గుర్రంపోడులో 39.5 డిగ్రీలు
తేమతో పెరుగుతున్న ఉక్కపోత
ఎల్‌నినో ప్రభావంతో మండుతున్నసూర్యుడు
సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఎండలు
వర్షం కురిసినా
తాత్కాలిక ఉపశమనమే..
రాష్ట్రంలో వేసవి తలపిస్తున్న
ఉక్కపోత
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వర్షాలు, చల్లని గాలులు, చక్కటి వాతావరణంతో అహ్లాదకరంగా ఉండాల్సిన సెప్టెంబర్ నెలలోనూ భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. వేసవిని తలపిస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారుల సమాచారం ప్రకారం రాష్ట్రంలోని పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. వర్షాకాలం కొనసాగుతున్నందున వాతావరణంలో ఇప్పటికే తేమ ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో గాలి మరింత తేమను నిలుపుకొంటుంది. ఫలితంగా ఉష్ణోగ్రతతోపాటు ఉక్కపోత కూడా అధికంగా ఉంటోంది. నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల్లో 35 డిగ్రీలు ఉంది. 30న కూడా 35 డిగ్రీల వద్దే ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మంలో 34 డిగ్రీలు ఉంది. వరంగల్, నల్లగొండల్లోనూ తీవ్రంగానే ఉంది. హైదరాబాద్‌లోనూ గట్టిగానే ఎండలు ఉంటున్నాయి. 31.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. కానీ 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్లే ఈ పరిస్థితి ఉందని, రాబోవు కాలంలో మరో రెండు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
39.5 డిగ్రీలతో ఉత్కంఠ..
నల్లగొండ జిల్లా గుర్రంపోడులో నమోదైన 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత తీవ్రతను చాటింది. సెప్టెంబర్ మధ్యలో నమోదైన ఈ ఉష్ణోగ్రత తెలంగాణలో ఆ నెలకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత రికార్డుకు అత్యంత సమీపంగా ఉండటం గమనార్హం. తెలంగాణలో సెప్టెంబర్ అత్యధిక ఉష్ణోగ్రత 39.6 డిగ్రీలు నమోదైన నేపథ్యంలో గుర్రంపోడు ఉష్ణోగ్రత ప్రత్యేకంగా నిలిచింది.
వర్షం వచ్చినా.. మళ్లీ ఉక్కపోతే
మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, వర్షంతో ఉష్ణోగ్రతలు కొద్దిసేపు తగ్గినా ఆ తర్వాత తేమ పెరిగి ఉక్కపోత మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. బలహీనమైన రుతుపవన పరిస్థితులు, ఉష్ణోగ్రతల పెరుగుదలకు వివిధ వాతావరణ కారకాలతోపాటు ఎల్‌నినో ప్రభావం కూడా కారణమై ఉండొచ్చని ఐఎండీ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి సివిల్ సర్జన్- డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ అరుంధతి
అధిక ఉక్కపోత సమయంలో తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరినీరు వంటి ద్రవాలు తీసుకోవాలి. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఎండకు దూరంగా ఉండాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలి.







కామెంట్‌లు (0)