దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, బాలికల భద్రత రోజురోజుకూ ప్రశార్థకంగా మారుతోంది. దేశమంతటికీ పాలనా దిశానిర్దేశం చేసే రాజధానిలోనే రాత్రి కాదు, పగలు కూడా మహిళలు భయంతో అడుగులు వేయాల్సి వస్తుంటే ఇక భద్రతపై ప్రభుత్వాలు చేసే ప్రకటనలకు విలువ ఏముంది? పార్కులో బాలికపై సామూహిక లైంగికదాడి, స్వరూప్‌నగర్‌లో బాలికపై లైంగికదాడి, హత్య, గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వస్తున్న బస్సులో బాలికపై లైంగికదాడి వంటి వరుస ఘటనలు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. ఇవి విడివిడిగా జరిగిన నేరాలుగా కొట్టిపారేయలేం. ప్రజల భద్రతను కాపాడాల్సిన పోలీసు, పరిపాలనా వ్యవస్థ ఎక్కడ విఫలమవుతున్నదని చెప్పడానికి సంకేతం.
ఈ పరిస్థితిపైనే సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించడం సాధారణ పరిణామం కాదు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో జరిగిన వరుస లైంగిక దాడులు చట్ట అమలు, పౌర పరిపాలనా వ్యవస్థల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 2012 నిర్భయ ఘటన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు కొనసాగు తోందని ప్రశ్నించించడం చర్చించాల్సిన అంశం. పార్కులు, రహదారులు, ప్రజా రవాణా, మెట్రో స్టేషన్లు, విద్యాసంస్థల పరిసరాలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత కాదా? ఒక అత్యున్నత న్యాయస్థానం ఈ ప్రశ్న వేయాల్సి రావడమే పాలక వ్యవస్థకు తీవ్రమైన హెచ్చరిక. నిర్భయ ఘటన తర్వాత దేశం ఎన్నో హామీలు విన్నది. చట్టాలు మారాయి. నిర్భయ నిధి వచ్చింది. సీసీ కెమెరాలు, మహిళా హెల్ప్‌లైన్లు, ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టులు, ప్రత్యేక కోర్టులు వచ్చాయి.
మరి వాటి ఫలితం? ఇవి సరిగా లేవనే అనుమానంతోనే ‘భద్రతా పథకాలు కాగితాలపైనే ఉన్నాయా?’ అంటూ కోర్టు వ్యాఖ్యానించడం ప్రభుత్వానికి మందలింపు వంటిదే. అంతటితో ఆగకుండా భద్రతకు సంబంధించిన అన్ని నివేదికలు ఇవ్వాలని కోరడం మంచి విషయం.
హామీలు గుప్పించడం, పథకాలు ప్రవేశపెట్టడం వంటి అంశాలు భద్రతకు సంబంధించివిగా చూపించవచ్చు. కానీ , ఒక మహిళ రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుతుందన్న నమ్మకం కల్పించడమే నిజమైన భద్రత. ఒక విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే దారిలో భయపడకుండా నడవ గలగాలి. ఒక బాలిక బస్సులో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు తనను ఎవరు కాపాడ తారో ఆలోచించాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఆస్తాకుంజ్ ఘటనలో ఒక విషాదకరమైన అంశం వెలుగుచూసింది. అక్కడి సమీపంలోని మహిళా విద్యార్థులు గతంలోనే వేధింపులపై ఫిర్యాదులు చేసినట్లు వార్తలు. అయినా పెట్రోలింగ్, నిఘా వంటి చర్యలు ఎందుకు బలోపేతం కాలేదన్నది ఇక్కడ ప్రశ్న. ఫిర్యాదు వచ్చినప్పుడు కదలని యంత్రాంగం, లైంగిదకాడి జరిగిన తర్వాత మాత్రం మేల్కొనడం బాధాకరం.
నేరం జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకోవడం పోలీసుల బాధ్యతలో ఒక భాగం మాత్రమే. నేరం జరగకుండా చూడటమే అసలు బాధ్యత.
ప్రమాదకర ప్రాంతాలు ఎక్కడున్నాయో గుర్తించడానికి కమిటీ వేస్తామని కేంద్రం ప్రకటించింది. చీకటి ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి మరో ఆడిట్ ఎందుకు? గతంలోనే గుర్తించిన సమస్యలను పరిష్కరించకుండా కొత్త సర్వేలు, కొత్త నివేదికలు, కొత్త హామీలు ఎందుకు? పద్నాలుగేండ్ల క్రితం నిర్భయ ఘటన తర్వాత కూడా అదే ప్రశ్నలు మళ్లీ కోర్టు ముందుకు రావడం ప్రభుత్వాల పనితీరుపై తీవ్రమైన సందేహాలను కలిగిస్తోంది. సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో భద్రతా ఆడిట్ కోరాల్సి వచ్చిన పరిస్థితి పాలక వ్యవస్థకు సిగ్గుచేటు.
అసలు పాలకుల మనస్తత్వం మారకుండా మహిళల భద్రతను కోరడం కూడా అర్థం లేనిదే అవుతుంది. ఎందుకంటే, మహిళల పట్ల సమాజంలో ఉన్న పురుషాధిక్య, చులకన భావజాలాన్ని రాజకీయ నాయ కుల మాటలు కూడా ప్రతిబిం బిస్తున్న సందర్భాలు ఉన్నాయి. బీజేపీ నేత, అప్పటి మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ లైంగికదాడిని “కొన్నిసార్లు సరైనది, కొన్నిసార్లు తప్పు” అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు.
లైంగికదాడులను అరికట్టడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదన్న భావనను కూడా వ్యక్తం చేశారు. కర్నాటక బీజేపీ నేత కె.ఎస్. ఈశ్వరప్ప ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి “ఎవరైనా నిన్ను లాక్కెళ్లి లైంగికదాడి చేస్తే ప్రతిపక్షం ఏం చేయగలదు?” అనే ప్రశ్న వేశారు. ఇలాంటి మాటలను కేవలం వివాదాలుగా మర్చిపోలేం.
మహిళను సమాన హక్కులు కలిగిన పౌరురాలిగా కాకుండా ఒక వస్తువుగా, బాధితురాలినే ప్రశ్నించే విధంగా మాట్లాడే మనస్తత్వం మారకుండా మహిళా భద్రతపై ఎన్ని పథకాలు తెచ్చినా ప్రయోజనం పరిమితమే. మహిళల భద్రత హామీలతో కాదు, ఆచరణలో కనిపించే రక్షణతోనే నిరూపించాలి.నిర్భయ చట్టం వంటి కఠిన చట్టాలు వచ్చినా మహిళల భద్రతపై భరోసా ఇంకా పూర్తిగా ఏర్పడలేదు.చట్టాల కంటే వాటి అమలు, నేరాల నిరోధం, బాధితులకు సత్వర న్యాయం అత్యంత కీలకం.చట్టాలు, పథకాలు ఎన్ని ఉన్నా పాలకులూ, పాలనా మనస్తత్వంలో పోలీసు వ్యవస్థలో మార్పు లేకపోతే ఫలితం ఉండదు.నిర్భయ చట్టం స్ఫూర్తితో మహిళలకు భయరహిత వాతావరణం కల్పించినప్పుడే ఆ చట్టాల లక్ష్యం నెరవేరినట్టవుతుంది.
నిర్భయమేది?
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 3 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)