Magazines

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

43 నిమిషాల క్రితం

khammam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘నషా ముక్త యువ వికసిత్ భారత్’ కార్యక్రమం

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, ఆరోగ్య శాఖ సహకారంతో ‘నషా ముక్త యువ వికసిత్ భారత్’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి, ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అల్లు అనిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.


‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి విద్యార్థి తన ఆరోగ్యాన్ని కాపాడుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గుమ్మడివల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కె. నందిత మాట్లాడుతూ ఆరోగ్యం అంటే కేవలం రోగాలు లేకపోవడం మాత్రమే కాదని, శారీరక, మానసిక, సామాజిక పరంగా సంపూర్ణ శ్రేయస్సు కలిగి ఉండటమే నిజమైన ఆరోగ్యమని వివరించారు. ఆకుకూరలు, పాలు, పండ్లు వంటి పోషకాహారం తీసుకోవాలని, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం, యోగా లేదా ఆటలు ఆడాలని, గుట్కా, సిగరెట్, మద్యం వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడితే జీవితం దెబ్బతింటుందని హెచ్చరించారు.

ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డేగల నరసింహారావు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులని, మాదకద్రవ్యాల రహిత భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. తమ పరిసరాల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, అక్రమ రవాణా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ కౌన్సిలర్ ఎస్.కె. షాహేద, జిల్లా ఇంటర్మీడియట్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి అరవింద్ బాబు, వైద్య సిబ్బంది టి. మాధురి, పి. దుర్గా, పి. భాస్కర్, సునీత, వీరబాబు, వాణి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్