Magazines

అశ్వారావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత

42 నిమిషాల క్రితం

khammam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

- ఏరియా ఆసుపత్రికి 48 పోస్టులు కు 20 మంది సిబ్బంది

- రెండు పీహెచ్‌సీ ల్లో రెగ్యులర్ ఎంబీబీఎస్ వైద్యులు లేరు

నవతెలంగాణ -  అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలంలోని మూడు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్ ఎంబీబీఎస్ వైద్యులు లేకపోవడం, పలు కీలక పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. మండలంలో అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రితో పాటు వినాయకపురం, గుమ్మడివల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి.

తాత్కాలిక భవనంలో ఏరియా ఆసుపత్రి:

అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కొనసాగుతోంది. నూతన భవన సముదాయం నిర్మాణంలో ఉంది. ఆసుపత్రికి మొత్తం 48 పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఐదుగురు ఎంబీబీఎస్ వైద్యులు సేవలందిస్తున్నారు. ఇద్దరు గైనకాలజిస్టులు తో పాటు అనెస్థటిస్ట్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎండీ వైద్యుడు, ఆర్థోపెడిక్ నిపుణుడు, శిశు వైద్యుడు (పెడియాట్రిషన్), రేడియాలజిస్టు ఒక్కొక్కరు విధులు నిర్వహిస్తున్నారు. నర్సింగ్ సిబ్బంది 10 మంది ఉన్నారు.

వినాయకపురం పీహెచ్‌సీలో ఆయుష్ వైద్యురాలతో సేవలు:

వినాయకపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ పోస్టు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎంబీబీఎస్ వైద్యుడికి బదులుగా ఆయుష్ వైద్యుడు సేవలందిస్తున్నారు. ఇక్కడి రెగ్యులర్ వైద్యుడు పదోన్నతిపై జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఈ కేంద్రంలో 11 మంది రెగ్యులర్ సిబ్బంది, ఎన్‌హెచ్‌ఎం, ఔట్‌సోర్సింగ్ కింద 14 మంది పనిచేస్తున్నారు. అయితే రెగ్యులర్ హెచ్‌ఈఓ, ఏఎన్‌ఎం, పీహెచ్‌ఎన్, పురుష ఆరోగ్య సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్‌లో మూడు రెండో ఏఎన్‌ఎం పోస్టులు కూడా భర్తీ కాలేదు. రోజుకు 80 మందికి పైగా ఓపీ నమోదవుతుండగా, టైఫాయిడ్, మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

గుమ్మడివల్లిలో డిప్యుటేషన్ వైద్యురాలితో నిర్వహణ:

గుమ్మడివల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా రెగ్యులర్ ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్ లేకపోవడంతో ఆర్‌బీఎస్‌కే పథకంలో పనిచేస్తున్న వైద్యురాలిని డిప్యుటేషన్‌పై నియమించారు.

ఈ కేంద్రంలో ఏడుగురు రెగ్యులర్ సిబ్బంది, ఇద్దరు రెండో ఏఎన్‌ఎంలు, ఇద్దరు కాంట్రాక్టు ఎస్‌ఎన్‌లు, ఇద్దరు ఎంఎల్‌హెచ్‌పీలు, ఒక యూడీసీ పనిచేస్తున్నారు. అయితే రెగ్యులర్ ఏఎన్‌ఎం, మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, పురుష, మహిళా ఆరోగ్య సూపర్‌వైజర్ పోస్టులతో పాటు రెండు రెండో ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కీలక పోస్టుల భర్తీపై ప్రజల ఆశ:

మండలంలోని రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్ ఎంబీబీఎస్ వైద్యులు లేకపోవడంతో పాటు పలు కీలక పోస్టులు ఖాళీగా ఉండటం వైద్య సేవలపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్