Magazines

ఏడాదిలో సొంతింటి కల సాకారం

1 గంట క్రితం

owning a home
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం

నగరం నడిబొడ్డున కోట్ల విలువైన స్థలాల్లో ‘ఇందిరమ్మ టవర్స్’
రూపాయి ఖర్చు లేకుండా లబ్దిదారుల పేరిటే రిజిస్ట్రేషన్
గత పాలకుల్లా పేదలను నగరానికి దూరం చేయం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెడ్‌హిల్స్‌లో జీ+10 టవర్ల నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన

నవతెలంగాణ-సిటీబ్యూరో ​
పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడి, జీవితకాలపు సొంతింటి కలను ఏడాదిలోనే నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ అంతిమ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చెప్పారు. పేదరికం, వారి కష్టాలు తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వం ఇదని, వారి కన్నీటికి ఏ సంపదా విలువ కట్టలేదని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఎకరం రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు పలికే అత్యంత విలువైన కోర్ ఏరియా స్థలాలను ప్రభుత్వ ఆదాయ వనరుగా చూడకుండా, పేదల ఆవాసాల కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని రెడ్‌హిల్స్‌లో మంగళవారం ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి మంత్రి అజారుద్దీన్‌, ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్‌, స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో క‌లిసి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ నిర్మిస్తున్న ఒక్కో అపార్ట్‌మెంట్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని, నిర్మాణాల పేరిట ఏండ్ల తరబడి జాప్యం చేయకుండా, ఏడాది వ్యవధిలోనే పనులు పూర్తి చేసి ఇదే వేదికపై నుంచి లబ్దిదారులకు తాళాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. నగర పరిధిలోని 20 నియోజకవర్గాల్లో భూములను గుర్తించామని, ఇప్పటికే 16–17 ప్రాంతాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. పారదర్శక లక్కీ డ్రా ద్వారా మొదటి విడతలో 480 మంది లబ్దిదారులను ఎంపిక చేశామని, మిగిలిన అర్హులైన వారందరికీ రెండు, మూడు, నాలుగు విడతల్లో ఇండ్లు అందించి తీరుతామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వాల మాదిరిగా పేదలకు కేవలం కాగితపు సర్టిఫి కెట్లు ఇచ్చి చేతులు దులుపుకోబోమని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి పైరవీలూ, రూపాయి కమిషన్ లేకుండా, ప్రభుత్వ ఖర్చుతోనే లబ్దిదారుల పేర్లపై పక్కాగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, అత్యవసర వైద్యం వంటి అవసరాల కోసం ఆ ఇంటి ఆధారంగా బ్యాంకుల నుంచి రుణం పొందే హక్కును పేదలకు కల్పిస్తున్నామని ‌చెప్పారు.


నగరానికి దూరంగా తరలించి పేదల పొట్టకొట్టం
గత పాలకులు నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఇండ్లు నిర్మించి పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి విమర్శించారు. పేదల జీవనోపాధి, రోజువారీ పనులు, పిల్లల పాఠశాలలను దృష్టిలో ఉంచుకునే వారు నివాసముండే ప్రాంతాల్లోనే జీ+10 (గ్రౌండ్ ప్లస్ టెన్) పద్ధతిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు.


​​నాణ్యత పరిశీలన బాధ్యత లబ్దిదారులదే..
ఇండ్ల నిర్మాణంలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు నిర్మాణ స్థలాన్ని లబ్దిదారులే వారానికి ఒకసారి స్వయంగా సందర్శించి పరిశీలించే వెసులుబాటు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో డ్రయినేజీ సమస్య తలెత్తకుండా నిర్మాణ స్థలంలోని డ్రయినేజీని నేరుగా మెయిన్ ట్రంక్ లైన్‌కు అనుసంధానించే బాధ్యతను గృహనిర్మాణ శాఖే తీసుకుంటుందని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో పారదర్శకంగా నిర్వహించిన లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్దిదారులకు మంత్రి స్వయంగా ఇండ్ల నెంబర్లను కేటాయించారు. డ్రాలో మాదేసు లత అనే మహిళకు ‘ఇందిరమ్మ ఏ-టవర్’లోని 801 నంబర్ ఇంటిని కేటాయిస్తూ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ ఎండీ వి.పి.గౌతమ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్‌ ప్రియాంక ఆల, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్