అమెరికాలో దక్షిణాసియా
వాసులపై విషం
ఆన్‌లైన్‌లో జాత్యాహంకార, ద్వేషపూరిత
పోస్టులు పెరిగాయంటున్న అధ్యయనం
వాషింగ్టన్ : 2024 జనవరి-2026 జూన్ మధ్యకాలంలో అమెరికాలో దక్షిణాసియా వాసులపై ఆన్‌లైన్‌లో విద్వేష ప్రచారం 240 శాతం పెరిగిందని వాషింగ్టన్‌కు చెందిన 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్' జరిపిన అధ్యయనం తెలిపింది. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో దక్షిణాసియా ప్రజలను లక్ష్యంగా చేసుకొని జాత్యాహంకార, అమానవీయ, ద్వేషపూరిత దూషణలతో ఐదు లక్షలకు పైగా పోస్టులు కనిపించాయని సోమవారం విడుదలైన అధ్యయన నివేదిక ఎత్తిచూపింది. అధ్యయన కాలంలో విద్వేష పోస్టుల సంఖ్య నెలకు 75 శాతం పెరిగిందని తెలిపింది.ప్రధాన, పేరూ ఊరూ లేని సామాజిక మాధ్యమ వేదికలలో ఇలాంటి పోస్టులు 'నాటకీయంగా పెరిగాయ'ని అధ్యయనం చెప్పింది. ఎక్స్, 4ఛాన్, 8ఛాన్, గాబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దక్షిణాసియా నేపథ్యాలకు చెందిన దక్షిణాసియా అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని ఆన్‌లైన్‌లో జరుగుతున్న విద్వేష స్థాయి, స్వభావం, వ్యూహాన్ని ఈ అధ్యయనం పరిశీలించింది.
అందరినీ ఒకే గాటన కట్టి...
గత సంవత్సరం 4ఛాన్, 8ఛాన్, గాబ్ వంటి వేదికలలో దక్షిణాసియా వాసులపై నాలుగు లక్షల విద్వేషపూరిత, అమానవీయ పోస్టులు కన్పించాయి. అత్యధిక సంఖ్యలో పోస్టులు నమోదైన ఆరు నెలల్లో ఐదు గత సంవత్సరం నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్యే ఉన్నాయి. దీనిని బట్టి అమెరికన్లలో దక్షిణాసియాపై ద్వేషం తగ్గడానికి బదులు మరింత పెరుగుతోందని అర్థమవుతోంది. ఈ ద్వేషం జాతీయ, మత, రాజకీయ గుర్తింపులకు అతీతంగా ఉండడం గమనార్హం. అందరినీ ఒకే వర్గంగా కలిపి మూస పద్ధతిలో ద్వేషిస్తున్నారు. ఈ విద్వేషానికి ప్రభుత్వం, అది అవలంబిస్తున్న జాత్యాహంకార విధానాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, డిజిటల్ మాధ్యమాలు, రాజకీయ ప్రాబల్యం, జనాభా పరంగా ప్రమాదం అనే భావన, జాతి విద్వేషం, ఆర్థిక అసంతృప్తి, విదేశీయుల పట్ల ద్వేషపూరిత జాతీయవాదం వంటివి కారణమని అధ్యయనం తెలియజేసింది.
శుభ్రత లేదు...రోగాల పుట్టలు
దక్షిణాసియా వాసులపై ఎక్స్‌లో కన్పిస్తున్న పోస్టులలో 45 శాతం వరకూ వారిని ఆక్రమణదారులుగా, ఉద్యోగాలను దొంగిలించే వారిగా, జనాభా పరంగా ప్రమాదకారులుగా చిత్రించాయి. హెచ్-1బీ వీసాలు, వలసలే దీనికి ప్రధాన కారణం. గత కొన్ని సంవత్సరాలుగా హెచ్-1బీ వీసా హోల్డర్లలో భారతీయులే అధికంగా ఉన్నారు. దక్షిణాసియా ప్రజలపై విషం చిమ్మే పోస్టులు అన్ని సామాజిక మాధ్యమ వేదికలలోనూ కన్పిస్తున్నాయి. 'పజీత్' అనే దూషణ పదం, దాని పర్యాయపదాలు కూడా అన్ని వేదికలలోనూ కన్పించాయి. దక్షిణాసియా వాసులు అపరిశుభ్రంగా ఉంటారని, వారు రోగాల పుట్టలని అంటూ అమానవీయ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇలాంటి పోస్టుల సంఖ్య అత్యంత వేగంగా 171 శాతం వరకూ పెరగడం గమనార్హం. అగ్నికి ఆజ్యం తోడైన :చందంగా దక్షిణాసియా వ్యతిరేక దూషణలను, మూస ధోరణులను జనరేటివ్ ఏఐ మరింత పెంచి పోషిస్తోంది. పోస్టులను అవమానకరమైన, జాత్యాహంకార వ్యంగ్య చిత్రాలుగా మారుస్తోంది.
అధ్యయనం ఏం చెప్పిందంటే...
గత సంవత్సరం సెప్టెంబరులో భారత్-అమెరికా మధ్య తలెత్తిన సుంకాల వివాదం, ఫ్లోరిడాలో ఓ సిక్కు ట్రక్కు డ్రైవర్ కారణంగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించడం వంటి ఘటనల ఆధారంగా చెలరేగిన ఆగ్రహం...భారతీయులకు వ్యతిరేకంగా జాత్యాహంకార సోషల్ మీడియా పోస్టులు పెరగడం వంటి పరిణామాలు ఏకకాలంలో సంభవించాయని 'సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్' తెలియజేసింది.







కామెంట్‌లు (0)