రూ.7.41 లక్షల కోట్లు ఫట్
సెన్సెక్స్ 1,124 పాయింట్లు క్షీణత
ఆరు నెలల కనిష్ఠానికి పతనం
వెంటాడిన పశ్చిమాసియా సెగ..
ముంబయి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో పశ్చిమాసియాలో రగులుతున్న ఘర్షణలు భారత మార్కెట్లను బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. వరుస అమ్మకాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయి. సోమవారం అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,124 పాయింట్లు లేదా 1.52 శాతం నష్టంతో 72,772కు పరిమితమయ్యింది. ఇంట్రాడేలో 1,180 పాయింట్లు కోల్పోయి 72,716 కనిష్టాన్ని చవి చూసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 360 పాయింట్లు లేదా 1.56 శాతం పతనమై 22,780కు దిగజారింది. 2026 మార్చి 30 తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలకు ఇది అత్యల్ప ముగింపు. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో ఇన్ఫోసిస్ 0.20 శాతం లాభపడగా.. మిగితా 29 నష్టాల్లో ముగిశాయి. ఎల్‌అండ్‌టి, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పడిపోయాయి.మార్కెట్ పతనంతో బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం నాటి రూ.481.88 లక్షల కోట్ల నుంచి రూ.474.47 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ఒక్కరోజులోనే మదుపర్ల సంపద రూ.7.41 లక్షల కోట్లు హరించుకుపోయింది. అన్ని రంగాల సూచీలు నేల చూపులు చూశాయి.
రూ.17 లక్షల కోట్లు ఆవిరి..
ఆగస్టు 27 నుంచి మదుపరుల సంపదలో మొత్తం రూ.17.17 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు బోరుమంటున్నారు. శుక్రవారం విదేశీ సంస్థాగత మదుపరులు రూ.3,693.93 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ.17,131 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐల మొత్తం అమ్మకాలు రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి.
వీడని చమురు భయాలు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదరడం, ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించడం, ఇజ్రాయిల్-అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రం కావడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలపై ఆందోళనలతో బ్రెంట్ చమురు 2.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 106.6 డాలర్లకు ఎగిసింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారత్‌కు అధిక చమురు ధరలు ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురైయ్యారు. అదే సమయంలో అమెరికా రెండేండ్ల బాండ్ రాబడులు 4.90 శాతానికి, పదేళ్ల రాబడులు 5.20 శాతానికి చేరడం వర్థమాన మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది.
బ్లాక్ మండే
44 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)