రాష్ట్రంలోనే అత్యధిక ఆక్రమణలు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోనే..
ఏండ్లుగా కబ్జాలోనే ఆలయ భూములు
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ గాలికి
ఆలయాల ఆస్తుల పరిరక్షణ గాలికొదిలేశారు. దేవుడి మాన్యాలు అన్యాక్రాంతమవుతున్నా ఎవరికీ పట్టడంలేదు. దేవాలయ రికార్డుల మాయాజాలం, పాలకుల నిర్లక్ష్యం, కబ్జాదారుల అక్రమ సంపాదన వెరసి .దేవాలయాల ఆస్తులు దర్జాగా ఆక్రమణదారుల పాలవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఈ భూములు కరిగిపోతున్నాయి. నిధుల్లేక ఆలయాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతుందనే అభ్రిపాయమూ ఉంది. వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని సాగుతున్న ఆక్రమణల పై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
నవతెలంగాణ -మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
వందల ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. తెలంగాణతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన భూములున్నాయి. దేవాలయాలలో అర్చకులు, భక్తులకు విశ్రాంతి కేంద్రాలుగా ఉండాలని , ఆలయాల నిర్వహణకు లోటు రాకూడదని సంస్థానాధీశులు, జమీందార్లు, దాతలు వేల ఎకరాల భూములను దేవుని మాన్యాలుగా రాసిచ్చారు. అట్టి భూముల్ని పరిక్షించాల్సి బాధ్యత దేవాదాయ శాఖపై ఉంది. కానీ..! దేవుడి పేరిట ఉన్న భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవుడి ఆస్తులు అవినీతి పరుల పాలవుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా దేవాలయ భూములు ఆక్రమణకు గురైన కబ్జాలో ‘నెంబర్ వన్’ జిల్లాగా మహబూబ్‌నగర్ నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎండోమెంట్ పరిధిలో 87,235.39 ఎకరాలు భూములు ఉన్నాయి. అందులో 20,124.03 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారిక సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా సంస్థానాలకు పెట్టింది పేరు. గతంలో వనపర్తి, గద్వాల వంటి సంస్థానాల పాలకులు ఆలయాలకు భారీగా భూములను విరాళంగా ఇచ్చారు.
కానీ నేడు ఆ భూములను కాపాడే నాథుడే కరువయ్యాడు. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలోని కోదండరామస్వామి ఆలయం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. సంస్థానాధీశురాలు రాణి రంగనాయకమ్మ నిర్మించిన ఈ ఆలయానికి, రథోత్సవాలు, జాతరల నిర్వహణ కోసం ఊరి బయట సర్వే నంబర్ 425లో 10.23 ఎకరాల భూమిని కేటాయించారు.కానీ కాలక్రమేణా ఆ భూమిపై కబ్జారాయుళ్ల కన్ను పడింది. సంస్థానాధీశుల వారసులమని చెప్పుకుంటూ కొందరు, ప్రయివేట్ వ్యక్తులు ఆ భూమిపై హక్కులను సొంతం చేసుకున్నారు. న్యాయస్థానం ఆ భూమి దేవుడిదే అని 2001లో తీర్పు చెప్పినా, క్షేత్రస్థాయిలో ఆక్రమణల పర్వం ఇంకా కొనసాగుతోంది. రికార్డుల్లో ‘దేవాలయం’ పేరు ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా సాగిపోతున్నాపట్టించుకునే వారే లేరు. దీనివల్ల ఆలయాలకు రావాల్సిన ఆదాయం కౌలు రూపంలో గానీ, పంట రూపంలో గానీ రాక, అనేక పురాతన ఆలయాలు పూజారులు ఆకలితో అలమటిస్తున్నారు. నిర్వహణ లేక గుడులు శిథిలావస్థకు చేరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రామగిరి దేవాలయానికి సుమారు 600 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో సగానికి పైగానే అక్రమణకు గురి అయినట్టు తెలుస్తోంది. ఈ ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం ఆలయ భూములకు డీజీపీఎస్ సర్వే నిర్వహించాలని నిర్ణయించినా ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో తెలియదు.
ఉమ్మడి జిల్లాలో దేవాలయ భూముల వివరాలు
దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో సుమారు 18988.24 ఎకరాల ఇనాం(మాన్యం) భూములు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోనీ జడ్చర్ల వెంకటేశ్వర స్వామి ఆలయం102.05 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, ఇందులో 63 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. కబ్జాదారుల నుంచి భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైకోర్టు కూడా అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయినా నేటికీ ఎలాంటి ఫలితం రాలేదు. ప్రస్తుత దేవాదాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్ లో 2353.26 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 3408.34 ఎకరాలు, జోగులాంబ గద్వాలలో 31 49.28 ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 5843.08 ఎకరాలు, వనపర్తి లో 4231.08 ఎకరాలు మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 18988.24 ఎకరాలు ఉన్నట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 6707.05 ఎకరాల భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. ఇందులో ఎలాంటి వివాదాలు లేని భూములు 5328 .16 ఎకరాలు కాగా, 1378.29 ఎకరాల భూములు కోర్టు కేసుల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్చకులు 3386.16 ఎకరాలలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 34 85.33 ఎకరాల దేవాలయాల భూములను లీజు పేరిట ఇతరులకు వ్యవసాయం చేసుకునేందుకు అప్పగించారు.
అధికారుల నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్యం వల్లే దేవాలయాల భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఆక్రమణల విషయం తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు నివేదించడంలో జాప్యం, రాజకీయ ఒత్తిళ్లకు నోరు విప్పకపోవడం కారణం అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే కాకుండా ఎప్పుడో నిర్ణయించిన లీజ్ ఎమౌంట్ 522.22 ను ప్రస్తుతానికి అదే కొనసాగించడంతో ఆలయాలకు ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయి. దీంతో ఆస్తులు ఉండి కూడా అనేక దేవాలయాలు నేటికీ ధూప, దీప, నైవైద్యాలకు నోచుకోకుండా ఉన్నాయి.
దేవాలయ భూములు పేదలకు పంచాలి
వనపర్తి జిల్లాలో వేలాది ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. భూఅక్రమణ దారులు కబ్జాలకు పాల్పడుతున్నారు. అక్రమణ దారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి. పంచిన భూములకు హక్కులు కల్పించాలి. హక్కులు లేకుంటే బ్యాంకులు రుణసదుపాయంతో పాటు సబ్సీడీలు ఇవ్వడంలేదు. ఎస్సీ, ఎస్టీలకు దేవాలయ భూములతో పాటు ఇతర ప్రభుత్వ భూములు పంచి పేదలను ఆదుకోవాలి.
-
పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వనపర్తి జిల్లా







కామెంట్‌లు (0)