- హాజరు పెంపుదలకు వినూత్న కార్యాచరణ
- ఉపాద్యాయుల స్వంత వ్యయం తో నిర్వహణ
నవతెలంగాణ - అశ్వారావుపేట
విద్యార్థుల్లో పాఠశాల పట్ల ఆసక్తి పెంచడంతో పాటు హాజరు శాతాన్ని మెరుగుపర్చేందుకు అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
క్రమం తప్పకుండా హాజరైతే.. పుట్టినరోజు వేడుకలు
పుట్టినరోజుకు ముందు రెండు నెలల పాటు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల పుట్టినరోజును పాఠశాలలోని తోటి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయించి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థికి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో 8వ తరగతి విద్యార్థిని పి.మీనాక్షి పుట్టినరోజు వేడుకలను గురువారం పాఠశాలలో నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయించి మీనాక్షికి శుభాకాంక్షలు తెలిపారు.
హాజరుపై ప్రత్యేక దృష్టి
విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సాంఘిక శాస్త్రం బోధకుడు ఎం.వెంకటేశ్వర్లు ఈ ఆలోచనను ముందుకు తీసుకొచ్చారని ప్రధానోపాధ్యాయురాలు ఎస్.కె.సహీనాబేగం తెలిపారు. ఉపాధ్యాయుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో సానుకూల పోటీని పెంచుతూ, క్రమశిక్షణతో పాఠశాలకు హాజరయ్యేలా చేస్తున్న ఈ వినూత్న ఆలోచన ఇతర పాఠశాలలకు కూడా ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.






కామెంట్‌లు (0)