Magazines

జిన్‌పింగ్ అమెరికా పర్యటన-పర్యవసానాలేమిటి?

1 గంట క్రితం

Xi Jinping's
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 6 నిమిషాల చదవడం

గత వారంలో మూడురోజుల పాటు చైనా అధినేత షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన ‌చేశారు. అసాధారణ రీతిలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో విమానం వద్దకు వెళ్లి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకటంతో అమెరికా, యావత్ ప్రపంచ మీడియా కూడా దానికి ఎంతో ప్రాచుర్యం కల్పించింది. దీర్ఘకాలం తరువాత చైనా అధినేత అమెరికా వెళ్లాడు. అప్పటికీ ఇప్పటికీ రెండు దేశాలలో ఎన్నో మార్పులు జరిగాయి. అనేక రంగాలలో అమెరికా బలహీనపడగా చైనా తన స్థానాన్ని మెరుగుపరు చుకుంది. ఉభయనేతలు భిన్నమైన తమ ప్రాధాన్యతలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణమిది. అయితే అది ఎక్కడా బహిరంగ ప్రకటనల్లో కనిపించదు. జీడీపీలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న రెండుదేశాల నేతల భేటీ సాధించిందేమిటి, పరిణామాలు, పర్యవసానాల గురించి విశ్లేషకులు చర్చలు చేస్తున్నారు. ఉభయులు అనేక అంశాల గురించి చర్చించుకున్నప్పటికీ ఏం జరిగిందన్నది వెల్లడి కాలేదు. కొత్త ఒప్పందాలేమీ లేకపోవటం, గతంలో కుదిరిన అవగాహనలను మరో రెండునెలల పాటు కొనసాగించాలని నిర్ణయించ టంతో యథాతధ స్థితి కొనసాగుతున్నదని కొందరు వర్ణించారు. అనేక దేశాల మీద బస్తీమే సవాల్ అంటూ వీరంగం వేస్తున్న డోనాల్డ్ ట్రంప్, ఒక దేశంగా అమెరికా చైనా విషయంలో ఆచితూచి వ్యవహరిం చటం వెనుక ఉన్నదేమిటి అనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.

షీ జిన్‌పింగ్ పర్యటనలో ఎనిమిది అంశాలపై ఏకీభావం కుదిరిందని శనివారం నాడు చైనా ప్రకటించింది. రెండు దేశాల వ్యూహాత్మక స్థిరత్వానికి నిర్మాణాత్మకమైన గుణనిర్దేశాన్ని సాధించినట్లు వర్ణించింది. పరస్పర గౌరవం, అరమరికలు లేకుండా ఉభయదేశాల సంబంధాలను నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు. ఒక పక్షం గెలిచింది, ఒక పక్షం ఓడింది అన్నట్లుగాక ఉభయులు లబ్దిపొందేందుకు అంగీకరించారు. అయితే గత చరిత్ర, అనుభవాన్ని బట్టి అమెరికా దీనికి కట్టుబడి ఉంటుందా అన్న ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. అమెరికాకు అగ్రస్థానం అన్న ట్రంప్ లక్ష్యం నెరవేరాలంటే ప్రపంచాధిపత్యం కోసం ప్రయత్నించకుండా సాధ్యం కాదు. దానిలో భాగంగా అన్ని దేశాల మీద పన్నుల కొరడా ఝళిపిస్తానంటూ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మీరిచ్చే ‘మర్యాద’కు ప్రతిగా మేము కూడా చేస్తామని చైనా హెచ్చరించటంతో అమెరికా వెనకడుగువేయాల్సి వచ్చింది. అది వ్యూహాత్మకమా, దానికి శక్తిలేకనా అన్నది ముందు ముందు తెలుస్తుంది. ఒక ఏడాది కాలంలో ఉభయదేశాల నేతలు ఇప్పటికే పరస్పర పర్యటనలు చేశారు.నవంబరు నెలలో చైనాలో జరిగే 21దేశాల ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార(ఎపెక్) సమావేశానికి ట్రంప్, డిసెంబరు మాసంలో అమెరికా ఆతిధ్యంతో జరిగే జి 20 సభకు షీ జిన్‌పింగ్ హాజరుకావాలని నిర్ణయించారు. అణ్వాయుధాలను సమకూర్చుకోబోమన్న అంగీకారాన్ని ఇరాన్ అమలు చేయాలని ఇద్దరు నేతలూ ఆకాంక్షించారు. హార్ముజ్ జలసంధి అంతర్జా తీయ జలాల్లో ఏ దేశమూ లేదా సంస్థ కూడా నౌకల రాకపోకల పన్ను వసూలు చేయకూడదని కూడా ఏకీభావం వెల్లడించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా, అమెరికా రెండూ మిత్రదేశాలుగా విజయం కోసం పోరాడిన అంశాన్ని గుర్తు చేసుకొని “టోక్యో విచారణ”కు ఎనభై సంవత్సరాలు నిండుతున్నాయని, భద్రతా మండలి శాశ్వత సభ్య రాజ్యాలుగా ఉన్న చైనా, అమెరికా ఈ యుద్ధం తరువాత నెలకొన్న ప్రపంచ వ్యవస్థకు ఇరుదేశాలూ కట్టుబడి ఉండాలని, మరోసారి సైనికవాదం తలెత్తకుండా చూడాలని అభిప్రాయ పడ్డారు. (జపాన్ రాజ్యాంగాన్ని మార్చు కొని ఆత్మరక్షణ దళాల స్థానంలో పూర్తి స్థాయి మిలిటరీని సమకూర్చుకోవాలని చూస్తున్న సంగతి, అది అమెరికా మిత్రదేశంగా ఉన్న అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అవసరం) వాణిజ్య విషయానికి వస్తే ఉభయ దేశాల బృందాల చర్చలలో ముందుకు వచ్చిన వాణిజ్య మండలి, 30 బిలియన్ డాలర్ల వంతున ఇరుదేశాలూ పన్నుల తగ్గింపు అమలుకు పూనుకోవాలని కూడా ట్రంప్-షీ అంగీకరించారు. కృత్రిమ మేథ(ఏఐ) సంబంధిత ముప్పు-లాభాల గురించి అభిప్రాయ మార్పిడికి ఒక యంత్రాంగాన్ని నవంబరు నాటికి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. రెండు పెద్ద దేశాల మధ్య సయోధ్య అది తాత్కాలికమా, శాశ్వతమా అన్న అంశాన్ని పక్కన పెడితే ఎంతకాలం కొనసాగితే అంతకాలం అనేక దేశాలకు పరోక్షంగా ఎంతో ఉపయోగం. ఇరుదేశాల నేతల మధ్య వాషింగ్టన్‌లో జరిగిన చర్చలలో ఇరాన్-అమెరికా చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని జిన్‌పింగ్ ఆకాంక్షించారు.

అయితే ఇరాన్ మీద వత్తిడి తేవాలని కోరిన ట్రంప్‌కు నిరాశే ఎదురైందని వారి భేటీ తరువాత వెలువడిన విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రస్తుత వివాదం మరింత విస్తరించకుండా ఉండాలని ఈజిప్టుతో సహా మధ్య ప్రాచ్యదేశాలే కాదు, ఐరోపా కూడా కోరుకుంటున్నది. అమెరికా గనుక తమ విషయంలో తెగేదాకా లాగితే హార్ముజ్ జలసంధితో పాటు ఎర్ర సముద్రం-అరేబియా సముద్రాలను కలిపే బాబ్ ఎల్ మండాబ్‌ను కూడా స్తంభింప చేస్తామని ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదే గనుక జరిగితే మధ్యధరా-ఎర్ర సముద్రాలను కలిపే సూయజ్ కాలువ ద్వారా జరిగే నౌకా రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది.తద్వారా ఎగుమతి దిగుమతులకు ఇబ్బందేగాక ఈజిప్టు ఆదాయానికి గండిపడుతుంది.“ పెత్తందారీ భాష సమస్యలను పరిష్కరించదు, ఏమీ చేయకుండా నిరంతర భద్రత నిలవదు” అని షీ స్పష్టంగా చెప్పాడు. అది ఇరాన్, మధ్య ప్రాచ్యం గురించే అన్నది తెలియనంత అమాయకుడు కాదు ట్రంప్. ఆఫ్రికా ఖండంలో చైనా, రష్యా పలుకుబడి పెరగ కుండా అమెరికా తన మిలిటరీని పటిష్టపరుస్తున్నది. అందుకు ప్రతిగా బీజింగ్, మాస్కో పని చేస్తున్నాయి. షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన పర్యవసానాలు ఐరోపా మీద కూడా పడే అవకాశం ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం కావటంలో ఐరోపా ఇస్తున్న ప్రాధాన్యత చైనా-అమెరికాలకు లేదు. మధ్యంతర ఎన్నికలకు ముందు వాణిజ్య వ్యవహారాల్లో చైనా మనస్సు కరగాలని అమెరికా కోరుకుంటున్నది.మరోవైపు ఐరోపా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

రోజుకు ఒక బిలియన్ యూరోల వాణిజ్య లోటు చైనాతో పెరుగుతున్నదని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్ చెప్పిన అంశం తెలిసిందే. తమ వాణిజ్యలోటును తగ్గించుకొనేందుకు అమెరికాతో కలసి పని చేయాలని ఐరోపా కోరుకుంటున్న ప్పటికీ అమెరికా తన సంగతి తాను చూసుకుంటున్నది. ఈ స్థితిలో తాము ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయాన్ని వెల్లడిస్తున్నప్పటికీ దానికా శక్తి లేదని తేలిపోయింది. ఇరాన్‌పై నిరంతర దాడులతో అమెరికా వద్ద ఆయుధాలు నిండుకుం టున్నాయనే వార్తలు ఐరోపాకు ఆందోళన కలిగిస్తున్నాయి. తన అనుయాయులకు భద్రత కల్పిస్తామన్న అమెరికా మాటల మీద అనేక దేశాలకు అనుమానాలు కలుగుతున్నాయి.చైనా-అమెరికా వాణిజ్య విషయంలో ఘర్షణ పడతాయని దాంతో చైనాలో ఉన్న అనేక పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు మన దేశానికి బారులు తీరుతాయని అనేక మంది కరోనా తరువాత కథనాలు ప్రచురించారు. అదేమీ జరగలేదు. పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడిన అంశం చైనీయులకు-అమెరికన్లకు తెలుసు అందువలన సాధ్యమైనంత కాలం రాజీపడతారు తప్ప ఘర్షణకు దిగి నష్టపోయేందుకు సి‌ద్ధం కాదని మనదేశంలో భ్రమలు పెట్టుకున్నవారు గ్రహించాలి. తైవాన్ సమస్యపై వాషింగ్టన్ నిరంతరం బీజింగ్‌ను ఒకవైపు రెచ్చగొడుతూనే మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నది. మే నెలలో ట్రంప్ చైనా పర్యటన తరువాత తైవాన్ తమకు తొమ్మిదిన్నరవేల మైళ్ల దూరంలో ఉంది అని వ్యాఖ్యానించాడు. అంతదూరం ప్రయాణించి మిలిటరీ జోక్యం చేసుకోవటం సాధ్యం కాదన్న భావం దానిలో ధ్వనించింది.

ఇదేసమయంలో తైవాన్‌కు ఆయుధాల సరఫరా చైనాతో బేరసారాలకు తురుపుముక్క అని కూడా చెప్పాడు. ఇటీవలనే 14 బిలియన్ డాలర్ల ఆయుధాలను అందచేసేందుకు అమెరికా ముందుకు వచ్చింది. అయితే షీ ఎన్నడూ తైవాన్ విషయంలో రాజీ వైఖరిని ప్రదర్శించలేదు. చైనాతో ఎలా వ్యవహరించాలన్న అంశంలో అమెరికాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ట్రంప్ తొలిసారి అధికారానికి వచ్చినపుడు బీజింగ్ తమకు వ్యూహాత్మక పోటీదారు అని ప్రకటించాడు.అదొక జనాలకు అంతుబట్టని బ్రహ్మ పదార్ధంగా ఉంది. ఇటీవలి వైఖరిని చూస్తే ఉభయ దేశాల సంబంధాలు జి 2(రెండు దేశాల బృందం)గా ఉండేందుకు సిద్ధమన్న సంకేతాలు ఉన్నాయి. దానికనుగుణంగానే షీ జిన్‌పింగ్ స్పందన ఉంది. “పోటీలో ఉన్నామని చెప్పుకొనేందుకు మినహాయింపులు అవసరం లేదు, కానీ మన పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి, అది హద్దుల్లోనే ఉండాలి. ఒకరిని మరొకరు అందుకొనే పరుగు పోటీలా ఉండాలి తప్ప ఎవరో ఒకరు గెలవాలి లేదా ఓడిపోవాలన్న కుస్తీలా ఉండకూడదు” అన్నాడు. వాషింగ్టన్ భేటీని చూసినపుడు చైనా పోటీదారు కాదు, సమానమైనది అని అంగీకరించేందుకు సి‌ద్ధం అన్నట్లుగా అమెరికా వైఖరి ఉందన్నది కొందరి విశ్లేషణ. ప్రచ్చన్న యుద్ద సమయంలో అమెరికా-ఐరోపాల మధ్య ఉన్న సంబంధాల కారణంగా సోవియట్‌కు వ్యతిరేకంగా పోరాడాలనే వైఖరిని జనంలో కలిగించటంలో అమెరికా సఫలమైంది.

కానీ చైనా విషయంలో అది సాధ్యం కావటం లేదు. గత నాలుగున్నర దశాబ్దాలుగా చైనా వస్తువులు ప్రవేశించని ఐరోపా మార్కెట్ లేదు, అమెరికా సరేసరి. చైనా తమ సైద్ధాంతిక శత్రువుగా ఆ దేశాల వారు చూడటం లేదు. గతంలో రష్యన్లను శత్రువులుగా, బుర్రలేని వారిగా చిత్రించిన హాలీవుడ్ సినిమాలు పుంఖాను పుంఖాలుగా వచ్చినట్లు ఇప్పుడు చైనీయుల మీద తీసే సాహసం చేయటం లేదు. అలా తీస్తే 140 కోట్ల చైనా మార్కెట్‌ను అవి కోల్పోయినట్లే. అమెరికా రాజకీయ నేతలు కూడా పోటీ గురించి మాట్లాడుతున్నారు తప్ప గతంలో సోవియట్‌ను వర్ణించినట్లు చైనా మన శత్రువని స్వంత జనానికి చెప్పటం లేదు. సోవియట్ ప్రభావాన్ని అదుపు చేయాలన్నట్లు చైనా విషయంలో ఏ నాయకుడు కూడా సిద్దాంతాలను ముందుకు తేలేదు. ఒక స్నేహితుడిగా ఉండటం ఒక గౌరవంగా పరిగణిస్తానని ట్రంప్ చెప్పాడు. అమెరికా ప్రారంభించిన వాణిజ్య పోరులో మొత్తం మీద విజేత చైనా, నష్టపోయింది అమెరికా.

గతేడాది ఫిబ్రవరి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య అమెరికన్లు ఏ అంశం మీద స్పందిస్తున్నారో తెలుసు కొనేందుకు పూ పరిశోధనా సంస్థ చేసిన సర్వేలో పన్నెండు నెలల కాలంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు తట్టుకోలేక పోతున్నామని చెప్పిన వారు 67 నుంచి 73శాతానికి, ద్రవ్యోల్బణంపై 63 నుంచి 66కు, ఫెడరల్ బడ్జెట్‌లోటుపై 57 నుంచి 64, నిరుద్యోగంపై 25 నుంచి 36 శాతానికి పెరిగారు. ఈ నేపథ్యంలో చైనా మీద జబ్బచరి చేందుకు, దెబ్బతీస్తానని, విజయం సాధిస్తామని చెప్పేందుకు ఏ నేత అయినా సాహసించగలడా! పెట్టుబడిదారీ విధానాన్ని ఎలాగైనా నిలబెట్టాలని చూస్తున్నది అమెరికా పాలకవర్గం. సోషలిజాన్ని నిర్మించేందుకు కంకణం కట్టుకున్నది చైనా కమ్యూనిస్టు పార్టీ. రెండు విరుద్దశక్తులు ఘర్షణ పడాలి కదా? ఎందుకు అలా జరగటం లేదన్నది కొందరి ప్రశ్న. పెట్టుబడిదారీ వర్గం వందల సంవత్సరాల అనుభవంతో మౌలిక స్వభావాన్ని అట్టేపెట్టుకొని అనేక ఎత్తుగడలను అనుసరిస్తున్నది. ఆ వర్గం స్థానంలో దోపిడీ లేని శ్రామికవర్గ వ్యవస్థ కోసం పోరాడుతున్న శక్తులు కూడా అదే విధంగా వ్యవహరించకూడదు?


ఎం కోటేశ్వరరావు 8331013288

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్