మూడోరౌండ్లో డిఫెండింగ్ చాంపియన్
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
యుఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్లు దూసుకుపోతున్నారు. మెన్స్ సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాస్, మహిళల సింగిల్స్‌లో అరినా సబలెంక అలవోక విజయాలతో మూడో రౌండ్‌కు చేరుకున్నారు. స్టెఫానోస్ సిట్సిపాస్, టామీ పాల్, అలెగ్జాండర్ బబ్లిక్ సైతం రెండో రౌండ్లో మెరుపు విజయాలు నమోదు చేసి ముందంజ వేశారు. యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మిక్సడ్ డబుల్స్ పోటీలు ఇప్పటికే ముగియగా.. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ పోటీలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. మెన్స్ డబుల్స్‌లో భారత్ నుంచి యూకీ బాంబ్రి, శ్రీరామ్ బాలాజీలు బరిలోకి దిగుతున్నారు.
న్యూయార్క్ (యుఎస్‌ఏ)
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్ చాంపియన్ , రెండో సీడ్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) ముందంజ వేశాడు. వరుసగా రెండో విజయం నమోదు చేసి పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన రెండో. రౌండ్ మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాస్ ఓ సెట్ కోల్పోయినా.. పోర్చుగల్ ఆటగాడు జెమీ ఫరియాపై విజయం సాధించాడు. 4-6తో తొలి సెట్లో కంగుతిన్న అల్కరాస్.. తర్వాతి మూడు సెట్లను 6-0, 6-3, 6-2తో అలవోకగా నెగ్గాడు. 3 ఏస్‌లు, నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేసిన అల్కరాస్.. ఏడు బ్రేక్ పాయింట్లు సాధించాడు. పాయింట్ల పరంగా 125-86తో జెమీపై పైచేయి సాధించాడు. ఐదు ఏస్‌లు, రెండు బ్రేక్ పాయింట్లతో మెరిసిన జేమీ ఫరియా.. తొలి సెట్ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేదు. 11 డబుల్ ఫాల్ట్స్ చేసిన జెమీ ఫరియా డిఫెండింగ్ చాంపియన్ ముందు తలొగ్గాడు. 20వ సీడ్ అమెరికా ఆటగాడు టామీ పాల్ సైతం మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. సెర్బియా ఆటగాడు డినో ప్రిజ్మిక్‌పై 6-2, 6-3, 5-7, 6-4తో టామీ పాల్ నాలుగు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందాడు. 9 ఏస్‌లు, ఏడు బ్రేక్ పాయింట్లతో మెరిసిన టామీ పాల్.. పాయింట్ల పరంగా 126-108తో, గేముల పరంగా 23-16తో స్పష్టమైన పైచేయి సాధించాడు. అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్తాన్) రెండో రౌండ్లో 6-3, 6-1, 6-1తో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఫ్రాన్స్ ఆటగాడు అడ్రియన్ మనారినో మూడు సెట్లలోనూ ఆశించిన ప్రతిఘటన చూపించలేదు.
ఆరు బ్రేక్ పాయింట్లతో చెలరేగిన అలెగ్జాండర్ బబ్లిక్ పాయింట్ల పరంగా 82-44తో ఆధిపత్యం చెలాయించాడు. గ్రీసు ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్ రెండో రౌండ్లో గెలుపొంది మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు లాయిడ్ హ్యారీస్‌పై 6-7(1-7), 6-3, 7-6(7-4), 6-4తో సిట్సిపాస్ పోరాడి గెలుపొందాడు. సిట్సిపాస్ 15 ఏస్‌లు సంధించగా, లాయిస్ 13 ఏస్‌లు కొట్టాడు. లాయిడ్ 2 రెండు బ్రేక్ పాయింట్లతో ఇరకాటంలో పడేయగా.. సిట్సిపాస్ ఐదు బ్రేక్ పాయింట్లతో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. పాయింట్ల పరంగా 152-142తో పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగింది. సిట్సిపాస్ 19 గేమ్‌లు గెల్చుకోగా.. లాయిడ్ 17 గేమ్‌లతో సరిపెట్టుకున్నాడు. ఓ టైబ్రేకర్‌లో లాయిడ్ పైచేయి సాధించగా, మరో టైబ్రేకర్‌లో సిట్సిపాస్ గెలుపొందాడు. చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరి లెహెక 6-4, 6-2, 6-4తో ఆస్ర్టేలియా ఆటగాడు టోబీ శామ్యూల్‌పై గెలుపొందగా, మార్టిన్ బెరాటిని (ఇటలీ)పై 3-6, 6-3, 6-4, 7-6(7-4)తో మరియానో నవొనె (అర్జెంటీనా) విజయం సాధించాడు. 11వ సీడ్ అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫో 6-3, 7-6(7-2), 7-5తో జపాన్ ఆటాడు షకమోటోపై గెలుపొంది మూడో రౌండ్లో ప్రవేశించాడు.
సబలెంక జోరు
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టైటిల్ ఫేవరేట్ అరినా సబలెంకా (బెలారస్) మూడో రౌండ్‌కు చేరుకుంది.
రష్యా అమ్మాయి పొలినాపై 6-1, 6-1తో వరుస సెట్లలో సబలెంకా అలవోక విజయం సాధించింది. 3 ఏస్‌లు, ఆరు బ్రేక్ పాయింట్లతో సబలెంకా అదరగొట్టింది. పాయింట్ల పరంగా 56-26తో ఏకపక్ష విజయం నమోదు చేసింది. పొలినా రెండు గేములే నెగ్గగా.. సబలెంకా 12 గేమ్‌లతో తనదైన జోరు చూపించింది. ఏడో సీడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరొలినా ముచోవా సైతం మూడో రౌండ్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో బ్రిటన్ క్రీడాకారిణి కేటీ బౌల్టర్‌పై 6-1, 6-0తో ముచోవా ఏకపక్ష విజయం సాధించింది. 2ఏస్‌లు, ఏడు బ్రేక్ పాయింట్లతో ముచోవా చెలరేగింది. తొమ్మిదో సీడ్ ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలినా స్విటోలినా 6-2, 6-7(6-8), 6-4తో ఆస్ట్రేలియా ప్లేయర్ మాయా జాయింట్‌పై మూడు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందింది. ఎలినా స్విటోలినా 8 బ్రేక్ పాయింట్లతో పైచేయి సాధించగా, మాయా ఐదు బ్రేక్ పాయింట్లతో గట్టి పోటీ ఇచ్చింది.
బరిలో మనోళ్లు
యుఎస్ ఓపెన్ మహిళల, పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రాతినిథ్యం లేదు. కానీ పురుషుల డబుల్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. శ్రీరామ్ బాలాజీ, యూకీ బాంబ్రిలు టైటిల్ వేటలో నిలిచారు. అమెరికా ఆటగాడు ఎవాన్ కింగ్‌తో కలిసి శ్రీరామ్ బాలాజీ బరిలోకి దిగుతుండగా, మైకల్ వీనస్ (ఆస్ట్రేలియా)తో కలిసి యూకీ బాంబ్రి పోటీపడుతున్నాడు. పురుషుల డబుల్స్ పోటీలు శుక్రవారం నుంచి ఆరంభం కానున్నాయి. మహిళల డబుల్స్‌లో భారత్ నుంచి ఎవరూ పోటీలో లేరు.






కామెంట్‌లు (0)