Magazines

స్వాగతం ఘనం.. సాధించింది ఏమిటి?

53 నిమిషాల క్రితం

A grand welcome... but what has been achieved?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం



ట్రంప్‌, జిన్‌పింగ్‌ చర్చల్లో కానరాని పురోగతి

వాషింగ్టన్‌ : అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య గురువారం శ్వేతసౌధంలో జరిగిన శిఖరాగ్ర సమావేశం ద్వైపాక్షిక సంబంధాలలో ఎలాంటి పురోగతిని ఇవ్వలేకపోయింది. జిన్‌పింగ్‌ను ట్రంప్‌ స్వయంగా ఆహ్వానించి రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలికినప్పటికీ వారి మధ్య జరిగిన చర్చల్లో ఏఐ, వాణిజ్యం, తైవాన్‌, ఇరాన్‌ యుద్ధం వంటి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం లభించిన దాఖలాలు కన్పించలేదు. తమ మధ్య లోతైన చర్చలు జరిగాయని, ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించే అనేక అంశాలపై అవగాహనకు వచ్చామని జిన్‌పింగ్‌ చెప్పారు. అమెరికా, చైనాలు బాధ్యతాయుతమైన ప్రధాన దేశాలుగా వ్యవహరించాలని, ఒక దానితో ఒకటి కలసిమెలసి ఉండేందుకు ఓ నూతన విధానం అవసరమని అన్నారు. 'తైవాన్‌ స్వాతంత్య్రం' అనే అంశాన్ని విడనాడాలని అమెరికాను జిన్‌పింగ్‌ కోరారని చైనా అధికార వార్తా సంస్థ సిన్హువా తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న అత్యంత క్లిష్టమైన సమస్యలలో తైవాన్‌ ఒకటనే విషయం తెలిసిందే. కాగా చర్చలపై అమెరికా అధ్యక్షభవనం ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

పెద్దగా ఆశించలేమన్న విశ్లేషకులు

ఏఐ రంగంలో రెండు అగ్ర రాజ్యాల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా ఒప్పందాలకు మించి ఏదో జరుగుతుందని ఆశించలేమని విశ్లేషకులు తెలిపారు. అమెరికా డిమాండ్లకు తలవంచే విధంగా ఇరాన్‌పై ఒత్తిడి తేవడానికి బీజింగ్‌ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలేవీ అందలేదు. అమెరికా, ఇరాన్‌ దేశాలు కాల్పుల విరమణను పాటించి, శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారని సిన్హువా తెలియజేసింది. జిన్‌పింగ్‌ గౌరవార్థం అమెరికా అధ్యక్షభవనం ఇచ్చిన విందుకు ప్రముఖ కంపెనీల అధినేతలు హాజరైనప్పటికీ...అమెరికా టెక్నాలజీపై తన కఠినమైన ఎగుమతి నియంత్రణలను కొనసాగించడానికే ట్రంప్‌ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. నియంత్రణలను సడలించాలని చైనా చాలా కాలంగా కోరుతోంది.

వాణిజ్య ఒప్పందాన్ని పొడిగించినా...

కాగా ట్రంప్‌, జిన్‌పింగ్‌ చర్చలలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాణిజ్య ఒప్పందాన్ని రెండు నెలల పాటు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే సుంకాలు, చైనా కొనుగోళ్లు, రేర్‌ ఎర్త్‌ సరఫరాలు, సాంకేతిక ఆంక్షలు వంటి సంక్లిష్టమైన అంశాలను తదుపరి చర్చలకు వదిలేశారు. ఇక 'తైవాన్‌ స్వాతంత్య్రం'పై ఇరు దేశాల మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. కృత్రిమ మేధ (ఏఐ)పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

ఎవరేమన్నారు ?

జిన్‌పింగ్‌ అమెరికా చేరుకున్న తర్వాత చేసిన వ్యాఖ్యల్లో విధానపరమైన విభేదాలను ట్రంప్‌ ప్రస్తావించలేదు. జిన్‌పింగ్‌తో తనకు గొప్ప స్నేహం ఉన్నదని చెప్పారు. మేలో తాను చైనాలో పర్యటించిన తర్వాత ఇరు దేశాలు వాణిజ్యంలో పురోగతి సాధించాయని అన్నారు. కాగా జిన్‌పింగ్‌ మరింత సూటిగా మాట్లాడుతూ ఇరు దేశాల ప్రయోజనాలు లోతుగా ముడిపడి ఉన్నాయని, వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చెప్పారు. చైనాలో అమెరికా కంపెనీలకు స్వాగతం చెబుతున్నామని గుర్తు చేస్తూ ఇక్కడ కూడా తమ కంపెనీలకు అలాంటి ఆదరణే లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల సైనిక దళాలు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుకుంటే ఉద్రిక్తతలు సడలుతాయని అన్నారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్