Magazines

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆహార ధరలు

49 నిమిషాల క్రితం

Rising food prices worldwide
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రకటించిన ఎఫ్‌ఎఓ
రోమ్‌ : ఈ ఏడాది సెప్టెంబరులో అంతర్జాతీయం గా ఆహార ధరలు నాలుగేండ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్‌‌కు అంతరాయాలు, అలాగే ఆందోళనకరమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ పెరుగుదల చోటు చేసుకుందని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) శుక్రవారం తెలిపింది. ఆగస్టులో సవరించిన మేరకు 134 పాయింట్లు నుండి ఎఫ్‌ఎఓ ఆహార ధరల సూచీ సెప్టెంబరులో సగటున 136 పాయింట్లకు పెరిగింది. 2022 నవంబరు నుండి చూసినట్లైతే అత్యధిక స్థాయికి చేరుకుంది. తృణధాన్యాలు, చక్కెర, వంటనూనెల ధరలకు సంబంధించి ఎఫ్‌ఎఓ సూచీలన్నీ గత నెల్లోనే పెరిగాయి. మాంసం, పాల ఉత్పత్తుల ధరలు మాత్రం క్షీణించాయి. హర్మూజ్‌ ‌జలసంధిలో, నల్ల సముద్రంలో రవాణా అంతరాయాలు, దీనికి తోడు వాతావరణ ఉపద్రవాలు ఇవన్నీ కలిసి ఇంధనం, రవాణా, కీలక ఆహార పదార్ధాలపై ఒత్తిడిని పెంచుతున్నాయని ఎఫ్‌ఎఓ ముఖ్య ఆర్థిక వేత్త మాక్సిమో టోరెరొ తెలిపారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అంతిమంగా ఇటువంటి ఒత్తిళ్ళు వినియోగదారుల ఆహార ధరలకు పాకుతాయని అన్నారు. ముఖ్యంగా ఆహారం, ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాల్లో ఈ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. తీవ్ర స్థాయిలో నెలకొన్న ఎల్‌‌నినో ప్రభావాలపై ఆందోళనలతో అంతర్జాతీయంగా చక్కెర ధరలు 18మాసాల గరిష్టానికి ఎగబాకాయి. అలాగే నల్ల సముద్రంలో వాణిజ్య అంతరాయాలతో సెప్టెంబరు తొలినాళ్ళలోనే గోధుమల ధరలు మూడేళ్ళ గరిష్టానికి పెరిగిపోయాయని ఎఫ్‌ఎఓ పేర్కొంది. ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా తృణధాన్యాల ఉత్పత్తి 2.979 బిలియన్ల మెట్రిక్‌ ‌టన్నులు వుండొచ్చునని ఎఫ్‌ఎఓ అంచనా వేసింది. గత అంచనాలతో పోలిస్తే పెద్దగా మార్పేమీ లేదు కానీ 2025 నాటి స్థాయి కన్నా 2.1శాతం తక్కువగా వుంది. అయినప్పటికీ ఈ ఉత్పత్తి రెండో అత్యధిక రికార్డుగానే కొనసాగనుంది. నల్ల సముద్రంలో నౌకల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో గోధుమలు, జొన్న ఎగుమతులు తక్కువగానే వుండొచ్చునని భావిస్తూ, 2026-27 సంవత్సరానికి జరిగే అంతర్జాతీయ తృణ ధాన్యాల వాణిజ్యాన్ని సెప్టెంబరు నుండి 0.7శాతం మేరా ఎఫ్‌ఎఓ కుదించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్