చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
విజ్ఞాన శాస్త్రానికీ
అంతుచిక్కని రసాయనాలు
80 శాతం రసాయనాల డేటాయే లేదు
న్యూఢిల్లీ : ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, బట్టలు, బొమ్మలు, ఇతర గృహ - వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాలలో 93 శాతం మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తు న్నాయని ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్ ఫౌండేషన్ అనే సంస్థ ఓ నివేదికలో హెచ్చరించింది. ఈ రసాయనాల కారణంగా క్యాన్సర్ వ్యాధి సోకే ప్రమాదం ఉన్నదని, జన్యుపరమైన మార్పులు సంభవిస్తాయని, పునరుత్పత్తి సమస్యలు ఎదురవుతాయని, అవయవాలపై విషపూరిత ప్రభావం పడుతుందని తెలిపింది. ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే ఐదు రకాల ప్లాస్టిక్‌ల ప్రభావాన్ని ఈ సంస్థ విశ్లేషించింది.
రసాయనాల ప్రభావం ఇదే
సంస్థ విశ్లేషణ ప్రకారం... ఆహారంతో సంబంధం ఉన్న ప్లాస్టిక్‌లలో కనిపించే రసాయనాలలో సుమారు 92 శాతం మన ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి. పిల్లల బొమ్మలలో దాదాపు 89 శాతం అధిక ప్రమాదకర ప్లాస్టిక్‌లు ఉన్నాయి. సుమారు 93 శాతం వస్త్రాలు, దుస్తులను ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తారు. బాటిల్ నీరు, వంటసామగ్రి, భోజన సామగ్రి, తోటపని పరికరాలు, టాయిలెట్ సామగ్రి, కార్యాలయ సామగ్రి వంటి 92 శాతం కంటే ఎక్కువ సాధారణ గృహోపకరణ వస్తువులలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. అలాగే పరిశుభ్రమైన వైద్య ప్లాస్టిక్‌లలో కూడా 93 శాతం ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. రోజువారీగా మనం వాడే ఉత్పత్తులలోని ప్లాస్టిక్ రసాయనాల సమాచారం విజ్ఞాన శాస్త్రానికి కూడా తెలియవంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రజలు తరచుగా ఉపయోగించే ప్లాస్టిక్‌లలోని 3.552 రసాయనాలలో సుమారు 80 శాతం రసాయనాల ప్రమాదాన్ని నిర్ధారించే సమాచారమేదీ అందుబాటులో లేదు. వినియోగదారులు ఉపయోగించే ఉత్పత్తులలో ఉండే చాలా రసాయనాల పేర్లు, వాటి కూర్పు కూడా మనకు తెలియదు.
జీవితంలో అంతర్భాగమై...
మన జీవితంలోని ప్రతి విషయంతోనూ ప్లాస్టిక్ ముడిపడి ఉంది. అమెరికా సూపర్ మార్కెట్లలో విక్రయించే 80 శాతం కంటే ఎక్కువ సరుకులు, పండ్లు, కూరగాయలు ఒక్కసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్‌లలో చుట్టి ఉంటాయి. సుమారు 60 శాతం దుస్తులను ప్లాస్టిక్ ఆధారిత సింథటిక్ ఫ్యాబ్రిక్‌లతో తయారు చేస్తారు. అలాగే పిల్లలు నోట్లో పెట్టుకొని ఆడుకునే బొమ్మలలో దాదాపు 90 శాతం ప్లాస్టిక్‌తోనే తయారవుతాయని అంచనా. వీటిలో చాలా బొమ్మలలో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు కలిపి ఉంటాయి. ప్లాస్టిక్‌లతో తయారు చేసే వేలాది గృహోపకరణ గిన్నెలు, పాత్రలు, వంట సామగ్రి, ఆహారాన్ని నిల్వ చేసే కంటైనర్లు...చివరికి ఫర్నీచర్‌లో సైతం రసాయనాలు ఉంటాయి. 2024లో ఓ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనలో పరిశోధకులు 16 వేల రసాయనాలను గుర్తించారు. వీటిలో 4,200 రసాయనాలను మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరమైనవిగా నిర్ధారించారు. మరో పది వేలకు పైగా రసాయనాలకు సంబంధించి డేటా ఏదీ అందుబాటులో లేదు.
అకాల మరణాలకు సైతం కారణం
మనం తినే అనేక ఆహార పదార్థాల చుట్టూ ప్లాస్టిక్ ఉంటుంది. అది మనల్ని పీఎఫ్‌ఏఎస్, థాలేట్స్ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలకు గురి చేస్తుంది. కొన్ని రసాయనాలు అకాల మరణానికి కారణమవుతాయి. థాలేట్స్ అనే రసాయనం కారణంగా కలిగే గుండె జబ్బులతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడుతు న్నారు. పీఎఫఏఎస్ అనే రసాయనం ఒక్క అమెరికా లోనే అనేక బిలియన్ డాలర్ల వైద్య ఖర్చు లకు కారణమవుతోంది. అనేక ప్లాస్టిక్ రసాయనాలు మన శరీరంలోని హార్మోన్లకు అంతరాయం కలిగి స్తాయి. ఫలితంగా ఊబకాయం, తక్కువ బరువుతో శిశువుల జననం, గర్భధారణ సమయంలో మధుమేహం, పుట్టుకతో వచ్చే లోపాలు, నాడీ సంబంధమైన లోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నేడు ప్రతి ఏటా 430 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. 2050 నాటికి ఇది రెట్టింపు కంటే ఎక్కువగా పెరుగుతుందని, దానితో పాటు రెండు బిలియన్ మెట్రిక్ టన్నుల రసాయన ప్లాస్టిక్ సంకలితాలు కూడా పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం రసాయన పరిశ్రమల వద్ద 3,25,000 సింథటిక్ రసాయనాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ మార్కెట్‌లో లేవు. వాటిలో గరి ష్టంగా 20 శాతం రసాయనాలకు సంబంధించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది.






కామెంట్‌లు (0)