బాధితున్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-బీబీనగర్, భూదాన్ పోచంపల్లి / ఘట్‌కేసర్
రైలు ఢీకొట్టడంతో 350 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ కేపాల్-ఘట్‌కేసర్(మేడ్చల్ జిల్లా) రైల్వే లైన్ ఔషాపూర్ మారుతీనగర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచపల్లి మండలం అల్లినగర్ గ్రామానికి చెందిన బాలగోలి కిష్టయ్య తన గొర్రెల మందను సోమవారం బీబీనగర్ మండలం కె పాల్ సమీపంలో మేత కోసం తోలుకపోయాడు. రాత్రి కావడంతో అక్కడి నుండి కిష్టయ్య వెళ్లిపోయాడు. రాత్రి గొర్రెలు రైలు పట్టాల వద్దకు వెళ్లి పడుకున్నాయి. అదే సమయంలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చి ఢీకొట్టడంతో సుమారు 350 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. ఒక గొర్రె పిల్ల ప్రాణాలతో బయటపడింది. రైలు పట్టాలపై మాంసం ముద్దులుగా పడి ఉన్న గొర్రెలను చూసి బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. గొర్రెలు మృతి చెందడంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధితున్ని పరామర్శించారు. బాధితునికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. . పశుసంవర్దక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో ఫోన్‌లో మాట్లాడారు. బాధితున్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఘటనా స్థలానికి వెళ్లి బాధితున్ని పరామర్శించారు.







కామెంట్‌లు (0)