Magazines

ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన ‘మరసం’

42 నిమిషాల క్రితం

‘Marasam’ stood firm against pressures.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

40 ఏండ్ల ప్రస్థానం కవుల నిబద్ధత, నిజాయితీకి నిదర్శనం
తగ్గిపోతున్న పుస్తక పఠనం.. పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, తల్లిదండ్రులదే.. : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
​ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని 40 ఏండ్ల పాటు మంజీరా రచయితల సంఘం (మరసం) నిలబడిందంటే అందులోని కవుల నిబద్ధత, నిజాయితీయే కారణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మంజీరా రచయితల సంఘం 40 వసంతాల మహాసభలో మాట్లాడారు. మరసం‌తో తనకు రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని చెప్పారు. ప్రభుత్వాల ఒత్తిళ్లు, బెదిరింపులు, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు వచ్చినా సంస్థ తన ప్రస్థానాన్ని కొనసాగించిందన్నారు. మరసం కేవలం పుస్తకాలు, కవిత్వానికే పరిమితం కాకుండా 1992 మద్యపాన నిషేధ ఉద్యమం, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, గుట్కా నిషేధం వంటి అనేక ప్రజా, సామాజిక సమస్యలపై పోరాడిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో తెలంగాణ కవులు, మేధావులపై ఉన్న చిన్నచూపుకు నందిని సిధారెడ్డి తెలంగాణ రచయితల వేదిక ద్వారా గట్టి సమాధానం చెప్పారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సాహిత్య అకాడమీకి చైర్మెన్‌ను నియమించలేదని విమర్శించారు. నేటి డిజిటల్ యుగంలో ఉయ్యాలలో ఊగాల్సిన పిల్లలు ఫోన్లలో ఊగుతున్నారని, చందమామను చూపిస్తూ అన్నం తినిపించే రోజులు పోయి, సెల్ ఫోన్ చూపిస్తూ తినిపించే పరిస్థితి వచ్చిందని హరీశ్‌‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పుస్తక పఠనం బాగా తగ్గిపోతోందని, అమెరికా లాంటి దేశా ల్లో ఇప్పటికీ చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రయా ణాల్లో పుస్తకాలు చదువుతారని తెలిపారు. మన దగ్గర పుస్తక పఠనాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, తల్లిదండ్రులపై ఉందన్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా కవితలు, పుస్తకాలు రూపొందించే పరిస్థితి వచ్చినా, కవి తన అనుభవంతో హృదయం నుంచి రాసే సాహిత్యంలోని సజీవత్వం, నిజాయితీకి ప్రత్యామ్నా యం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రజా పోరాటాల చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించడం లో పుస్తకాలు కీలకమని, సమాజంలోని అణచివేతపై పోరాడేందుకు కవిత, పాట ఆయుధాలుగా నిలుస్తా యని తెలిపారు. అలాంటి సాహిత్యాన్ని, కవులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మరసం అధ్యక్షులు కె.రంగాచారి అధ్యక్షతన జరిగిన సభలో నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, దేవీప్రసాద్‌, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్‌ అలీ, నాళేశ్వరం శంకరం, కె.అంజయ్య, అలాజ్‌పూర్‌ కిషన్‌, ఎన్‌. భగవాన్‌రెడ్డి, జి.తిరుపతిరెడ్డి, తోట అశోక్‌ తదితర కవులు, రచయితలు పాల్గొన్నారు.తగ్గిపోతున్న పుస్తక పఠనం.. పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, తల్లిదండ్రులదే.. : మాజీ మంత్రి హరీశ్‌రావు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్