ఆమోదించిన చట్టం ప్రధానంగా అధ్యక్షుడికి అధికారాలను కట్టబెట్టే చట్టం. అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలూ కలిసి అమెరికా పెత్తనానికి తలవొగ్గని ఏ దేశాన్నైనా మెడలు వంచేవిధంగా చేసి లొంగదీసుకోడానికి అధ్యక్షుడికి ఈ అపార అధికారాన్ని కట్టబెట్టాయి.
ఈ మధ్య ఇండియా-అమెరికాల మధ్య కుదిరిన ‘అసమాన’ వాణిజ్య ఒప్పందానికి అమెరికన్ న్యాయస్థానం బ్రేక్ వేసింది. అదనపు సుంకాలను విధించే అధికారం ట్రంప్‌నకు లేదు అని ఆ న్యాయ స్థానం తీర్పు చెప్పింది. దాంతో ఈ ఒప్పందం అమలు నిలిచిపోయింది. ఇప్పుడు అమెరికన్ చట్టసభల్లో చేసిన చట్టం ట్రంప్‌నకు ఆ అధికారాన్ని కట్టబెట్టింది. దాంతో నిలిచిపోయిన ఒప్పందాన్ని కొత్త రూపంలో మళ్ళీ తీసుకువచ్చి దాని మీద ఇండియా సంతకం చేసేలా ఒత్తిడి చేయడానికి ట్రంప్‌నకు అవకాశం వచ్చింది. ఇండియా విషయంలో మాత్రమే కాక, ఏ ఇతర దేశాన్నైనా ఇదే మాదిరిగా ఒత్తిడి చేయవచ్చు.
ఇటువంటి బెదిరింపులను ప్రతిఘటించడం భారత ప్రభుత్వం తప్పనిసరి కర్తవ్యం. ఇంత కాలమూ మోడీ ప్రభుత్వం అమెరికా విషయంలో ప్రదర్శిస్తున్న లొంగుబాటు వైఖరిని ఇప్పుడైనా విడనాడాలి. ఒప్పందం మీద సంతకం చేయకుంటే 100 శాతం సుంకాలు తప్పవన్న భయంతో కంగారుపడిపోయి దాసోహం అనకూడదు. అమెరికా బెదిరింపులు ఇండియా దగ్గర చెల్లవు అని స్పష్టం చేయాలి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
డొనాల్డ్ ట్రంప్,అతడి సుంకాలు
2 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 5 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)