Magazines

ప్రగతిశీల ఉద్యమాలతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి

03 సెప్టెంబర్, 2026

development-of-southern-states-through-progressive-movements
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 04, 2026 | 4 నిమిషాల చదవడం

సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
హనుమకొండలో సారంపల్లి సంస్మరణ సభ
మల్లారెడ్డి పోరాట స్ఫూర్తిని కొనియాడిన వక్తలు

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
​ప్రగతిశీల పోరాటాలు, కమ్యూనిస్టు, సామాజిక ఉద్యమాల వల్లే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమైందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులదే కీలక పాత్ర అని గుర్తు చేశారు. హనుమకొండలోని పొద్దుటూరి గార్డెన్‌లో గురువారం సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి(ఎస్‌ఎం) సంస్మరణ సభ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాఘవులుతో పాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‌ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ బి. వినోద్‌‌కుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర నాయకులు టి. వెంకట్రాములు, బీజేపీ నేత, మాజీ మేయర్‌ ‌టి. రాజేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. సారంపల్లి మల్లారెడ్డి నిత్యం పఠనం చేసేవారని గుర్తు చేశారు. సమస్యలను అధ్యయనం చేసి పోరాటాలకు ప్రజలను చైతన్యవంతులను చేసేవారన్నారు. రైతాంగ సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్‌ రంగం, తెలంగాణ సాయుధ పోరాటంపై ఆయన ఎన్నో పుస్తకాలు రాశారని చెప్పారు. సమసమాజ స్థాపన కోసం ఎన్నో కీలకమైన ఉద్యమాల్లో సారంపల్లి తనవంతు పాత్ర పోషించారని తెలిపారు. ‘1956 నుంచి ఇప్పటి వరకు 70 ఏండ్లలో’ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులపై నల్లగొండలో నవంబర్‌లో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్‌ సభ మహాసభలో తనను మాట్లాడాలని కోరారని చెప్పారు. అయితే, సారంపల్లి మల్లారెడ్డి ఉన్నారన్న ధైర్యంతోనే మాట్లాడతానని చెప్పానని అన్నారు.

ఈ విషయం ఎస్‌ఎంకు చెప్పి దీనిపై సమాచారం కావాలని కోరితే ఇస్తానన్నారని, ఈలోపే ఆయన భౌతికంగా దూరమయ్యారని తెలిపారు. ఎస్‌ఎం మృతి పార్టీకి, రైతాంగానికి తీరని లోటని అన్నారు. జిజ్ఞాస, తపన ఉండే వ్యక్తికి మరణం లేదన్నారు. 1956లో సుందరయ్య ఉమ్మడి ఆంధ్రలో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను సందర్శించి నీటి వనరుల వినియోగంపై పుస్తకం రాశారన్నారు. దేవాదుల, వరద కాలువల గురించి పోరాడింది కమ్యూనిస్టులేనన్నారు. ఈరోజు కాళేశ్వరం, కూలేశ్వరం గురించి మాట్లాడుతున్నారన్నారు. అరకొర ప్రాజెక్టులైనా వచ్చాయంటే మల్లారెడ్డి లాంటి కమ్యూనిస్టులు పోరాటం చేయడం వల్లేనని తెలిపారు. ఫ్యూడలిజం, వెనుకబాటుతనం నుంచి తెలంగాణ బయటపడాలన్నారు. మల్లారెడ్డి పోలీసు పటేల్‌గా పనిచేసి కమ్యూనిస్టు పార్టీలో చేరారని గుర్తు చేశారు. సర్పంచ్‌గా పనిచేసి అఖిలభారత స్థాయిలో అనేక పోరాటాల్లో మమేకమయ్యారన్నారు. అలాంటి మల్లారెడ్డి ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని, ఆయన మృతికి పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ తరపున నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. ​డీలిమిటేషన్‌కు కేంద్రం యత్నం దేశంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ చేయడానికి ప్రయత్నిస్తోందని రాఘవులు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందాయంటే దానికి ఆయా రాష్ట్రాల్లో ప్రగతిశీల పోరాటాలు, కమ్యూనిస్టు, సామాజిక ఉద్యమాలుండటం వల్లే సాధ్యమైందన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల అభివృద్ధి సాధ్యం కాలేదన్నారు.

సమస్యలపై కొత్త తరం అధ్యయనం చేసి పోరాడాల్సిన అవసరముందని ఢిల్లీలో జరిగిన కాక్రోచ్‌ ఉద్యమాన్ని ప్రస్తావించారు. జల్‌, జమీన్‌, జంగిల్‌ నినాదం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉందని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూ సమస్యపై పోరాడింది కమ్యూనిస్టులేననీ, 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి, కౌలుదార్లకు రక్షణ కల్పించారని వివరించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయులమంతా ఒక్కటేనన్న భావనతో తెలంగాణ విముక్తికి కమ్యూనిస్టులు పోరాడా రన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కమ్యూనిస్టులను ఆ చరిత్ర నుంచి తొలగించ లేరన్నారు. మతకలహాలతో తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ​మా అందరి గురువు ఎస్‌ఎం : ఎస్‌.వీరయ్య రాష్ట్రం, కేంద్రంలో మా అందరి గురువు సారంపల్లి మల్లారెడ్డి అని, మేమంతా ఆయన శిష్యులమేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. నిత్యం పుస్తకాలు చదవడం, వ్యాసాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపడమే ఆయన విధిగా పెట్టుకున్నారన్నారు. రైతాంగ సమస్యలు, బడ్జెట్‌, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్‌ రంగ సమస్యలన్నింటిపైనా ఆయనకు అంత పట్టుందంటే ఎంత అంకితభావంతో అధ్యయనం చేసేవారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

సారంపల్లి మల్లారెడ్డి పోరాట స్ఫూర్తిని హాజరైన నేతలు కొనియాడారు. రైతుల కోసం, వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన రచనలు ఎంతోమందికి ఉపయోగపడ్డాయన్నారు. ​విప్లవ ఖని, సమాచార దిట్ట ఎస్‌ఎం : బి.వెంకట్‌ సారంపల్లి మల్లారెడ్డి విప్లవ ఘని, సమాచార దిట్ట అని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. మల్లారెడ్డి చూపిన మార్గంలో రైతాంగ, వ్యవసాయ కార్మిక ఉద్యమాలు, ఉపాధి హామీ చట్టంపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సంస్మరణ సభ ఆరంభానికి ముందు సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి హాజరైన వారంతా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, పోతినేని సుదర్శన్‌రావు, టి.సాగర్‌, రాష్ట్ర నేతలు ఉడుత రవీందర్‌, స్కైలాబ్‌బాబు, వరంగల్‌, సిద్దిపేట, జనగామ, ములుగు జిల్లాల కార్యదర్శులు సిహెచ్‌.రంగయ్య, ఆముదాల మల్లారెడ్డి, కనకారెడ్డి, బీరెడ్డి సాంబశివ, సీనియర్‌ నాయకులు జి.రాములు, సూడి కృష్ణారెడ్డి, సారంపల్లి వాసుదేవరెడ్డి, ప్రజా సంఘాల నేతలు ఎం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, రాగుల రమేష్‌, తిరుపతి, డాక్టర్‌ జిలకర శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు.

​చివరి వరకు ప్రజా ఉద్యమాల్లోనే : జాన్‌వెస్లీ

తెలంగాణ సాయుధ పోరాటం, సుందరయ్య స్ఫూర్తితో సారంపల్లి మల్లారెడ్డి చివరి వరకు ప్రజా ఉద్యమాల్లోనే కొనసాగారని, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. తీవ్ర నిర్బంధంలోనూ అజ్ఞాతంలో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. ఆయనుండే గది ఒక లైబ్రరీ అని, ఎవరు ఏ సమాచారం అడిగినా వెంటనే ఇచ్చేవారని గుర్తు చేశారు. దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని చెప్పారు. సోషలిస్టు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎస్‌ఎంకు మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్