Magazines

పీహెచ్‌డీల పెరుగుదల.. పరిశోధకులకు ఉద్యోగాల కొరత

46 నిమిషాల క్రితం

Rise in PhDs... Job shortage for researchers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 3 నిమిషాల చదవడం

దశాబ్దంలో దాదాపు 
మూడు రెట్లు పెరిగిన పీహెచ్‌డీ ప్రవేశాలు
పోస్ట్‌డాక్టోరల్ అవకాశాలు పరిమితం.. ఫ్యాకల్టీ నియామకాల్లో జాప్యం
పరిశోధనకు పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక వసతులపై పెరుగుతున్న ప్రశ్నలు

న్యూఢిల్లీ : భారత్‌లో పీహెచ్‌డీ విద్య వేగంగా విస్తరిస్తోంది. 2014-15లో దేశవ్యాప్తంగా పీహెచ్‌డీ కోర్సుల్లో సుమారు 1.17 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 3.44 లక్షలకు చేరింది. అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. అదే సమయంలో పీహెచ్‌డీలు పూర్తిచేసి డిగ్రీలు పొందిన వారి సంఖ్య కూడా 2014-15లో 21,830 నుంచి 2023-24లో 37,986కు పెరిగింది. అయితే పీహెచ్‌డీల సంఖ్య పెరగడం ఒక్కటే పరిశోధనా వ్యవస్థ బలోపేతానికి కొలమానం కాదని నిపుణులు చెప్తున్నారు.

ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నా.. ఉద్యోగం ఎప్పుడు? దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకుల కొరత కూడా మరో సమస్యగా ఉంది. ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ అవి వెంటనే భర్తీ కావడం లేదు. నియామక ప్రక్రియలో పరిపాలనాపరమైన జాప్యాలు, ఆర్థిక పరిమితులు తదితర కారణాలు ఇందుకు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. దీంతో ఒకవైపు పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా.. మరోవైపు విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టులు అలాగే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పరిశోధనకు మౌలిక వసతులు కూడా కీలకమే. నిటి ఆయోగ్‌ ప్రకారం.. భారత్‌లో పరిశోధకుల సంఖ్య అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే తక్కువగా ఉంది. పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం బలహీనంగా ఉండటం కూడా డాక్టరేట్‌ తర్వాత పరిశోధన రంగంలోకి ప్రవేశించే వారికి అడ్డంకిగా మారుతోంది.

మహిళల ప్రవేశాల్లోనూ భారీ పెరుగుదల
పీహెచ్‌డీ విద్యలో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది.2014-15లో సుమారు 47,700గా ఉన్న మహిళా పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్య 2023-24 నాటికి 1.71 లక్షలకు చేరింది. ఇది ఉన్నత విద్య లో మహిళల పరిశోధనా భాగ స్వామ్యం పెరుగుతున్నవిషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉద్యోగానికి అర్హత అనే పాత దృక్పథం మారాల్సిన అవసరం ఉందని నిపుణులు
పరిశోధనను ఉద్యోగంతో అనుసంధానించాలి
పీహెచ్‌డీ అంటే కేవలం అధ్యాపక ఉద్యోగానికి అర్హత అనే పాత దృక్పథం మారాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. డాక్టరేట్‌ ద్వారా కఠినమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం,పరిశోధనా నైపుణ్యం, కొత్త ఆలోచన లను అభివృద్ధి చేసే సామర్థ్యం పెరుగు తాయి. ఇవి విశ్వవిద్యాలయాలతో పాటు పరిశ్రమలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, సాంకేతిక రంగాల్లోనూ ఉపయోగపడతాయి. అందుకే పరిశ్రమ–విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ పీహెచ్‌డీలు, ఇండస్ట్రియల్ పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌లు, సంయుక్త పరిశోధనా ప్రయోగశాలలు వంటి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉంది. నిటి ఆయోగ్‌ కూడా పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌లను పెంచడం, పరిశోధకులకు స్పష్టమైన కెరీర్ మార్గాలు రూపొందించడం వంటి చర్యలను సూచించింది.

పీహెచ్‌డీలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఉన్నత విద్యాసంస్థల సంఖ్య పెరగడం, పరిశోధనకు ప్రాధాన్యం పెరగడం, ఫెలోషిప్‌ల లభ్యత, ఉద్యోగ అవకాశాల కొరత వంటి కారణాలు పీహెచ్‌డీ ప్రవేశాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా చిన్న, మధ్యస్థ నగరాల్లో మాస్టర్స్‌ తర్వాత మంచి ఉద్యోగాలు తక్కువగా ఉండటంతో.. ఫెలోషిప్ లభిస్తే పీహెచ్‌డీ కొనసాగించడం విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. మరో మార్పు కూడా ప్రభావం చూపింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 తర్వాత ఎంఫిల్‌ కోర్సును నిలిపి వేయడంతో మాస్టర్స్‌ తర్వాత అకడమిక్‌ రంగంలో కొనసాగాలనుకునే వారికి పీహెచ్‌డీ ప్రధాన మార్గంగా మారింది. దీంతో పీహెచ్‌డీ ప్రవేశాలు మరింత పెరిగాయి.

డిగ్రీ కాదు.. దాని తర్వాతి జీవితమే ముఖ్యం
పీహెచ్‌డీల సంఖ్య పెరగడం దేశ పరిశోధనా సామర్థ్యానికి ఒక ముఖ్యమైన సూచిక కావచ్చు. కానీ డాక్టరేట్‌ పొందిన వేలాది మంది యువ పరిశోధకులకు తర్వాత ఏం జరుగుతుందన్నదే అసలు ప్రశ్న. పరిశోధనకు తగిన నిధులు, ప్రయోగశాలలు, ఫెలోషిప్‌లు, స్థిరమైన ఉద్యోగాలు, వేగవంతమైన నియామక వ్యవస్థ, పరిశ్రమతో అనుసంధానం లేకుండా పీహెచ్‌డీ సంఖ్య పెంచడం మాత్రమే సరిపోదని నిపుణులు చెప్తున్నారు. భారత్‌ జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే పీహెచ్‌డీ ప్రవేశాలను పెంచడంతో పాటు.. ఆ పరిశోధకుల ప్రతిభ దేశంలోనే ఉపయోగపడేలా దీర్ఘకాలిక కెరీర్‌ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.

పీహెచ్‌డీ తర్వాతే అసలు సమస్య

పీహెచ్‌డీ పూర్తయ్యాక చాలా మంది పరిశోధకులు ఉద్యోగం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్‌ ఫ్యాకల్టీ పోస్టులు పరిమితంగా ఉండటం, నియామకాల్లో జాప్యం, పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌ల కొరత వంటి సమస్యలు పరిశోధకుల కెరీర్‌ను ప్రభావితం చేస్తున్నాయి. నిటి ఆయోగ్‌ కూడా దేశంలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధనా వ్యవస్థ బలహీనంగా ఉందనీ, అనేక మంజూరైన పోస్టులు ఖాళీగా ఉంటున్నాయనీ, పరిశోధనా రంగంలో కెరీర్ మార్గాలు ఆకర్షణీయంగా లేవని గుర్తించింది.ఒకవైపు పీహెచ్‌డీ చేయాలని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నా.. మరోవైపు వారికి తర్వాతి దశలో స్థిరమైన అవకాశాలు కల్పించడంలో వ్యవస్థ వెనుకబడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో ప్రభుత్వ పరిశోధనా ఉద్యోగాల వేతనాలు ప్రయివేటు రంగంతో పోటీ పడలేకపోతున్నాయని నిటి ఆయోగ్‌ పేర్కొంది. ఫలితంగా నైపుణ్యం ఉన్న పరిశోధకులు ప్రయివేటు రంగం లేదా విదేశాల వైపు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది.
డాక్టరేట్ల సంఖ్య పెరుగుతున్నా.. దారి చూపని వైనం
దేశంలో ఉన్నత విద్యను విస్తరిస్తున్నామని, పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ.. పీహెచ్‌డీ పూర్తిచేసిన తర్వాత పరిశోధకులకు ఎదురయ్యే ప్రశ్న మాత్రం అలాగే ఉంది. డాక్టరేట్‌ పొందిన వారికి సరిపడా ఉద్యోగాలు ఎక్కడ? పరిశోధన కొనసాగించేందుకు పోస్ట్‌డాక్టోరల్ అవకాశాలు ఎక్కడ? మంచి ప్రయోగశాలలు, స్థిరమైన పరిశోధనా వాతావరణం ఎక్కడ? పీహెచ్‌డీ ప్రవేశాలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఇప్పుడు మరింత కీలకంగా మారాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్