జిల్లా కేంద్రంలో "ఫాస్ట్ మార్చ్"
నవతెలంగాణ-ఆసిఫాబాద్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానమని జిల్లా ఎస్పీ నితిక పంత్ పునరుద్ఘాటించారు. అక్టోబర్ నెల రోజుల పాటు నిర్వహించే సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలో డి.ఎస్.పి అశోక్, స్థానిక సీఐ నీలం రవి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి "పాస్ట్ మార్చ్" నిర్వహించి, అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంక్ ఎకౌంటు వివరాలను ఎవరికి తెలియచేయకూడదని సూచించారు. ఫోన్ కు సంబంధించి లాక్ ఇతర వివరాల కోసం పాస్ వర్డ్ కఠినమైనది ఏర్పాటు చేసుకోవాలన్నారు.
దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట సైబర్ క్రైమ్ జరుగుతుందని దీనిని గుర్తించి నిందితులను పట్టుకోవడం కూడా పోలీసులకు కష్టతరంగా మారుతుందన్నారు. సైబర్ నేరం చేసేవారు ఒక్కొక్కసారి దేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉండి కూడా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. సులభమైన విధానంలో డబ్బు సంపాదించాలని ఆకాంక్షతో అనేకమంది ఇటువంటి మోసాలకు బాధితులుగా నిలుస్తున్నారని అన్నారు. తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తం సంపాదించడం అంటూ వచ్చే ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే 1930కు ఫోన్ చేయాలని, సంబంధిత బ్యాంకులు సప్రదించి వివరాలు తెలియజేయాలని అప్పుడు ఖాతాను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. చదువుకున్నవారే సైబర్ మోసాలకు ఎక్కువగా గురవుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ మోసాలను నివారించడానికి అప్రమత్తంగా ఉండడం మినహా వేరే దారి లేదన్నారు. ఫోన్ కు వచ్చే పాస్ వర్డ్లు ఎవరికి తెలియచేయకూడదన్నారు. నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ సీఐ రవీందర్, స్థానిక ఎస్సైలు మోహన్ ప్రసాద్, ఉల్లాస్, ఆర్ఎస్ఐ కిరణ్, ఏఎస్ఐ లు మెంగారావు, భోజ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)